బీసీ లంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్ అని సరికొత్త భాష్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాటి చెప్పారు. తాజాగా ప్రకటించిన రెండు ఎమ్మెల్సీలు కూడా బీసీలకే కేటాయించి మరోసారి వైఎస్సార్‌సీపీ వెనుకబడిన వర్గాల పక్షపాతి అని నిరూపించారు. – సాక్షి, విశాఖపట్నం
ఆ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు నిలిపి వేయడంతో కొరత పడిన 10 శాతం సీట్లను పార్టీ పరంగా కేటాయించాలని వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 98 వార్డుల్లో ఏకంగా 65 వార్డులను బీసీ వర్గాలకే కేటాయించి.. బీసీలకు సామాజిక న్యాయం అందించడంలో తానెంత ముందుంటానో నిరూపించారు. అదేవిధంగా బీసీలకు రిజర్వు చేసిన 9 జెడ్పీటీసీ స్థానాలతో పాటు మరో 10 జనరల్ స్థానాల్లో టికెట్లు కేటాయించారు.
జీవీఎంసీ మేయర్ పదవిని కూడా బీసీ మహిళకు అప్పగించారు. ఇవే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లోనూ బీసీ లబ్ధిదారులే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల ప్రకటించిన వివిధ కార్పొరేషన్ల పదవుల్లోనూ వెనుకబడిన తరగతులకు అగ్రస్థానం కల్పించారు. తాజాగా ప్రకటించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో విశాఖకు కేటాయించిన రెండు సీట్లనూ బీసీలకే ప్రకటించడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వంశీకృష్ణ శ్రీనివాస్ బీసీ (యాదవ) కాగా, వరుదు కల్యాణి కూడా బీసీ (వెలమ) కావడం గమనార్హం.
జగనన్నకు కృతజ్ఞతలు
పార్టీలో చేరినప్పటి నుంచి అనునిత్యం జగనన్న గుర్తింపునిస్తున్నారు. పార్టీ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు బాధ్యతాయుతమైన శాసన మండలి సభ్యుడిగా గుర్తింపునిచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందనడానికి ఇదే నిదర్శనం. పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ జగనన్న గుర్తింపునిస్తారు. ఎమ్మెల్సీ పదవిని బాధ్యతాయుతంగా నిర్వర్తించి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా. ఈ అవకాశం కల్పించిన సీఎం జగనన్నకు, రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.
– వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ అభ్యర్థి
ఇది నా అదృష్టం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కోసం కష్టపడిన వారిని ఎప్పుడూ విడిచి పెట్టరని మరోసారి నిరూపించారు. మిగిలిన పార్టీల్లో ఎవరు ఎంత డబ్బులిస్తే వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తుంటారు. కానీ.. వైఎస్ జగన్ మాత్రం పార్టీలో ఎంత కష్టపడ్డారో వారిని గుర్తించి పదవులు ఇస్తుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక బీసీ మహిళకు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా అదృష్టం. పదకొండేళ్లు జగనన్న వెంట నడిచాను. పార్టీ పదవుల్లో ఎన్నోసార్లు గుర్తింపు ఇచ్చారు. ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను.
– వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment