సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా చంద్రబాబు వ్యాఖ్యలు: భూమన
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తన ప్రాణాలు కాపాడిన పరమాత్ముడితో పరాచికాలు ఆడితే ఆ పైశాచిక చేష్టలకు ఫలితం ఎలా ఉంటుందో ఆ దేవదేవుడే నిర్ణయిస్తాడని సీఎం చంద్రబాబునుద్దేశించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారి లడ్డూపై పదేపదే ఆయన చేస్తున్న ఆరోపణలను భగవంతుడు క్షమించడన్నారు. తాజాగా ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. బుధవారం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడారు.
సుప్రీం స్పష్టంగా ఆదేశించినా..
తిరుమల లడ్డూపై ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా సీఎం చంద్రబాబు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం ప్రధానిని కలుస్తానని వెళ్లిన చంద్రబాబు తిరుపతి లడ్డూ అందచేశారు. ఇది కల్తీ లడ్డూ కాదు సార్... స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిందని చెబితే బాబు చమత్కారానికి మోదీ విరగబడి నవ్వారట. దీనిపై చంద్రబాబును మందలిస్తే బాగుండేది.
కల్తీ నెయ్యి ఆరోపణలపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరపనున్న నేపథ్యంలో ప్రధానితో పాటు సీబీఐని ప్రభావితం చేసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. సిట్ నివేదిక తనకు అనుకూలంగా తెచ్చుకునేలా కుట్ర చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా తప్పు జరగలేదు. తిరుమల వైభవానికి భంగం వాటిల్లలేదు.
దీనిపై పీఠాధిపతులతో చర్చకు సిద్ధంగా ఉన్నా. చంద్రబాబుకు దమ్ముంటే నా సవాల్‌పై స్పందించాలి. కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీక్ష, జిల్లా యువత విభాగం అధ్యక్షుడు అజయ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు బొమ్మగుంట రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment