
కుప్పం రూరల్ (చిత్తూరు జిల్లా): సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి దేశంలోని ఇతర సీఎంలు ఆలోచనలో పడ్డారని రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం వార్డుబాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు కుప్పం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం పథకాలు తెచ్చి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచి పోయారని, ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి అనేక సంక్షేమ పథకాలు తెచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు రెండు కళ్లుగా పాలన చేస్తున్న సీఎంను చూసి దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా చేస్తున్నారా.. అంటూ ఆలోచనలో పడ్డారన్నారు. 95 శాతం హంద్రీ–నీవా పనులను వైఎస్సార్ పూర్తి చేస్తే, ఆయన తరువాత వచ్చిన కాంగ్రెస్ సీఎంలు, బాబు 5 శాతం పనులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. గత సెప్టెంబర్‌లో కుప్పానికి వచ్చిన సీఎం జగన్ హంద్రీ–నీవా పనులు పూర్తిచేయాలని ఆదేశించారని, పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలో హంద్రీ–నీవా నీళ్లు కుప్పానికి తెచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
కరోనా కాలంలో తండ్రీకొడుకులు హైదరాబాద్లో దాక్కుంటే సీఎం జగన్ ప్రతి నిత్యం సమీక్షలు నిర్వహించి ప్రాణనష్టాన్ని నివారించారన్నారు. వలంటీర్లు కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి సేవ చేస్తే వారిని తప్పుపట్టడం దారుణమన్నారు. 2019 ఎన్నికల ముందు మహిళా, రైతు రుణాలు రూ.14,200 కోట్లు ఇవ్వకుండా వెళ్లిపోయారని, ఆ రుణాలు కాస్త వడ్డీతో కలిపి ప్రస్తుతం రూ.27 వేల కోట్లు అయ్యాయని, ఆ మొత్తాన్ని సీఎం జగన్ విడతల వారీగా చెల్లిస్తూ వస్తున్నారని తెలిపారు.