సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ నిమ్మగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని, ఎస్‌ఈసీకి ఉద్యోగుల ప్రాణాలు ఎస్‌ఈసీకి పట్టవా? అని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...వ్యాక్సినేషన్ పంపిణీ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. నిమ్మగడ్డ పునరాలోచించి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ( ఎన్నికల విధులు బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో)
ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘ నిమ్మగడ్డ దుర్మార్గంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిద్ధంగా లేమని ఉద్యోగులు చెప్తున్నారు.. మరోవైపు కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో నిమ్మగడ్డ నిర్ణయం సరికాదు’’ అన్నారు.
ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ.. ‘‘ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం సరికాదు. చంద్రబాబు చెప్పిందే నిమ్మగడ్డ చేస్తున్నారు. ఎస్‌ఈసీ నిర్ణయంతో ప్రజలు, ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు’’ అన్నారు.
పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘కరోనా బారిన పడి 109 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ జరిగాక ఎన్నికలు నిర్వహిస్తే మంచిది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment