సాక్షి, తాడేపల్లి : రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలంతా ఎంతో దోచుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కృష్ణానది కరకట్టపై కనీసం రోడ్డు కూడా వేయలేకపోయారని విమర్శించారు. రాజధాని శంకుస్థాపన తర్వాత అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. రాజధాని కోసం ఎంత అప్పులు చేశారో.. ఎంత తిన్నారో అందరికీ తెలుసని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఆవేదన అంతా బినామీల భూముల ధరలు గురించే అని ధ్వజమెత్తారు. 1.50 లక్షల కోట్ల అంచనాలు వేసి.. 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తుచేశారు.
గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వైస్సార్సీపీకి ఇదే ఆఖరి ఛాన్స్ అని చంద్రబాబు అంటున్నారు. ఎందుకు ఆఖరి ఛాన్స్ అవుతుంది. ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు వైఎస్ జగన్ ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నారు. అమరావతి పోరాటం కేవలం పచ్చ మీడియాలో మాత్రమే జరిగింది. కమ్యూనిస్టులు దీనిలోకి ఎందుకువచ్చారో అర్థం కావడం లేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్ట్ కి వెళ్లిన చంద్రబాబును వెనకేసుకు రావడం ఏమిటి..? ఎందుకు ఇళ్ల స్థలాలను అడ్డుకున్నావ్ అని చెంద్రబాబును అడగలేకపోతున్నారు. అమరావతి పేరు వాడుకున్నారు తప్ప అమరావతి పట్టణాన్ని, దేవాలయాన్ని ఏమైనా అభివృద్ధి చేశారా.?
ఐదేళ్లలో అమరావతిలో చంద్రబాబు ఏం చేశారో చెప్పండి. ఐదేళ్లలో హైదరాబాద్ తన ఇంటిని మాత్రం పూర్తి చేసుకున్నారు. చంద్రబాబుకు ఓపిక అయిపోయింది, వయసు అయిపోయింది, ఎన్టీఆర్ని మోసం చేసినప్పటి జవసత్వాలు లేవు. సుమారు 23 సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఉండిపోయేలా మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న సీఎం జగన్‌ని ప్రజలు ఎలా వదులుకుంటారు. ఒక్కసారి మీ వాళ్ళని ప్రజల్లోకి పంపి వాస్తవాలు తెలుసుకో. కనీసం రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా బకాయి పెడితే మా ప్రభుత్వం ఇచ్చింది. మా మంత్రులంతా నీలా కక్కుర్తి పడేవారు అనుకున్నావా..? ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. ఆనాడే ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది అని చెప్పాం.
దమ్ముంటే నిరూపించండి అంటూ టీడీపీ నేతలు ప్రగల్బాలు పలికారు. విచారణ వేస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తప్పు చేయనప్పుడు ఎందుకంత భయం. మళ్లీ మళ్లీ చెప్తాము చంద్రబాబు, ఆయన తనయుడు అంతా అమరావతి పేరుతో దోచుకు తిన్నారు. అమరావతి పేరుతో అమాయక ప్రజలను మోసం చేయకండి. 13 జిల్లాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం. ఏ ఒక్క వర్గం కోసం మా ప్రభుత్వం పని చేయదు. అమరావతి అనేది రాష్ట్రంలో ఒక భాగం. తాడేపల్లి, మంగలిగిరిని కలిపి ఒక కార్పొరేషన్గా అభివృద్ధి చేయబోతున్నాం. రాజధానిలోని 29 గ్రామాలను అభివృద్ధి చేస్తాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment