సాక్షి, అమరావతి: సభలో సభ్యులు అందరూ మాట్లాడతారని అనుకున్నామని, కానీ, టీడీపీ తీరుతో అంతా తలకిందులైందని అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. సమావేశాల ప్రారంభంలోనే గవర్నర్‌ని అవమానిస్తూ టీడీపీ సభ్యులు ఘోరాలకు పాల్పడ్డారని, అది చూసి ముఖ్యమంత్రి సహా అంతా ఆశ్చర్యపోయారని శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపించారు.
బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం.. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. వ్యవస్థలను నాశనం చేసింది చంద్రబాబే అని, టీడీపీ సభ్యులు పబ్లిసిటీ కోసం అసెంబ్లీలో గవర్నర్ ని సైతం అవమానపరిచారని గుర్తు చేశారు. ఆపై సభలోనూ టీడీపీ సభ్యులు సరిగా వ్యవహరించలేదు. ఏదైనా అనుమానం ఉంటే అడగాల్సింది. కానీ, వాళ్ల ప్రవర్తన చూశాక.. టీడీపీ అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేవలం సభలో అలజడి సృష్టించడానికే వాళ్లు వచ్చారు. సభలోకి వచ్చి గొడవ చేసి బయటకు వెళ్లిపోవడమే పనిగా పెట్టుకున్నారు. సభ జరిగినంత కాలం చిడతలు కొట్టడం, కాగితాలు చించటం చేశారు.
పోనీ.. వారు వేసిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పనీయకుండా చేశారు. ఇళ్ల పట్టాల మీద స్వల్ప కాలిక చర్చ పెడితే దానిలో కూడా మాట్లాడలేదు. తమ ఎల్లో మీడియా ద్వారా పోలవరం ఎత్తు తగ్గించారంటూ రచ్చ చేశారు. సరేనని దానిపై చర్చ పెడితే టీడీపీ సభ్యులు మాట్లాడలేదు. మద్యం పాలసీపై స్వల్ప కాలిక చర్చ పెడితే.. అందులోనూ పాల్గొనలేదు. ఆఖరికి.. అసెంబ్లీ హక్కుల గురించి చర్చ పెట్టినా వారు రాలేదు. ప్రతీ అంశంపై సీఎం జగన్ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. అసలు చర్చలపై పట్టుబట్టిందే వాళ్లు. కానీ, చర్చకు రాకుండా గొడవలు చేశారు అంటూ టీడీపీ తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్.
Comments
Please login to add a commentAdd a comment