సాక్షి, అమరావతి: సమగ్ర సర్వేపై తప్పుడు ఆలోచనలు కలిగించేలా ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రికలు ప్రచారం చేస్తున్నాయని.. సర్వే వల్ల కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘జగనన్న శాశ్వత భూ హక్కు-భూరక్ష’ కార్యక్రమంపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రెవిన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్న, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఉన్నతాధికారులు హాజరయ్యారు. భూ సర్వేపై.. సర్వే ఆఫ్ ఇండియా శిక్షణ ఇస్తోందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రతి మండలానికి ఒక డ్రోన్ బృందం, డేటా ప్రాససింగ్ టీం, రీసర్వే టీం ఉంటాయని తెలిపారు. 9400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని, మిగిలిన వారికీ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. సర్వే ఆఫ్ ఇండియాతో రేపు (బుధవారం) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదర్చుకుంటున్నామని వెల్లడించారు. (చదవండి: ఏలూరు: వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా)
గ్రామస్థాయిలోనే రెవెన్యూ సర్వీసులు:
ఒక గ్రామంలో సర్వే పూర్తై, మ్యాపులుసిద్ధం కాగానే అదే గ్రామ సచివాలయంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ సేవలు అందాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు గ్రామ సచివాలయంలో ఏమైనా మార్పులు కావాలంటే చేయాలని, భూ వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. దీనికి అవసరమైన వాహనాలు సహా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. (చదవండి: పులివెందులలో అపాచీ లెదర్ కంపెనీ)
సమగ్ర భూ సర్వేపై తప్పుడు ఆలోచనలు కలిగించేలా ప్రచారం:
‘‘సమగ్ర భూ సర్వే ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది. అయితే ప్రజల్లో సందేహాలు రేకెత్తించి ఈ కార్యక్రమానికి అవాంతరాలు కలిగించడానికి విష ప్రచారాలు చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. సమగ్ర సర్వేపై కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి. అనుమానాలకు దారి తీస్తున్న అంశాలను గుర్తించి వారికి సరైన సమాచారాన్ని చేరవేయాలి. కొన్ని పత్రికలు (ప్రతిపక్ష పార్టీ అధికార పత్రికలు) సమగ్ర సర్వే మీద తప్పుడు ఆలోచనలు కలిగించేలా రాతలు రాస్తున్నారు. ఆ తప్పుడు సమాచారం, ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. సమగ్ర సర్వే ద్వారా ఏ రకంగా మంచి జరుగుతుందో ప్రజలకు వివరించాలి. సమగ్ర సర్వేలో భాగస్వాములు అవుతున్న సిబ్బందికి మంచి శిక్షణ, ఓరియెంటేషన్ ఇవ్వండి. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డులను మరెవ్వరూ టాంపర్ చేయలేని రీతిలో భద్రపరచాలి. సెక్యూరిటీ ఫీచర్స్ పటిష్టంగా ఉండాలి. ఆ మేరకు సర్వే వ్యవస్థను తీర్చిదిద్దాలి. భూ యజమానుల వద్ద హార్డ్ కాపీ ఉండేలా చూడాలని’’ సీఎం ఆదేశించారు.
సర్వే శిక్షణకోసం తిరుపతిలో కొత్త కాలేజీ:
సర్వే శిక్షణ కోసం కొత్తగా ఒక కాలేజీని ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలన్నారు. సమగ్ర సర్వే సందర్భంలోనే ఈ కాలేజీ నిర్మాణం కూడా జరగాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
సర్వే ఇలా:
♦గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాలతో కలిపి అటవీ ప్రాంతాలు మినహా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే, 17,460 గ్రామాల్లో సర్వే
♦మొదటి విడతలో 5 వేలు, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో సర్వే
♦పట్టణాలు, నగరాల్లోని 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే
♦10 లక్షల ఓపెన్ ప్లాట్లు, 40 లక్షల అసెస్‌మెంట్ల భూముల్లో సర్వే
♦2.26 కోట్ల ఎకరాలు ఉన్న 90 లక్షల మంది పట్టాదారుల భూములూ సర్వే
♦సర్వే తర్వాత ల్యాండ్ టైటిలింగ్ కార్డు, కార్డులో యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ప్రాపర్టీ (భూమి) కొలతలు మొత్తం ఏరియా, యజమాని పేరు, ఫొటో ఉంటుంది. క్యూ ఆర్ కోడ్ కూడా ఉంటుంది
♦సర్వే పూర్తైనతర్వాత డిజిటైజ్డ్ కాడస్ట్రల్ మ్యాప్‌లు తయారీ
♦గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు మ్యాప్‌లో ఉంటాయి.
♦భూ కొలతలు పూర్తైనతర్వాత సర్వే రాళ్లు పాతుతారు
♦గ్రామ సచివాలయంలో డిజిటైజ్డ్ ప్రాపర్టీ రిజిస్టర్, టైటిల్ రిజిస్టర్, వివాదాల నమోదుకూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment