సాక్షి, కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం(నేడు) తెల్లవారుజామున జరగాల్సిన ఓ వివాహం పెళ్లి కుమార్తె అయిష్టంతో నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణానికి చెందిన ఓ యువకునికి ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇరువైపులా పెళ్లి పత్రికలను బంధువులందరికీ పంచిపెట్టారు. కదిరిలో నృసింహుని సన్నిధిలో 6వ తేదీన చైత్ర బహుళ దశమి గురువారం తెల్లవారు జామున జరగాల్సి ఉంది. ఇరువైపుల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు ఆలయం చేరుకున్నారు. ఈలోగా పెళ్లి కుమార్తె తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, అబ్బాయి ఐటీఐ చదివి ఎంటెక్ అని అబద్ధం చెప్పాడని, తాను బీటెక్ చదివానని తన మనసులో మాట చెప్పింది.
దీనికి తోడు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, పెళ్లి వాయిదా వేసుకుందామని చెప్పినా బలవంతంగా తాళి కడతానని బెదిరిస్తున్నాడని కదిరి పట్టణ ఎస్‌ఐ మహమ్మద్ రఫి ఎదుట వాపోయింది. పెళ్లి ఇష్టం లేదని ముందే ఎందుకు చెప్పలేదని.. తమకు అవమానంగా ఉందని పెళ్లికుమారుడితో పాటు అతని తరపు బంధువులు అన్నారు. పెళ్లి కోసం ముందుగానే రూ.1.50 లక్షలు పెళ్లి కుమార్తె బ్యాంకు ఖాతాకు ఫోన్‌పే ద్వారా జమ చేశానని, ఆ డబ్బు ఇస్తే తన దారిన తాను వెళ్లిపోతానని ఆ యువకుడు తేల్చిచెప్పాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని, పెళ్లి కోసం ఇచ్చిన డబ్బులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోండని కదిరి టౌన్ ఎస్‌ఐ చెప్పడంతో చివరకు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment