పల్లెలకు అపరిమిత ఇంటర్నెట్‌ | CM Jagan Mandate to officers that Unlimited internet for rural areas | Sakshi
Sakshi News home page

పల్లెలకు అపరిమిత ఇంటర్నెట్‌

Published Tue, Apr 27 2021 3:13 AM | Last Updated on Tue, Apr 27 2021 8:16 AM

CM Jagan Mandate to officers that Unlimited internet for rural areas - Sakshi

సాక్షి, అమరావతి: ఎలాంటి అంతరాయాలు లేని నెట్‌వర్క్‌ లక్ష్యంగా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ స్పీడ్‌ కనెక్షన్‌ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని, అన్ని గ్రామాల్లో సదుపాయాలతో కూడిన డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల సొంత ఊళ్లలోనే వర్క్‌ ఫ్రం హోమ్‌ సదుపాయం కలుగుతుందన్నారు. నిర్ణీత వ్యవధిలోగా ఈ పనులన్నీ పూర్తి కావాలన్నారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లోనూ ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్ల ప్రక్రియ పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామాలకు ఇంటర్నెట్, కనెక్టివిటీ పురోగతి, వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, నిర్వహణ, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లు అందచేయడంపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..
ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి బాలినేని తదితరులు 

పీవోపీ కోసం రూ.5,800 కోట్లు 
ప్రతి ఊరికి ఇంటర్నెట్‌ సౌలభ్యం కోసం గ్రామ స్థాయిల వరకు పీవోపీ (పాయింట్‌ ఆఫ్‌ ప్రజెన్స్‌) కోసం రూ.5,800 కోట్లు వ్యయం కానుంది. అదనంగా మరో రూ.2 వేల కోట్లు వైఎస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల కోసం ఖర్చు అవుతుంది. 12,890 గ్రామాలకు కేబుళ్ల సదుపాయం కల్పించాలి. 3 వేల హామ్లెట్లకు సైతం ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. తద్వారా దాదాపు 16 వేల గ్రామాలకు ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుంది. 2022 డిసెంబర్‌ నాటికి విలేజ్‌ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 

2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో...
అన్‌ లిమిటెడ్‌ కెపాసిటీతో గ్రామాలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సదుపాయం ఉండాలి. అందుకోసం అవసరమైతే కెపాసిటీని 20 జీబీ వరకు పెంచండి. అప్పుడే వర్క్‌ ఫ్రమ్‌ హోం సులభంగా ఉంటుంది. కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో కూడా ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఇవ్వాలి. అంటే మరో 31 లక్షల ఇళ్లు పెరుగుతాయి. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయండి. రాష్ట్రవ్యాప్తంగా 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్ల ప్రక్రియ పూర్తి కావాలి. తుపాను ప్రభావిత 108 గ్రామాల్లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయాలి. 

వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలు...
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, గ్రామ సచివాలయం ఉన్న ప్రతిచోటా వైఎస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు ఉండాలి. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం గ్రామీణ లైబ్రరీల నిర్మాణం జరగాలి. అవి పూర్తయ్యే సమయానికి అవసరమైనన్ని కంప్యూటర్లు కూడా సిద్ధం చేయాలి. వైఎస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలో న్యూస్‌ పేపర్‌ స్టాండ్‌ కూడా ఏర్పాటు చేయాలి. ఒక్కో లైబ్రరీలో 6 సిస్టమ్స్‌ కోసం సదుపాయం ఉండాలి. అవసరం మేరకు 4 లేదా 6 కంప్యూటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామస్ధాయిలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు అవసరమైన ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఉండాలి.

అమ్మ ఒడి ల్యాప్‌టాప్‌లు
అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌ కింద ల్యాప్‌టాప్‌లు కోరుకున్న వారికి వచ్చే ఏడాది జనవరి 9న అందజేయాలి. 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌తో పాటు గ్యారెంటీ, వారంటీ కార్డు, అన్ని స్పెసిఫికేషన్స్‌తో అందచేయాలి. ల్యాప్‌టాప్‌ల సర్వీసు కూడా పక్కాగా ఉండాలి. ఎక్కడైనా ల్యాప్‌టాప్‌ పాడైతే గ్రామ సచివాలయం ద్వారా సర్వీస్‌ సెంటర్‌కు పంపి వారం రోజుల్లోగా తిరిగి తెప్పించాలి. కాబట్టి బిడ్‌ ఖరారు చేసేటప్పుడు గ్యారెంటీ, వారంటీ, సర్వీస్‌.. వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో తప్పనిసరిగా ల్యాప్‌టాప్‌ల సర్వీస్‌ సెంటర్లు ఉండాలి.

కొనసాగుతున్న కేబుల్‌ పనులు..
► గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లకు సంబంధించి ఇప్పటికే కేబుల్‌ పనులు కొనసాగుతున్నాయని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా 2023 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌ వెల్లడించారు. ఇప్పటివరకు 307 మండలాల్లోని 3,642 గ్రామాల్లో 14,671 కి.మీ. మేర ఏరియల్‌ కేబుల్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
► వైఎస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలను 690 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని, ఒక్కో లైబ్రరీ అంచనా వ్యయం రూ.16 లక్షలు కాగా ప్రతి లైబ్రరీలో 20 సీట్లు ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్‌ గ్రామిణాభివృద్ధి కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్‌ పేర్కొన్నారు.
► అమ్మ ఒడిలో ఆప్షన్‌ ప్రకారం ల్యాప్‌టాప్‌లు ఇవ్వడానికి విద్యార్థుల నుంచి ఆప్షన్లు తీసుకుంటున్నామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు. రెండు మోడళ్లలో ల్యాప్‌టాప్‌లు సేకరిస్తున్నామని, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు హైఎండ్‌ వర్షన్‌ ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని చెప్పారు. సమీక్షలో అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి, ఏపీటీఎస్‌ ఎండీ ఎం.నందకిషోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement