తాడికొండ: అమరావతిని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్న బాబును తరిమికొడతామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 830వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో గురువారం పలువురు మాట్లాడారు. తన హయాంలో చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు బాబు ప్రజల్లో తిరిగి రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నాడని మండిపడ్డారు.
బహుజనుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.. మూడు పంటలు పండే భూములను లాక్కున్న కారణంగా పేదలకు కనీసం కూలి పనులు చేసుకునే పరిస్థితి లేక నేడు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. సీపీఐ, సీపీఎం, జనసేన, బీజేపీలు బాబు ఇచ్చే ప్యాకేజీలకు ఆశపడుతూ పేదలను పూర్తిగా పక్కనబెట్టి బాబు స్క్రిప్ట్‌ను చదువుతుండడం సిగ్గుచేటన్నారు. నేడు రాష్ట్రంలో పేదలకు సంక్షేమం నిండుగా అందుతుందనడంలో సందేహం లేదని, ప్రతి పేదవాడికి విద్యను అందించేందుకు కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యా రంగాన్ని తీర్చిదిద్దాడన్నారు. నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం, కారుమూరి పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment