
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నాలుక బయటపెట్టి ‘ఉత్తినేలే’ అంటూ కార్యకర్తలకు సైగ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
సాక్షి, అమరావతి: ఆధారాలతో అడ్డంగా దొరికిపోవడంతో తన అరెస్టు ఖాయమని రెండు రోజుల ముందే గ్రహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సానుభూతి నాటకానికి ప్రయత్నించి భంగపడ్డారు. ఆయన అరెస్ట్‌ను ప్రజానీకం అసలు పట్టించుకోలేదు. తనను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో విధ్వంసం, అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ముందుగానే సందేశాన్నిచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని పథకం పన్నారు.
రెండు రోజులుగా టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల టీడీపీ నేతలకు ఫోన్లు వెళ్లాయి. వాట్సాప్ సందేశాలు పంపారు. తన అరెస్టును టీడీపీ శ్రేణులు సైతం పట్టించుకోకపోవడంతో చంద్రబాబు హతాశుడయ్యారు. బాబును అరెస్టు చేసిన అనంతరం నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తుండగా చిలకలూరిపేట లాంటి ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడా స్పందన లభించలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 175 కి.మీ. ప్రయాణించినా పార్టీ క్యాడర్‌లో స్పందన కనబడలేదు.
కళ్లెదుటే కనిపిస్తున్న అవినీతి..
తన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో బాబులో కొంతకాలంగా ఆందోళ న పెరుగుతోంది. నిధులు కొల్లగొట్టేందుకు పకడ్బందీగా నిర్మించుకున్న అక్రమ నెట్‌వర్క్‌ను కేంద్ర ఆదాయపన్ను శాఖ, సీఐడీ అధికారులు ఛేదించడంతో ఆయన అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఇక తన అరెస్ట్ తప్పదని గుర్తించిన చంద్రబాబు సాను భూతి పొందాలని ఎత్తుగడ వేశారు.
రాజకీయంగా తెలివైన ఎత్తుగడ వేశానని భావించారు. అయితే ప్రజలు వీటిని ఏమాత్రం పట్టించుకోలేదు. సీఐడీతోపాటు కేంద్ర ఆదాయపన్ను శాఖ, ఈడీలు కూడా ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో చంద్రబాబు అవినీతి పాల్పడ్డారని అప్పటికే ఆధారాలతో సహా నిర్ధారించాయి.
ఈడీ కూడా నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు షెల్ కంపెనీల ఆస్తులను అటాచ్ చేసింది. ఇక సీఐడీ అప్పటికే ఎనిమిదిమంది నిందితులను అరెస్ట్ చేసింది. ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో భారీ అవినీతి జరిగిందన్న ఏకాభిప్రాయం సర్వత్రా వినిపించింది. ఆయన అవినీతి కళ్లెదుటే కనపడుతున్నప్పుడు బాబు అరెస్ట్ అయితే అందులో తప్పేమిటి? అనే ప్రజలు భావించారు.
పుంగనూరు, భీమవరం తరహాలో..
తన అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోకపోయినా కనీసం టీడీపీ శ్రేణులైనా తీవ్రంగా పరిగణించాలని ఆశించిన చంద్రబాబుకు నిరాశే మిగిలింది. తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని అట్టుడికించాలని ఆయన భావించారు. ఇటీవల అన్నమయ్య, చిత్తూరు జిల్లాల పర్యటనల్లో పోలీసులపై దాడులకు పాల్పడేలా టీడీపీ నేతలు, కార్యకర్తలను చంద్రబాబు ప్రేరేపించారు. తాజాగా భీమవరంలోనూ అదే రీతిలో లోకేశ్ ఘర్షణలు సృష్టించారు.
అదే రీతిలో మరోసారి కార్యకర్తల్ని రెచ్చగొట్టేందుకు చంద్రబాబు యత్నించారు. విధ్వంసం సృష్టించడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఆయన టీడీపీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. అయితే దీన్ని ఏ జిల్లాలోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పట్టించుకోలేదు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత ఆ పార్టీ శ్రేణుల నుంచి ఆయన ఆశించిన ప్రతిస్పందన లభించ లేదు. సీనియర్ నేతలు కూడా తూతూ మంత్రంగా మీడియాతో మాట్లాడి సరిపెట్టారు.
పూర్తి ఆధారాలతో చంద్రబాబు అవినీతి నిర్ధారణ అయిన తరువాత ఇక తాము చేసేదేముందీ అని పలువురు టీడీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకోవడం కనిపించింది. చంద్రబాబు మాటలను నమ్మి విధ్వంసాలకు దిగితే తరువాత పోలీసు కేసులు ఎదుర్కోవాల్సింది తామే గానీ పార్టీ పట్టించుకోదని వారు గ్రహించారు. తమ అధినేత అవినీతి స్పష్టంగా తేలిన తరువాత కూడా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తించారు.
నేడు నిరాహార దీక్షలకు టీడీపీ పిలుపు
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆదివారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మమ్మల్ని అరెస్టు చేయండి ప్లీజ్..
కొందరు టీడీపీ నేతలు పోలీసులకు ఫోన్లు చేసి తమను అరెస్టు చేయాలని, గృహ నిర్భంధం చేయాలని వేడుకోవడం విశేషం. గుడివాడలో టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరావు అలా బయటకు వచ్చి పోలీసులు అడ్డుకోగానే వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయారు. తణుకులో ఆ పార్టీ ఇన్‌చార్జి ఆరిమిల్లి రాధాకృష్ణ పోలీసులు తనను లాక్కెళుతున్నట్లు సీన్ క్రియేట్ చేసి వెంటనే ఏమీ లేదన్నట్లు తన అనుచరుడికి సైగ చేస్తున్న దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది.