
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 11.45 గంటలకు ముఖ్యమంత్రి కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ముందుగా జాతీయ జెండాను, ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12.18కి ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. 12.22 గంటలకు ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను సీఎం ఆవిష్కరిస్తారు.
అనంతరం అక్కడినుంచి తాడేపల్లి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఇండిగో సంస్థ ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్ జారీ చేయగా.. బీసీఏఎస్ సెక్యూర్టీ క్లియరెన్స్ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు.