సాక్షి, అమరావతి: ఏలూరులో పలువురు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలపై ఏ అంశాన్ని కొట్టి పారేయవద్దని, నిపుణులు సూచించిన ప్రతి కోణంలోనూ మరింత లోతుగా పరిశీలన, పరిశోధన జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తాగునీటి విషయంలో క్షుణ్నంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఎక్కడా పొరపాటు జరగడానికి వీల్లేదని, ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలని, బ్లడ్ శాంపిళ్లలో లెడ్, ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్ఫరస్ కనిపిస్తోందని, ఇది ఎలా వచ్చిందో కచ్చితంగా కనిపెట్టాలని స్పష్టం చేశారు. ఇలాంటివి పునరావృతం కారాదంటే ఎలా జరిగిందన్న విషయం కచ్చితంగా కనిపెట్టాల్సిందేనని, ఈ కోణంలో అంతా దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..
సమన్వయంతో ముందడుగు: ఏలూరు ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీని నియమించాం. ఈ అంశంపై పరిశోధన చేస్తున్న వివిధ సంస్థలు, ఏజెన్సీలు, నిపుణులు సమన్వయంతో ముందడుగు వేయాలి. బుధవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిద్దాం. విచ్చలవిడిగా పురుగు మందుల వాడకాన్ని అడ్డుకోవాలి.
పురుగు మందులపై జాగ్రత్త..: నిషేధిత పురుగు మందులు, రసాయనాలు విక్రయిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల ద్వారా అనుమతించిన పురుగు మందులు, ఎరువులను మాత్రమే రైతులకు చేరవేయాలి. వీటి వినియోగంపై రైతులకు మరింత అవగాహన కల్పించడం ద్వారా ఆహార పదార్థాలు కలుషితం కాకుండా నిరోధించవచ్చు. ప్రస్తుతం వినియోగిస్తున్న పురుగుల మందులను కూడా పరీక్షించాలి. నెల పాటు ఈ ప్రక్రియ సాగాలి.
పూర్తిస్థాయిలో నీటి పరీక్షలు..: ప్రస్తుత పరిస్థితికి నీరు కారణమా? కాదా? అన్నదానిపై ముందుగా పూర్తిస్థాయిలో నిర్ధారణలు తీసుకోవాలి. సేంద్రీయ సేద్యం, సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. బియ్యం శాంపిళ్లు కూడా తీసుకుని పరీక్షలు చేయాలి. ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, కలెక్టర్ ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ వల్లభనేని బాలశౌరి, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటు అధికారులు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
పురుగు మందులూ కారణం కావచ్చు
16 శాంపిల్స్‌ను పరిశీలించాం, తాగునీటిలో చెప్పుకోదగ్గ స్థాయిలో లెడ్, నికెల్ లేదు. మరోసారి పరీక్షలు చేస్తున్నాం. పాలలో నికెల్ కనిపించింది, దీనిపై మరింత పరిశీలన చేపట్టాం. బ్లడ్ శాంపిళ్లలో లెడ్, నికెల్ కనిపించాయి. పురుగు మందులు కూడా ఈ పరిస్థితికి దారి తీయవచ్చు. పురుగు మందుల్లో భార లోహాలు ఉంటాయి. ఆర్గనో క్లోరిన్ నిర్ధారించుకునేందుకు సీఐఎస్‌ఎఫ్‌ఎల్ నుంచి ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది.
– ఎయిమ్స్ న్యూఢిల్లీ
తాగునీటిలో ఇబ్బంది లేదు
21 తాగు నీటి శాంపిళ్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించాం. తాగు నీరు క్లీన్ అని స్పష్టంగా చెబుతున్నాం. లెడ్, ఆర్గనో క్లోరిన్ కనిపించ లేదు. బాధితుల రక్తంలో లెడ్, ఆర్గనో క్లోరైడ్స్ ఉన్నాయి. సీరమ్ శాంపిళ్లలో ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్ఫరస్ కనిపించాయి. ఈ రెండింటి వల్ల ఈ పరిస్థితి వచ్చిందన భావిస్తున్నాం.
– ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్
బియ్యంలో మెర్క్యురీ ఆనవాళ్లు
పురుగు మందుల అవశేషాలే కారణమని ప్రాథమికంగా అంచనా వేశాం. దీర్ఘకాలంలో పరిశోధన చేయాల్సి ఉంది. శాంపిల్స్‌పై ఇంకా విశ్లేషణ కొనసాగుతుంది. బియ్యంలో మెర్క్యురీ ఆనవాళ్లు అధికంగా కనిపించాయి, మరిన్ని పరీక్షలు అవసరం. టమాటాపైన కూడా పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. ఆర్గనో ఫాస్ఫరస్ బ్లడ్‌లో కనిపించింది. ఇవి ఎలా మనుషుల శరీరంలోకి ప్రవేశించాయో గుర్తించాల్సి ఉంది.
– ఎన్‌ఐఎన్, హైదరాబాద్
పెస్టిసైడ్స్ ఆనవాళ్లు
19 నీటి శాంపిళ్లను పరిశీలించాం. వాటిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించాం. భార లోహాలు కనిపించలేదు. ఇ–కోలి సాధారణ స్థాయిలోనే ఉంది.
– ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్
Comments
Please login to add a commentAdd a comment