Andhra Pradesh: టార్గెట్‌ 175 | CM Jagan Says Target 175 Seats In Next Elections Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: టార్గెట్‌ 175

Published Thu, Jun 9 2022 3:55 AM | Last Updated on Thu, Jun 9 2022 3:18 PM

CM Jagan Says Target 175 Seats In Next Elections Andhra Pradesh - Sakshi

నిత్యం ప్రజల్లోనే ఉందాం.. 
వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రత్యర్థులం మనమే. రానున్న రోజుల్లో రకరకాల కుట్రలు, కుయుక్తులు పన్ని ఎల్లో మీడియా సాయంతో మనపై మరింత దుష్ప్రచారం చేస్తారు. ఎందుకంటే ప్రజల వద్దకు వెళ్లి చెప్పుకొనేందుకు విపక్షాలు చేసిందేమీ లేదు. దేవుడి దయవల్ల ప్రతి కుటుంబానికీ మనం మేలు చేశాం. మనకున్న ఈ ప్రతిష్టను దెబ్బతీయడానికి విపక్షాలు చాలా కుయుక్తులు పన్నుతాయి. వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే మనం నిత్యం ప్రజల్లో ఉండాలి. జనంతో మమేకమై నిరంతరం చేదోడు వాదోడుగా నిలిస్తే విపక్షాలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరు. ప్రజలు మనవైపే నిలుస్తారు. అప్పుడు విజయం మనదే అవుతుంది.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ‘‘గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో జయభేరి మోగించాం. వచ్చే ఎన్నికల్లో 175 చోట్లా విజయభేరి మోగిద్దాం. ఇదీ మన లక్ష్యం..’ అని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు సీఎం వైఎస్‌ జగన్‌ మార్గనిర్దేశం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టం కానే కాదని స్పష్టం చేశారు. ‘అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికీ మంచి చేస్తూ చరిత్రలో చెరగని ముద్ర వేశాం. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి ఆశీస్సులు పొంది చేదోడువాదోడుగా నిలిస్తే 175 స్థానాల్లో విజయభేరి మోగించగలుగుతాం’ అని పేర్కొన్నారు.

అందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని సూచించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’పై వర్క్‌షాప్‌ను సీఎం ప్రారంభించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను ఉద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలివీ..
‘గడప గడపకు మన ప్రభుత్వం’ వర్క్‌షాప్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

మరింత మెరుగ్గా..
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిరంతరాయంగా దాదాపు 8 నెలలపాటు జరుగుతుంది. ఒక్కో సచివాలయం పరిధిలోని గ్రామాల్లో పర్యటించేందుకు రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది. నెలకు 20 రోజుల చొప్పున పది సచివాలయాల్లో నిర్వహించాలి. గడప గడపకూ కార్యక్రమాన్ని ఏ రకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అనే అంశాలపై మనం నిరంతరం చర్చించుకోవాలి.

ఇందుకోసం ప్రతి నెలా వర్క్‌షాప్‌ నిర్వహిస్తాం. ఆ నెల రోజుల్లో కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనపై చర్చిస్తాం. మరింత మెరుగ్గా నిర్వహణపై వర్క్‌షాప్‌లో దృష్టి సారిద్దాం. ప్రజాప్రతినిధుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి చర్చిస్తాం. వర్క్‌షాప్‌లకు హాజరైనవారు వీటిని తెలుసుకోవడం వల్ల మన ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది.

వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి..
గడపగడపకూ కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన విజ్ఞాపనలు, వాటి పరిష్కారం  అత్యంత ముఖ్యమైన అంశం. ఈ ప్రక్రియ సజావుగా, సమర్థంగా సాగడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం.

అసాధ్యం, కష్టం కాదు..
అన్నిచోట్లా గెలుపు అన్నది అసాధ్యం కాదు. అది మన లక్ష్యం. అది కష్టం కాదు. ఎందుకంటే మనకు ఓటు వేసిన వారితోపాటు ఓటు వేయని వారికి కూడా కులం, మతం, వర్గం, ఏ పార్టీ అనేది చూడకుండా పారదర్శకంగా మేలు చేశాం. ప్రతి ఇంటికీ మంచి చేశాం. చరిత్రలో చెరగని ముద్ర వేశాం. 

చరిత్రలో చెరగని ముద్ర
గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా మీరు ప్రతి ఇంటికీ వెళ్లి వారికి చేకూరిన మేలును వివరిస్తున్నారు. ఆయా కుటుంబాలకు ఏయే పథకాలు అందాయో చెబుతున్నారు. చేసిన మంచికి సంబందించి ప్రతి అక్కచెల్లెమ్మకు లేఖలు అందచేస్తున్నారు. ప్రతి ఇంటికీ మేలు జరిగినప్పుడు ప్రజా ప్రతినిధులుగా మనకు అంతకన్నా ఏం కావాలి? చరిత్రలో మనం ఒక ముద్ర వేశాం. సంతృప్త స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నాం. కాలర్‌ ఎగరేసుకుని తిరగగలుగుతున్నాం. దేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాం. 

పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌..
పగటిపూటే వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా మన హయాంలోనే అందుతోంది. అధికారంలోకి వచ్చాక ఇందుకోసం రూ.1,700 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడలేదు. సాగుకు విద్యుత్‌ లోటు రానివ్వకుండా అడుగులు మందుకు వేస్తున్నాం. ఇవాళ ఉక్రెయిన్‌ – రష్యా మధ్య యుద్ధంతోపాటు రకరకాల కారణాల వల్ల బొగ్గు రేటు ఎన్నడూ లేని విధంగా పెరిగింది. బొగ్గు కొనుగోలుకు రోజూ రూ.40 కోట్ల మేర అదనంగా భారం పడినా వెనుకాడకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. 

ఊరూరా కళ్లకు కట్టినట్లు అభివృద్ధి..
వివక్ష, పక్షపాతం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలను  అందించాం. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు చేరాయి. ప్రతి సచివాలయం పరిధిలో కచ్చితంగా 2–3 రోజులు గడప గడపకూ నిర్వహించాలి. రోజూ ఉదయం నుంచి సాయంత్రం 6–7 గంటల వరకూ చేపట్టాలి. ప్రతి ఇంటికి మంచి చేశామని తలెత్తుకొని చెప్పే పరిస్థితి మనకు ఉంది. ప్రతి గ్రామంలోనూ మనం చేసిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది.

ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్‌లు, నాడు–నేడుతో పాఠశాలల అభివృద్ధి–ఇంగ్లీషు మీడియం చదువులు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. గతంలో ఇవేవీ లేవు. మరి ఇప్పుడు ఉన్నాయి. ప్రతి గ్రామంలో పది మంది ప్రభుత్వ సిబ్బంది పనిచేసే పరిస్థితి ఇంతకు ముందెన్నడూ లేదు. ఇది అభివృద్ధి కాదా? 

మిస్డ్‌ కాల్‌.. నాణ్యతగా
గ్రామంలో ప్రతి కుటుంబాన్ని కలిసిన తర్వాత వారితో మిస్డ్‌కాల్‌ చేయించడం చాలా ముఖ్యం. కార్యక్రమాన్ని నాణ్యతతో చేపట్టడం కీలకం. అర్హత ఉన్నవారు ఎవరికీ సంక్షేమ పథకాలు అందలేని పరిస్థితి ఉండకూడదు. అర్హత ఉండి ఎవరికైనా పొరపాటున సంక్షేమ పథకాలు దక్కకపోతే వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాం. పరిశీలన అనంతరం మంజూరు పత్రాలిచ్చి జూలై, డిసెంబర్‌లో వారికి సంక్షేమ పథకాలను వర్తింపచేస్తున్నాం. 

ప్రతి ఇంటికీ మంచి చేశాం కాబట్టే...
ఇప్పుడు మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతు తీసుకోవడమే. కుప్పం మున్సిపాల్టీని గెలుస్తామని ఎవరైనా అనుకున్నామా? ఎంపీటీసీలు, జడ్పీటీసీలను క్లీన్‌ స్వీప్‌ చేస్తామని అనుకున్నామా? ఇంతకు ముందెప్పుడూ అది జరగలేదు. కానీ ఈసారి జరిగింది.  ఎందుకు జరిగిందంటే.. ప్రతి ఇంటికీ మంచి చేశాం కాబట్టే. ఇదే రీతిలో 175కు 175 శాసనసభ స్థానాలను సాధించగలుగుతాం. ఇది జరగాలి అంటే.. మనం కష్టపడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement