లోకేశ్‌తో సహా ఏ రూపంలోనూ భవిష్యత్తు కనిపించకపోవటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబులో ఈ మధ్య నిరాశా నిస్పృహలు పతాక స్థాయికి చేరిపోయాయి. దీంతో తన అసహనాన్ని రోజుకోరకంగా వ్యక్తంచేస్తూ...ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని స్థితికి చేరుకున్నారు. గురువారం గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లి... ‘నేను వస్తున్నానని ఇప్పుడు రెండేసి వేలు ఇచ్చారు’ అంటూ ప్రభుత్వంపై చేసిన విమర్శలు దీనికి పరాకాష్టగా చెప్పాలి. బాధితుల పరామర్శను ఒక దండయాత్రలా... జైత్రయాత్రలా మార్చేసి విజయసూచికలుచూపిస్తూ తిరిగిన బాబు... పర్యటనలో భాగంగా ప్రభుత్వ సాయం అందని ఒక్కరంటే ఒక్కరిని కూడా చూడలేకపోయారు.
ఎక్కడ ఎంతమందిని అడిగినా... ప్రతి ఒక్కరూ తమకు ప్రభుత్వ సాయం అందిందనే చెప్పటంతో ఏం చేయాలో అర్థం కాని బాబు... తాను వస్తున్నానని ప్రభుత్వం అప్పటికప్పుడు రూ.2వేలు చొప్పున ఇచ్చిందంటూ వ్యాఖ్యలు చేసి, వాటినే తన ‘ఈనాడు’లో రాయించుకున్నారు. వరద తాకిడికి గురైన కుటుంబాలను సురక్షిత శిబిరాలకు తరలించటంతో పాటు... శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటపుడు రూ.2 వేలు చొప్పున ఇవ్వాలనేది ప్రభుత్వ విధానమని, గతంలో రాజంపేటలో కూడా ప్రభుత్వం ఇలానే ఇచ్చిందని తెలియదా? గోదావరి వరదల తొలిరోజునే ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించి... వారికి సరైన ఏర్పాట్లు చేయటంతో పాటు ఆహార వసతి కల్పించి, సరుకులు పంపిణీ చేసి...ఈ రూ.2 వేల చొప్పున కూడా ఇవ్వాలని చెప్పటం బాబుకు తెలియదనుకోవాలా? మరీ ఇలా మాట్లాడితేనే...‘అలా వదిలేకండ్రా... ఎవరికైనా చూపించండ్రా’ అనే డైలాగ్ గుర్తుకొచ్చేది!!.
అసలు లక్షకు పైగా కుటుంబాలకు రూ.2వేల చొప్పున ఇవ్వాలంటే ఒక్క రోజులో సాధ్యమా? ఆ మాత్రం స్పృహ ఉండాలి కదా? చంద్రబాబు రాకపోతే ఈ సాయం ఆగిపోతుందా? బహుశా బాబు రాకుంటే ఆయన వెనక ఉన్న కొద్ది మంది అధికారులు కూడా నేరుగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు కనక మరింత వేగంగా సాయం అందేదేమో!! అసలు చరిత్ర ఎరుగని రీతిలో వచ్చిన ఈ వరదల్లో ప్రాణ నష్టం అతి స్వల్పం. మృతులు ముగ్గురు. వందల ఊళ్లు మునిగినా పెద్దగా ప్రాణ నష్టం జరగకపోవటానికి కారణం ప్రభుత్వం అత్యంత వేగంగా తీసుకున్న ముందస్తు చర్యలేనని వేరే చెప్పాలా?. అసలు ఇంత రంధ్రాన్వేషణ చేసి కూడా ప్రభుత్వ సాయం అందని బాధితుడిని ఒక్కరినీ చూపించలేకపోయారంటే ముఖ్యమంత్రి చిత్తశుద్ధి, నిబద్ధత అర్థం కావటం లేదా బాబూ? ఇంతకన్నా పారదర్శకత ఇంకెక్కడ ఉంది? ప్రభుత్వం పని చేసింది కాబట్టే కదా జనమెవ్వరూ తమకు సాయం అందలేదని చెప్పనిది?
గతంకన్నా మిన్నగా ఈ సారి ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలతో పాటు ఆరు జిల్లాల యంత్రాంగం అతివేగంగా కదిలింది. వలంటీర్లు, గ్రామ సచివాలయల సిబ్బంది కలిసి దాదాపు 40 వేల మంది జగనన్న సైన్యం అన్ని ప్రాంతాలకూ సాయాన్ని తీసుకెళ్లారు. అంత వరదల్లోనూ చక్కని భోజనాలు వండి సరఫరా చేశారు. ఇప్పుడు సీఎం ఆదేశాలతో ఇతర జిల్లాల పారిశుద్ధ్య సిబ్బంది కూడా తరలివెళ్లి... నీరు వెళ్లిపోయిన చోట వరద అనంతర పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ మాదిరిగా రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు.. మొదట తన హయాంలో ఒక్క రూపాయి కూడా ఎందుకివ్వలేదో చెప్పాల్సిన అవసరం లేదా? దాన్ని ‘ఈనాడు’లాంటి మీడియా ప్రశ్నించదా? మరి అలాంటి వ్యక్తికి సాయం తక్కువైందని డిమాండ్ చేసే అర్హత ఉందా? ఆయన హయాంలో ఇంత వేగంగా సాయం అందిందెప్పుడు? ఏ విపత్తులో చూసినా ‘షో’ సూపర్ తీరేగా!!. బాధితుల పట్ల నిజంగా మానవత్వం చూపించిన సందర్భాలున్నాయా? బాధిత ప్రాంతాలకు వెళ్లి... అక్కడే రెండ్రోజులు కారవాన్లలో బస చేసి... మొత్తం అధికార యంత్రాంగమంతా తన చుట్టూనే ఉండేలా చూసుకుని... అదే తన అనుకూల మీడియా ప్రచురించేలా చూసుకోవటం చంద్రబాబు స్ట్రాటజీ. ‘బాబు అది చేశారు...బాబు ఇది చేశారు’ అనేవి ఆ మర్నాడు పత్రికల్లో వచ్చే పతాక శీర్షికలు. అంతే తప్ప బాధితులకు నిజంగా ఏం మేలు జరిగింది? ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఎందరు కోలుకున్నారు? అనే వార్తలేవీ ఉండవు.
ఇదీ... బాబు ప్రభుత్వానికీ ఇప్పటికీ తేడా
ఇప్పుడు బాబు తరహా పరిస్థితి ఎంతమాత్రం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా పబ్లిసిటీ కోసం షో చేసే వ్యక్తి కాదు. నిజంగా ప్రజలకు మంచి చేయాలనే నిబద్ధతతో, మానవత్వంతో పనిచేసే సీఎం. అందుకే తాను తెరవెనకనే ఉండి ప్రతిరోజూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. కావాల్సిన నిధులు విడుదల చేస్తూ... ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలిచారు. సంపూర్ణంగా, సమర్థంగా సహాయ కార్యక్రమాలను నడిపించారు. అధికారులకు తగిన ఆదేశాలివ్వటమే కాక... వాటి అమలుకు తగిన సమయమూ ఇచ్చారు. శుక్రవారం ఉదయం వరకూ గోదావరి నదికి 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే వచ్చింది కనకే ఇంకా వరద నష్టాలపై అంచనాలు కొలిక్కిరాలేదు. వరద తగ్గుతోంది కనక అంచనా వేయటం ఆరంభమవుతుంది. దాని ప్రకారం తగిన చర్యలుంటాయి. చంద్రబాబులా కాకుండా వైఎస్ జగన్ ప్రజలకోసం పనిచేసే సీఎం కాబట్టే... భూతద్దం పట్టుకుని వెదికినా సాయం అందని ఒక్కరినీ చంద్రబాబు చూపించలేకపోయారు.
తిత్లీ బాధితులకుపరిహారమూ ఇవ్వలేదు...
2015 నవంబర్లో అకాల వర్షాలకు 8 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఏకంగా 81 మంది మరణించారు. 2016లో అకాల వర్షాలకు మృత్యువాత పడింది 19 మంది. 2017 భారీ వర్షాలకు మృతి చెందింది 31 మంది.. తిత్లీ తుపాను దెబ్బకు పిట్టల్లా రాలిపోయింది 14 మంది. విపత్తుల వేళ చంద్రబాబుది అడుగడుగునా వైఫల్యమేనని చెప్పటానికి ఈ సంఖ్యలు చాలవూ? తిత్లీ తుపాను ఉత్తరాంధ్రపై భయంకరంగా విరుచుకుపడినప్పుడు చంద్రబాబు సర్కార్ పూర్తిగా చేతులెత్తేసింది. వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థను పక్కనపెట్టి ప్రచారం కోసం తాను నెలకొల్పిన ఆర్టీజీఎస్ ద్వారా తుపానును పర్యవేక్షించారు. తుపాను తీరం దాటకపోయినా నాటి ఆర్టీజీఎస్ దాటినట్లు ప్రకటించింది. తప్పుడు హెచ్చరికల ఫలితంగా క్షేత్ర స్థాయిలో తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు సరైన చర్యలు తీసుకోలేకపోవటంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఊహించని నష్టం జరిగింది. 14 మంది చనిపోగా రూ.500 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. తానే తుపానును కంట్రోల్ చేస్తానంటూ గొప్పలకు పోయిన చంద్రబాబు... జరిగిన తప్పు బయట పడకుండా తన మీడియా ద్వారా దాన్నో విజయంగా ప్రకటించుకున్నారు. తాను అధికారం నుంచి దిగిపోయే నాటికి కూడా తిత్లీ తుపాను బాధితులకు పూర్తిగా పరిహారం చెల్లించలేదు. తరవాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీన్ని చెల్లించింది. బాబు హయాంలో హుద్‌హుద్, పెథాయ్ తుపాన్లు.. అకాల వర్షాలు వచ్చినపుడు కూడా అపార నష్టం జరిగింది.
గతానికి భిన్నంగా... ఇప్పుడు
ఇప్పటి పరిస్థితి బాబు హయాం మాదిరి కాదు. సహాయక చర్యలు వేగంగా, ముమ్మరంగా సాగుతున్నాయి. వరద వస్తుందనే సమాచారం తెలిసినప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ నిరంతరం ఉన్నత స్థాయి సమీక్షలు జరిపి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గ్రామ వలంటీర్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల వరకు వివిధ శాఖలకు చెందిన 40 వేల మందిని ఒక సైన్యంలా సహాయక చర్యల్లో భాగం చేశారు. స్టేట్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం హెచ్చరికలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారిని హెచ్చరిస్తూ 20 లక్షల ఎస్‌ఎంఎస్‌లు పంపడం అధికార యంత్రాంగం పనితీరుకు ఒక మచ్చుతునక. ఆరు జిల్లాల్లో 218 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి 1.43 లక్షల మందికి వాటిల్లో ఆశ్రయం, భోజన సౌకర్యాలు కల్పించారు. సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందిన 93 వేల కుటుంబాలకు రూ.1000 నుంచి రూ.2 వేల నగదు సాయాన్ని అందించారు.
తక్షణ అవసరాలకు రూ.43.50 కోట్లు విడుదల
వరద నీరు చేరిన ప్రాంతాల్లోని లక్షకుపైగా కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, లీటర్ పామాయిల్ అందించారు. ఇప్పటివరకు 2241 టన్నుల బియ్యం, 150 టన్నుల కందిపప్పు, 1.28 లక్షల లీటర్ల పామాయిల్, 1.36 లక్షల లీటర్ల పాలు, 152 టన్నుల చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు పంపిణీ చేశారు. ఇందుకోసం తక్షణ అవసరాల కింద మొత్తం రూ.43.50 కోట్లను కలెక్టర్లకు విడుదల చేయగా వారు సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఈ స్థాయి సాయం ఎప్పుడూ జరగలేదని ప్రతి బాధితుడూ చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగదు సాయం లేనేలేదు. నాలుగు టమాటాలు, నాలుగు బంగాళాదుంపలు పంచుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు తన హయాంలో ఏ కుటుంబానికీ 25 కేజీల బియ్యం, ఇతర నిత్యావసరాలు ఇచ్చిన ఉదంతాలు లేవు. తిత్లి తుఫాను బాధితుల ఖాతాలో ఒక్క రూపాయి వేసిన ఘనత చంద్రబాబుది.
Comments
Please login to add a commentAdd a comment