సాక్షి, అమరావతి: సామాన్యులకు పూర్తి న్యాయం అందాలన్నా, కోర్టుల్లో కేసులు పేరుకుపోకుండా ఉండాలన్నా స్వతంత్ర ప్రతిపత్తి గల పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. దిగువ కోర్టుల్లో స్థానిక భాషలోనే వాదనలు జరగాలని, అప్పుడే సామాన్యుడికి న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్‌లో జస్టిస్ రమణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
జస్టిస్ రమణ మాట్లాడుతూ.. న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరిస్తే కేసులు త్వరితగతిన పరిష్కారం కావడంతోపాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందన్నారు. తన ప్రస్థానం బెజవాడ బార్ అసోసియేషన్ నుంచే మొదలైందని చెబుతూ.. జూనియర్ అడ్వకేట్‌గా ఇక్కడ ప్రాక్టీస్ చేసిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. గత ప్రభుత్వాలు న్యాయవ్యవస్థపై సరైన శ్రద్ధ చూపలేదని, పదకొండేళ్లుగా కోర్టుకు సొంత భవనం లేనప్పటికీ న్యాయవాదులు సహనంగా ఉండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అడ్వకేట్లు కొంత సమయాన్ని ఉచిత న్యాయ సహాయం చేసేందుకు వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రసంగించారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణతో పాటు ఆసోసియేషన్ సభ్యులూ పాల్గొన్నారు. ఇక తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన మణి మాస్టారును సీజేఐ సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment