తిరుపతి లడ్డూలో కల్తీపై తప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు యత్నం
కల్తీపై వాస్తవాలను వైఎస్ జగన్ ప్రజల ముందుంచడంతో కంగుతిన్న బాబు
ఏఆర్ డెయిరీ ట్యాంకర్లు నాలుగు వినియోగించామన్న బాబు
వాడిన నెయ్యి కల్తీదా అని అడిగితే.. ఆ తర్వాత జరిగింది కదా అంటూ బుకాయింపు
వైఎస్ జగన్ పట్ల అవహేళనగా వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిపోయిందంటూ నిన్నటివరకు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. అదంతా ఉత్తి అసత్య ప్రచారమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశదీకరించి, వాస్తవాలను ప్రజల ముందుంచడంతో కంగుతిన్నారు. కల్తీ జరిగిన నెయ్యిని ఎక్కడ వాడారన్నది అప్రస్తుతమంటూ చంద్రబాబు తప్పించుకొనే ప్రయత్నం చేశారు.
బాబు శుక్రవారం సాయంత్రం సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఏఆర్ డెయిరీ నెయ్యిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వినియోగించారా లేక దేనికోసం ఎక్కడ వాడారు అన్నది అప్రస్తుతమంటూ మాట మార్చారు. ఏఆర్ డెయిరీ మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి పంపితే అందులో నాలుగు ట్యాంకర్ల నెయ్యి వినియోగించామని, మరో నాలుగు ట్యాంకర్లను పరీక్ష కోసం ఎన్డీడీబీకి పంపితే ఆ నివేదిక ఆధారంగా వాటిని తిరస్కరించామని అన్నారు.
ముందు వినియోగించిన నాలుగు ట్యాంకర్లలో కల్తీ జరిగిందా అని అడగ్గా.. ఆ తర్వాత ట్యాంకర్లలో జరిగింది కదా అంటూ అడ్డంగా బుకాయించారు. తన తప్పుడు ప్రచారాన్ని సమర్థించుకోవడానికి ఆపసోపాలు పడ్డారు. ఇప్పటివరకు తిరుమలలో ఎటువంటి ల్యాబులు లేవన్న చంద్రబాబు.. ఇప్పుడు కేవలం నాణ్యత ప్రమాణాలు పరిశీలించే ల్యాబులు మాత్రమే ఉన్నాయని ఒప్పుకొంటూనే.. మరోపక్క కల్తీ జరిగిందా లేదా అన్న విషయాన్ని నిర్థారించే అడల్ట్రేషన్ ల్యాబులు లేవంటూ తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేశారు. త్వరలోనే తిరుమలలో ప్రపంచస్థాయి అల్రడ్టేషన్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.
వేంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలుగుతుందంటూ ఎన్డీడీబీ నివేదికను బయట పెట్టకుండా తాము దాచిపెడితే, ఆ తర్వాత అది బయటకు వస్తే ఆ స్వామి మమ్మల్ని క్షమిస్తాడా అంటూ ఎదురుదాడి చేశారు. ఆ 4 ట్యాంకుల కల్తీ నెయ్యి వాడకుండా ఉంటే సంతోíÙంచేవాడినని, అవి వాడినందునే బాధపడుతున్నా అని అన్నారు. తెలిసీ తెలీక తప్పులు జరిగాయని, క్షమించాలని ప్రతి ఏటా ఆగస్టు 15 తర్వాత తిరుమలలో పవిత్రోత్సవాలు చేస్తారని, కానీ నెయ్యి కల్తీ జరగడంతో ఇటీవల సంప్రోక్షణ, శాంతియాగం చేశారని చెప్పారు.
కొత్త చట్టం తెస్తాం
ఎవరు ఏ ప్రార్థనాలయాలకు వెళ్లినా అక్కడి సంప్రదాయాలను తప్పనిసరిగా గౌరవించేలా త్వరలో కొత్త చట్టం కూడా తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. వివిధ ప్రాంతాల వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా పెట్టడం తప్పుకాదని, దాన్ని జంబో బోర్డుగా మార్చడమే తప్పు అని అన్నారు.
తిరుమల పవిత్రతను కాపాడేందుకు త్వరలోనే దేశవ్యాప్తంగా మేధావులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ ప్రక్షాళన కోసమే ఈవోగా శ్యామలరావును నియమించామని చెప్పారు. ఆ తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ వేశామని, ఇప్పుడు సిట్ వేశామని చెప్పారు. సిట్ దర్యాప్తు తర్వాత కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
జగన్‌పై అక్కసు వెళ్లగక్కిన బాబు
జగన్ తిరుమలకు రాకుండా తాము ఎక్కడా అడ్డుకోలేదని, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని, అటువంటి నోటీసులు ఉంటే చూపించాలని అన్నారు. తిరుమల వెళ్లినప్పుడు నియమాలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. రౌడీయిజం చేస్తామంటే కుదరదన్నారు.
ఇతర మతస్తులు ఎవరొచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారని చెప్పారు. పదే పదే అబద్ధాలు తిరిగి చెప్తున్నారని అన్నారు. తెలీసో, తెలీక తప్పులు జరిగితే క్షమించమనడానికి దేవుడికి పూజ చేస్తారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రినే రానివ్వకుంటే దళితులను రానిస్తారా అని మాట్లాడుతున్నారని, దళితులను రానివ్వరని ఎవరు చెప్తున్నారంటూ ప్రశ్నించారు. తిరుమల వెళ్లడం ఇష్టంలేకే వివిధ రకాలుగా బురదజల్లుతున్నారన్నారు.
జగన్ మాటలకు విశ్వసనీయత ఉండదని అన్నారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తిరుమల, తిరుపతిల్లో స్థానికులు పోటీగా జనసమీకరణ చేస్తామని సమాచారం రావడంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసు యాక్ట్ 30ని అమలు చేసి, పది మందికంటే ఎక్కువ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment