మరో తుపాను హెచ్చరిక: ఏపీ అప్రమత్తం.. | Botsa Satyanarayana Video Conference With Municipal Commissioners | Sakshi
Sakshi News home page

పట్టణ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం 

Published Sat, Nov 28 2020 7:53 PM | Last Updated on Sun, Nov 29 2020 4:55 AM

Botsa Satyanarayana Video Conference With Municipal Commissioners - Sakshi

సాక్షి, విజయవాడ: నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. వరద నీటి నిల్వ కారణంగా ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన కార్యాచరణను అమలు చేయాలన్నారు. మరో రెండు రోజుల్లో ఇంకో తుపాను రానున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవడంతోపాటు, కంట్రోల్ రూంలను కొనసాగించాలని స్పష్టం చేశారు. పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, సీడీఎంఎ విజయకుమార్, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి రాంమనోహర్ రావు, డిటిసిపి రాముడు, ఇంజనీరింగ్ చీఫ్ చంద్రయ్య తదితర ఉన్నతాధికారులతో కలిసి విజయవాడ ఎఎంఆర్ డిఎ కార్యాలయం నుంచి  మున్సిపల్ కమిషనర్లతో శనివారం  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. (చదవండి: పన్నులపై రెండు పత్రికల దుష్ప్రచారం)

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షాలతో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైన మంచినీటి ట్యాంకులు, చెరువులకు గళ్లు పడకుండా, నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. రాకపోకలకు అంతరాయం కలిగించేలా, రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించడంతోపాటు, పూడుకుపోయిన డ్రైన్లను శుభ్రం చేయాలని అన్నారు. పంపిణీ చేస్తున్న తాగునీరు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన క్లోరినేషన్ ప్రక్రియను చేయడంతోపాటు, ఇళ్ల వద్ద ఉన్న కుళాయిల వద్ద నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పునరావాస కేంద్రాల్లోని వసతులపై  కమిషనర్ల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకుని, ఈ కేంద్రాల్లో ఆశ్రయం కల్పించిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తుపాను, భారీ వర్షాల అనంతరం నీటి నిల్వల కారణంగా అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తూ అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. (చదవండి: ఆయన మంత్రివర్గంలో పని చేయడం అదృష్టం)

మరో రెండు మూడు రోజుల్లో ఇంకో తుఫాను వచ్చే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని  మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిథిలోని అధికారులందరూ పూర్తి అప్రమత్తతతో ఉండాలని మంత్రి  సూచించారు. అనంతరం టిడ్కో గృహ నిర్మాణంపై సమీక్షిస్తూ, లబ్ధిదారులకు అర్హతా పత్రాల అందచేత, బ్యాంకు రుణాల టైఅప్ అంశాన్ని వేగవంతం చేయాలని, నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఇందుకు సంబంధించిన పనులన్నీ సక్రమంగా పూర్తి అయ్యేలా చూడాలని, లబ్ధిదారులకు సరైన, సక్రమమైన సమాచారాన్ని చేరేవేసేందుకు, వార్డు సెక్రటరీల సేవలను సమర్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతే కాకుండా వార్డు సెక్రటరీలకు వారి విధుల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఉన్నత స్థాయి శిక్షణా తరగతులను నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు.

మున్సిపల్ స్కూళ్లలో అమలవుతున్న నాడు నేడు కార్యక్రమాన్ని సమీక్షిస్తూ, నిర్దేశిత కాల పరిమితిలోగా, పాఠశాలల భవనాలకు మరమ్మత్తులు చేపట్టాలని, అన్ని వసతులను కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి బిపిఎస్, ఎల్ఆర్‌ఎస్ లలో పథకాల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనధికార కట్టడాలు, లేఅవుట్ల పై కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విషయంలో రాజీలేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement