కర్నూలు సిగలో కలికితురాయి | Construction work on Kurnool Airport has been completed | Sakshi
Sakshi News home page

కర్నూలు సిగలో కలికితురాయి

Published Tue, Mar 23 2021 5:35 AM | Last Updated on Tue, Mar 23 2021 5:35 AM

Construction work on Kurnool Airport has been completed - Sakshi

రూపుదిద్దుకున్న కర్నూలు విమానాశ్రయం

కర్నూలు (సెంట్రల్‌): కర్నూలు సిగలో మరో కలికితురాయి చేరనుంది. జిల్లా ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న కర్నూలు విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.153 కోట్ల వ్యయంతో ఓర్వకల్లు వద్ద నిర్మించిన దీన్ని ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.హర్‌దీప్‌సింగ్‌ జాతికి అంకితం చేస్తారని జిల్లా కలెక్టర్‌  వీరపాండియన్‌ చెప్పారు.  ఈ నేపథ్యంలో సోమవారం ఎయిర్‌పోర్టును సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన విజయవంతమయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 నుంచి ‘ఇండిగో’ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి.   

నాడు అసంపూర్తిగా.. 
కర్నూలు జిల్లా ప్రజలు దాదాపు 20 ఏళ్ల నుంచి విమాన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వచి్చన ప్రభుత్వాలు దీన్ని గాలికొదిలేశాయి. చివరకు 2014లో కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు వద్ద 1,008 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. నిర్మాణ పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డికి చెందిన కంపెనీకి అప్పగించడంతో భూసేకరణ, ఇతర పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. 2019 సాధారణ ఎన్నికల నాటికి కేవలం 2.2 కిలోమీటర్ల రన్‌వే మాత్రమే పూర్తయ్యింది. మిగిలిన పనులను అసలు మొదలుపెట్టలేదు. అయినా చంద్రబాబు 2019 జనవరి 18న హడావుడిగా  విమానాశ్రయాన్ని ప్రారంభించి.. అదే సంవత్సరం ఏప్రిల్‌ నుంచి విమానాల రాకపోకలు సాగుతాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఇవన్నీ గాలిమాటలుగానే మిగిలిపోయాయి. 

ఏడాదిన్నరలోనే పనులన్నీ పూర్తి.. 
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు విమానాశ్రయ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్‌లోని అన్ని పనులను పూర్తి చేయించే బాధ్యతను ఆరి్థక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు అప్పగించారు. ఆయన కలెక్టర్, ఎయిర్‌పోర్టు అథారిటీ, ఇతర అధికారులను సమన్వయం చేసుకుంటూ కేవలం ఏడాదిన్నర కాలంలోనే పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులకు అదనంగా రూ.75 కోట్లను విడుదల చేయించారు. ప్యాసింజర్‌ టెరి్మనల్‌ బిల్డింగ్, ఐదు ఫ్లోర్లలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్, అడ్మిన్‌ బిల్డింగ్, పోలీస్‌ బ్యారక్, ప్యాసింజర్‌ లాంజ్, వీఐపీ లాంజ్, సబ్‌స్టేషన్, వాటర్‌ ఓవర్‌ హెడ్‌ ట్యాంకు తదితర పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. 

ఏటీసీ, డీజీసీఏ అనుమతులు.. 
కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ), డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతులను రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పలుమార్లు ఢిల్లీ వెళ్లి అనుమతులు వచ్చేలా చేశారు. 2019లో ఏటీసీ, 2020 జనవరి 16న డీజీసీఏ అనుమతులు లభించాయి. ఏరోడ్రోమ్‌ లైసెన్స్‌ను మంజూరు చేస్తూ న్యూఢిల్లీలోని డీజీసీఏ కార్యాలయం ఉత్తర్వులిచి్చంది. దీంతో విమానాల రాకపోకలకు లైన్‌క్లియర్‌ అయ్యింది.  

కర్నూలు జిల్లా అభివృద్ధిలో కీలకం  
కర్నూలు ఎయిర్‌పోర్టు జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడి పారిశ్రామిక రంగానికి ఎంతో ఊతమిస్తుంది. ఇప్పటికే ఓర్వకల్లు ఇండ్రస్టియల్‌ హబ్‌ను తీర్చిదిద్దుతున్నాం. ఎయిర్‌పోర్టును వేగంగా పూర్తి చేసేందుకు సహకరించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా ప్రజల 
తరఫున నా కృతజ్ఞతలు.
– జి.వీరపాండియన్, జిల్లా కలెక్టర్, కర్నూలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement