ఖజానాకు కన్నం! | Chandrababu Cabinet approves abolition of reverse tendering | Sakshi
Sakshi News home page

ఖజానాకు కన్నం!

Published Thu, Aug 29 2024 5:01 AM | Last Updated on Thu, Aug 29 2024 7:28 AM

Chandrababu Cabinet approves abolition of reverse tendering

రివర్స్‌ టెండరింగ్‌ రద్దుకు కేబినెట్‌ ఆమోదం

మళ్లీ 2014–19 పాత టెండర్‌ విధానం అమలుకు కూటమి సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

చంద్రబాబు పాలనలో అంచనాలు పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టిన వైనం

ఆ తర్వాత మొబిలైజేషన్‌ అడ్వాన్సులు.. కాంట్రాక్టర్ల నుంచి అవే కమీషన్లుగా వసూలు

ఆ అక్రమ వ్యవహారాలతో ఖజానాపై రూ.20 వేల కోట్లకుపైగా పెనుభారం

అధికారంలోకి రాగానే టెండర్ల వ్యవస్థను సంస్కరించిన వైఎస్‌ జగన్‌

రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన పనుల టెండర్‌ జ్యుడీషియల్‌ ప్రివ్యూకు

రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన పనులకు రివర్స్‌ టెండరింగ్‌లో టెండర్లు

అత్యంత పారదర్శక టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు పోటాపోటీ

కాంట్రాక్టు విలువ కంటే తక్కువకే పనులు చేసేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్లు

59 నెలల్లో రూ.3,60,448.45 కోట్ల విలువైన 4,36,164 పనులకు టెండర్లు నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

దేశ చరిత్రలో ఇదో రికార్డు.. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు రద్దు

ఇలాంటి దోపిడీకి మళ్లీ రాచమార్గం
పట్టిసీమ టెండర్లలో రూ. 257.45 కోట్ల లూటీ..2017–18లోనే కడిగేస్తూ కాగ్‌ నివేదిక
వైకుంఠపురం బ్యారేజ్‌ పనుల వ్యయాన్ని రూ.400 కోట్లు పెంచేసి 13.19 శాతం అధిక ధరలకు నవయుగకు ధారాదత్తం
పోలవరం హెడ్‌వర్క్స్‌లో జల విద్యుత్‌ కేంద్రం పనులను నవయుగకు 4.8 శాతం అధిక ధరలకు రూ.3,216.11 కోట్లకు అప్పగించిన బాబు  
మళ్లీ ఇప్పుడూ అదే రీతిలో కాంట్రాక్టర్లతో కలిసి ఖజానా దోచేసేందుకు సిద్ధం

నీతి ఆయోగ్‌ ప్రశంసించిన రివర్స్‌ టెండరింగ్‌
టెండర్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత
కాంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడి అధిక మొత్తం కోట్‌ చేయకుండా ఉంటారు.
ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు.
రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండర్‌ను జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపుతారు.
ప్రజల నుంచి ఆన్‌లైన్‌లో సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.
తక్కువ మొత్తం కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్‌–1గా నిర్ణయిస్తారు.   

రివర్స్‌ టెండరింగ్‌ రద్దుకు కేబినెట్‌ ఆమోదం
కంచే చేను మేస్తే?.. ప్రభుత్వ పెద్దలే అక్రమాలకు గేట్లెత్తితే? రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దుతో ఇప్పుడు అదే పునరావృతమవుతోంది!! ఖజానాకు టెండర్‌ పెట్టేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. జ్యుడీషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌తో టెండర్ల వ్యవస్థలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులకు మంగళం పాడింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దుకు రాష్ట్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. 


2014–19 మధ్య ఉన్న పాత టెండర్‌ విధానం అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో పనుల అంచనా వ్యయాన్ని లెక్కకట్టక ముందే కమీషన్‌ ఎక్కువ ఇచ్చేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై తర్వాత అంచనా వ్యయాన్ని భారీగా పెంచడం.. ఆ కాంట్రాక్టర్‌కే పనులు దక్కే నిబంధనలతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ .. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు పనులు అప్పగింత.. ఆ తర్వాత ఖజానా నుంచి మొబిలైజేషన్‌ అడ్వాన్సుల సంతర్పణ.. వాటినే కమీషన్లుగా వసూలు చేసుకునేందుకు రంగం సిద్ధమైంది.                    
– సాక్షి, అమరావతి

ఖజానాపై రూ.20 వేల కోట్ల భారం..
రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఖజానా లూటీకి టెండర్‌ విధానాలను ఓ అస్త్రంగా మల్చుకున్నారు. పనుల ప్రతిపాదన దశలోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయాన్ని పెంచడం.. అధికంగా కమీ­షన్లు ఇచ్చే కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నోటిఫి­కేషన్‌ జారీ చేయడం.. సగటున 4.85 శాతం అధిక ధరలకు పనులను కట్టబెట్టి ఖజా­నాకు కన్నం వేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా చెల్లించిన మొత్తాన్నే కమీషన్‌గా జేబులో వేసుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు.

అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో 2015 మార్చిలో రూ.1,170.25 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. 21.999 శాతం అధిక ధరలకు అంటే రూ.1,427.70 కోట్లకు కోట్‌ చేసిన కాంట్రాక్టు సంస్థ ఎల్‌–1గా నిలిచింది. ఆ సంస్థకు పనులు అప్పగించేశారు. దేశ చరిత్రలో కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు అత్యధికంగా అప్పగించిన టెండర్‌ ఇదే కావడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే అధిక ధరలకు కోట్‌ చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాలి. 

అయితే చంద్రబాబు మాత్రం ఐదు శాతం అధిక ధరలు, ఏడాదిలో ఎత్తిపోతల పూర్తి చేస్తే 16.999 శాతం బోన­స్‌గా ఇస్తామంటూ టెండర్‌ ఆమోదించేశారు. 2016 మార్చి నాటికి ఆ పథకం పూర్తయినా అప్పుడు గోదావరిలో ప్రవాహం లేనందున ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీటినేవి పరిగ­ణనలోకి తీసుకోకుండా అక్రమంగా 21.999 శాతం అధిక ధరలకు కాంట్రాక్టర్‌కు అప్పగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.257.45 కోట్ల భారం పడింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు పది శాతం నిధులను మొబిలైజే­షన్‌ అడ్వాన్సులుగా అప్పగించి కమీషన్లు రాబట్టుకున్నారు. పట్టిసీమ టెండర్‌లో నాటి చంద్రబాబు సర్కార్‌ ఖజానాను కాంట్రాక్టర్‌కు దోచిపెట్టిందని కాగ్‌ 2017–18లో ఇచ్చిన నివేదికే ఇందుకు నిదర్శనం.

⇒ ప్రకాశం బ్యారేజీకి 21 కి.మీ. ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కార్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని అమాంతం రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంటే అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

13.19% అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నిబంధనలకు విరుద్ధంగా నవయుగకు అప్పగించారు. అంచనాలు పెంచడం, అధిక ధరలకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీ సిపార్సు మేరకు వైకుంఠపురం బ్యారేజీ పనుల టెండర్‌ను రద్దు చేయడంతో నవయుగ దోపిడీకి బ్రేక్‌ పడింది.

⇒ 2014–19 మధ్య వివిధ శాఖల్లో మొత్తం రూ.3.51 లక్షల కోట్ల విలువైన పనులకు చంద్రబాబు సర్కార్‌ టెండర్లు నిర్వహించింది. ఎన్నికల సంవత్సరం 2018–19లోనే రూ.1.27 లక్షల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలి­చింది. అధిక ధరలకు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం ద్వారా ఖజానాపై రూ.20 వేల కోట్ల మేర భారం వేసి ఆ మేరకు కమీషన్ల రూపంలో చంద్రబాబు తన జేబులో వేసుకున్నారు.

⇒ 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ 2014–­19 తరహాలోనే కాంట్రాక్టర్లతో కలిసి ఖజానాను దోచేసేందుకు సిద్ధమైనట్లు తాజాగా రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దు నిర్ణయంతో స్పష్టమవుతోంది.

రివర్స్‌ టెండరింగ్‌ ఇదీ..
బోర్డు ఆఫ్‌ చీఫ్‌ ఇంజనీర్స్‌ (బీవోసీఈ) నివేదిక ఆధారంగా రివర్స్‌ టెండరింగ్‌పై 2019 ఆగస్టు 16న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జీవో ఎంఎస్‌ నెంబరు 67 జారీ చేసింది. ఈ విధానంలో జ్యూడీషియల్‌ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన కాంట్రాక్టు విలువను ఖరారు చేస్తూ టెండర్‌ షెడ్యూలు ముసాయిదాతోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. దీనివల్ల ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు. 

టెండర్‌లో ఆర్థిక బిడ్‌ తెరిచాక తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్‌–1గా ఖరారు చేస్తారు. ఎల్‌–1గా నిలిచిన కాంట్రాక్టర్‌ కోట్‌  చేసిన మొత్తానే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఆన్‌లైన్‌లో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తారు. అత్యంత తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌కు సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు పనులు అప్పగిస్తారు. గత ప్రభుత్వం 59 నెలల పాటు ఇదే పద్ధతిలో టెండర్లు నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా చేసింది.

రివర్స్‌ టెండరింగ్‌తో పగిలిన అక్రమాల పుట్ట..
2019 మే 30న ముఖ్య­మంత్రిగా ప్రమాణ స్వీకా­రం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టెండర్ల వ్యవస్థను సంస్కరించారు. జ్యుడీషియల్‌ ప్రివ్యూ వ్యవస్థను ప్రవేశపెట్టారు. రూ.వంద కోట్లు అంతకంటే అధిక వ్యయం ఉన్న పనుల టెండర్‌ ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడీషియల్‌ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపాలని ఆదేశించారు. దీనిపై జ్యుడీషియల్‌ ప్రివ్యూ జడ్జి ఆన్‌లైన్‌లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేలా విధాన నిర్ణయం తీసుకున్నారు. 

వాటిని పరిగణనలోకి తీసుకుని టెండర్‌ ముసాయిదా షెడ్యూలులో మార్పుచేర్పులను జడ్జి సూచి­స్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే ముసాయిదా షెడ్యూల్‌ను యథాతధంగా ఆమోది­స్తారు. జ్యూడీషియల్‌ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్‌ ముసాయిదా షెడ్యూలుతోనే టెండర్‌ నోటిఫికే­షన్‌ జారీ చేసేలా చర్యలు చేపట్టారు. ఇక రూ.కోటి అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో టెండర్లు నిర్వహించేలా విధానాన్ని రూపొందించారు. దీనిద్వారా టెండర్ల వ్యవస్థను అత్యంత పారదర్శకంగా మార్చారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చే నిబంధనను తొలగించారు.

⇒ రాష్ట్రంలో 2014–19 మధ్య సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రివర్స్‌ టెండరింగ్‌కు వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. తొలుత పోలవరం ఎడమ కాలువ అనుసంధానం (ప్యాకేజీ–65) పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. ఈ పనులను 2018లో రూ.278 కోట్ల అంచనా వ్యయంతో టీడీపీ సర్కార్‌ నిర్వహించిన టెండర్లలో 4.8 శాతం అధిక ధరలకు అంటే రూ.292.09 కోట్లకు మ్యాక్స్‌ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారు. దీనివల్ల ఖజానాపై రూ.14.09 కోట్ల భారం పడింది. 

చంద్రబాబు సర్కార్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించిన పనుల విలువ మొత్తం రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా పరిగణించి వైఎస్‌ జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. ఆరు సంస్థలు పోటాపోటీగా బిడ్‌లు దాఖలు చేశాయి. టీడీపీ హయాంలో రూ.292.09 కోట్లకు పనులను దక్కించుకున్న మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థే రివర్స్‌ టెండరింగ్‌లో రూ.231.47 కోట్లకే పనులు చేయడానికి ముందుకొచ్చింది. దాంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. తద్వారా చంద్రబాబు సర్కార్‌ అక్రమాలు బట్టబయలయ్యాయి.

⇒ పోలవరం హెడ్‌ వర్క్స్‌ (జలాశయం)లో రూ.2,917 కోట్ల విలువైన పనులను నవయుగకు చంద్రబాబు నామినేషన్‌పై కట్టబెట్టారు. ఇందులో 2019 మే 30 నాటికి రూ.1,771.44 కోట్ల విలువైన పనులు మిగిలాయి. హెడ్‌ వర్క్స్‌కు అనుసంధానంగా 960 మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రం పనులను కూడా నవయుగకే 4.8 శాతం అధిక ధరలకు రూ.3,216.11 కోట్లకు చంద్రబాబు అప్పగించారు. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు వైఎస్‌ జగన్‌ ఈ రెండు పనులను రద్దు చేశారు. నవయుగకు అప్పగించిన విలువనే కాంట్రాక్టు విలువగా పరిగణించి రెండింటినీ కలిపి ఒకే ప్యాకేజీ కింద రూ.4,987.55 కోట్లతో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. 

ఈ పనులను 12.6 శాతం తక్కువ ధరలకు అంటే రూ.4,358.11 కోట్లకే చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దాంతో ప్రభుత్వ ఖజానాకు రూ.629.44 కోట్లు ఆదా అయ్యాయి. చంద్రబాబు సర్కార్‌ గతంతో జలవిద్యుత్కేంద్రం పనులను 4.8 శాతం అధిక ధరలకు అప్పగించడం వల్ల ఖజానాపై రూ.154 కోట్ల భారం పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ.783.44 కోట్లు ఆదా అవడంతో చంద్రబాబు అక్రమాలు మరోసారి నిరూపితమయ్యాయి.

⇒ ఒక్క సాగునీటి ప్రాజెక్టుల పనుల్లోనే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.2,500 కోట్లకుపైగా ఆదా చేసింది. రహదారులు, భవనాలు, పురపాలక, పట్టణాభివృద్ధి తదితర శాఖల్లో మొత్తం రూ.3,60,448.45 కోట్ల విలువైన 4,36,164 పనులకు టెండర్లు నిర్వహించగా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.7,500 కోట్లకుపైగా ఖజానాకు ఆదా అయ్యాయి. దేశ చరిత్రలో ఇదో రికార్డు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత పారదర్శకమైన టెండర్ల విధానం అమల్లో ఉందని, ఇది దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని నాడు నీతి అయోగ్‌ ప్రశంసించడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement