AP: సిక్కులకు కార్పొరేషన్‌ | CM Jagan Promise To Corporation for Sikhs | Sakshi
Sakshi News home page

AP: సిక్కులకు కార్పొరేషన్‌

Published Tue, May 9 2023 3:42 AM | Last Updated on Tue, May 9 2023 7:02 AM

CM Jagan Promise To Corporation for Sikhs - Sakshi

సాక్షి, అమరావతి: సిక్కుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. గురు­ద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు కల్పిం­చాలన్న సిక్కు మతపెద్దల విజ్ఞప్తిపై అప్పటి­కప్పుడు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు గురుద్వారాలపై ఆస్తి పన్నును తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన సిక్కు మత పెద్దలతో సోమవారం తన క్యాంపు కార్యా­లయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశ­మయ్యారు.

ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ సభ్యుడు జితేందర్‌జిత్‌సింగ్‌ నేతృత్వంలో  సిక్కు మతపెద్దలు ముఖ్యమంత్రిని కలిశారు. శతాబ్దం క్రితం నుంచి సిక్కులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని సిక్కుమత పెద్దలు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేశారు. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థంగా అందించాలని కోరగా ముఖ్యమంత్రి అందుకు అంగీకరించారు.  

గురుద్వారాల్లో పూజారులైన గ్రంథీలకు ప్రయోజనాలు
గురుద్వారాల్లో పూజారులైన గ్రంథీలకు పూజారులు, పాస్టర్లు, మౌల్వీల మాదిరిగానే ప్రయోజనాలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. గురునానక్‌ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవురోజుగా ప్రకటించేందుకు అంగీకారం తెలిపారు. ఓ మైనార్టీ విద్యాసంస్థను నెలకొల్పేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని ప్రకటించారు.

వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో ఈ చర్యలు ఉండాలని నిర్దేశించారు. పది రోజుల్లోగా ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎండీ ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement