మహారాణిపేట (విశాఖ దక్షిణ): గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల జీవీఎంసీ పరిధిలో ఉన్న రహదారులన్నీ దెబ్బతిన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రహదారులన్నీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తోందని, నిధులు కూడా కేటాయించామని ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి బూడి ముత్యాలనాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈనాడు పత్రిక పాత ఫొటోలు వేసి తప్పుగా ప్రచారం చేసిందని, ద్వారకానగర్‌లో జూన్ 6వ తేదీలోపు రహదారులు వేసినట్టు స్పష్టం చేశారు. ఇక్కడే మరమ్మతులు కూడా చేపట్టామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. మరమ్మతులు జరిగిన రహదారుల్లో పాత ఫొటోలతో పత్రికలో వేసి వార్తలు రాయడం దారుణమన్నారు. అల్లా ఉద్దీన్ అద్భుత దీపం మాదిరిగా రాత్రికి రాత్రి రోడ్లు వేయడం జరగదు కదా అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ రహదారులన్నీ ఛిద్రంగా మారాయని, దాని వల్లే ఇప్పుడు అధ్వానంగా తయారయ్యాయన్నారు.
పాత ఫొటోలు వేసి పచ్చ పత్రిక ప్రభుత్వంపై బురద జల్లేందుకు కంకణం కట్టుకుందన్నారు. జీవీంఎసీ పరిధిలోని అన్ని వార్డుల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం కార్పొరేటర్లు సూచనలు, సలహాలు మేరకు పనులు చేపడుతున్నట్టు చెప్పారు. జీవీఎంసీ పరిధిలో అన్ని వార్డుల్లో మొత్తం 6,900 గుంతలను, రహదారులను గుర్తించడం జరిగిందని, ఇందులో సుమారు 3,200 గుంతలను 9 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేసినట్టు చెప్పారు.
మిగిలిన 3,700 గుంతలు జూలై 15 నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే వార్డుల్లో పనుల కోసం ఒక్కొ కార్పొరేటర్‌కు రూ.కోటి 50 లక్షల కేటాయించామన్నారు. ఈ పనులు కూడా టెండర్లు పిలిచి త్వరగా చేపట్టాలని, వచ్చే సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
గ్రామీణా ప్రాంతాల్లో కూడా రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. నాడు–నేడు పథకం నిధులు కేటాయింపు ప్రక్రియ ప్రణాళిక బద్ధంగా జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రహదారుల కోసం రూ.1,073 కోట్లు కేటాయించామన్నారు. అలాగే మన్యం ప్రాంతాల్లో కూడ పీఆర్, ఆర్‌అండ్‌బీ రహదారులు వేయాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ శ, ఆర్‌డీవో డి.హుస్సేన్ సాహెబ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment