సాక్షి, అమరావతి/మధురానగర్ (విజయవాడ సెంట్రల్): పనిచేసే సంస్థలు, కంపెనీలకు బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు ఎంతలా తపన పడతామో.. అదేస్థాయిలో సాగులో కూడా బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు కృషిచేయాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి పిలుపునిచ్చారు. సాగుబాట పట్టిన ఏ ఒక్కరూ వెనక్కితిరిగి చూడకుండా ముందుకుదూసుకుపోవాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా నిలుస్తుందని చెప్పారు. విజయవాడలో గురువారం జరిగిన విద్యావంతులైన వ్యవసాయదారుల సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల జీతాలను వదులుకుని వ్యవసాయం పట్ల మక్కువతో సాగుబాట పట్టిన యువ రైతులంతా ఒకే వేదికపైకి రావడం శుభపరిణామమన్నారు. పండించే పంటలకు అదనపు విలువను జోడించేలా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం 30 నుంచి 50 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. రాష్ట్రస్థాయిలో సమాఖ్యగా ఏర్పడి మీరు పండించే ఉత్పత్తులకు బ్రాండింగ్ తీసుకురావాలని సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నేటి తరానికి ఆదర్శంగా సాగును లాభసాటిగా మార్చాలని కోరారు. స్త్రీనిధి బ్యాంక్ తరహాలో వ్యవసాయదారులంతా కలిసి ఓ బ్యాంకు ఏర్పాటు చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు.
డ్రోన్ టెక్నాలజీతో ఖర్చులు తగ్గించుకోవాలి
నాబార్డు మాజీ చైర్మన్ సీహెచ్.గోవిందరాజులు మాట్లాడుతూ రానున్న ఐదేళ్లు డ్రోన్ టెక్నాలజీదేనని చెప్పారు. డ్రోన్ల ద్వారా సాగుచేసి పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. సంప్రదాయ నాట్లు వేసే విధానాన్ని వదిలి డ్రోన్ల ద్వారా విత్తనాలు నాటుకుంటే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చన్నారు. సదస్సులో పలు తీర్మానాలు ఆమోదించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రామకృష్ణంరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌వర్మ, అఖిల భారత రైతు ఉత్పత్తిదారుల సంఘాల కన్వీనర్ జలగం కుమారస్వామి, భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాఘవులు, డైరెక్టర్లు క్రాంతికుమార్‌రెడ్డి, నరసింహరాజు, రైతునేస్తం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సదస్సులో చేసిన తీర్మానాలు..
దేశంలో మరే రాష్ట్రంలోను లేనిరీతిలో ప్రత్యేకంగా ఆర్గానిక్ పాలసీ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్గానిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా కృషిచేయాలి. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలి.
ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయం కోసం జాతీయ రహదారుల్లో ప్రతి వంద కిలోమీటర్లకు కనీసం 10 షాపులు నిర్మించి ఇవ్వాలి. రైతుబజార్లలో ప్రత్యేక స్టాల్ కేటాయించాలి.
ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలి.
జనవరి 5వ తేదీన విజయవాడలో కనీసం 10 వేలమందితో ఆర్గానిక్ వ్యవసాయదారుల రాష్ట్రస్థాయి సమ్మేళనం నిర్వహించాలి.
Comments
Please login to add a commentAdd a comment