ఆ రాక్షసుడు ఓ సైకో | ATM thief is a Psycho | Sakshi
Sakshi News home page

ఆ రాక్షసుడు ఓ సైకో

Published Sun, Nov 24 2013 5:09 PM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM

ఆ రాక్షసుడు ఓ సైకో

ఆ రాక్షసుడు ఓ సైకో

అనంతపురం: బెంగళూరులోని ఓ ఏటిఎం సెంటర్లో  ఈ నెల 19న ఓ మహిళపై రాక్షసంగా దాడి చేసింది ఓ సైకో అని తేలింది. ఆ సైకోకు ఇలాంటి వికృత చర్యలు కొత్తకాదని కూడా తెలిసింది. నిందితుడు గతంలో కూడా ఇటువంటి దోపిడీలకు పాల్పడినట్లు తెలిసింది.  అతను చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్‌ 10న అనంతపురం జిల్లా ధర్మవరం చంద్రబాబు నగర్‌లో ప్రమీలమ్మ అనే మహిళపై ఈ సైకో దాడి చేశాడు. ఆమె నుంచి 2 ఏటీఎం కార్డులు లాక్కున్నాడు.  పిన్‌ నంబర్‌ తెలుసుకుని ప్రమీలను హత్య చేశాడు.

ఆ రాత్రి కదిరికి పారిపోయాడు. 11న అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి ఓ కార్డు ద్వారా 4 వేల రూపాయలు డ్రా చేశాడు. తర్వాత బెంగళూరులో ఈ నెల15న మరో ఏటీఎం కార్డు ద్వారా 18 వేల రూపాయలు డ్రా చేశాడు. అయితే ప్రమీలమ్మ కుమారుడు ఆ రెండు ఏటీఎంలను బ్లాక్ చేయించారు. బ్లాక్‌ చేయించడంతో ఆ ఏటీఎం కార్డులు పనికిరాకుండా పోయాయి. దీంతో ఈ నెల 19న ఏటిఎం కేంద్రంలోనే  జ్యోతి ఉదయ్‌పై దాడి చేశాడు. ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.  ఆమెను తీవ్రంగా గాయపరిచాడు.  ఆమె వద్ద ఉన్న ఏటీఎం కార్డును దొంగిలించాడు.
 
కదిరిలో ఏటీఎం కార్డు ద్వారా డబ్బు డ్రా చేసిన సమయంలో, బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసినప్పుడు ఆ  సైకో ఒకే విధమైన దుస్తులు ధరించినట్లు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ద్వారా తెలిసింది. నిందితుడు బెంగళూరులో జ్యోతి ఉదయ్పై దాడి చేసిన తరువాత హిందూపురం చేరుకున్నట్లు సమాచారం.  సిసి కెమెరాలలోని దృశ్యాలు, ఇతరత్రా సేకరించిన సమాచారం  ఆధారంగా రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు శనివారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో బెంగళూరు పోలీసులు శనివారం ధర్మవరం చేరుకుని విచారించారు. నిందితుడి వ్యహారశైలిని పరిశీలించిన పోలీసులు అతనో సైకోగా తేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement