సాక్షి, అమరావతి: స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గ్రామీణ, పట్టణ, ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించి.. రోజు వారీ తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి.. వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్మూలించే బృహత్తర కార్యక్రమం.. వైఎస్సార్ జగనన్న స్వచ్ఛ సంకల్పం –క్లీన్ ఆంధ్రప్రదేశ్‌కు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజైన శనివారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. చెత్త సేకరణకు 4,097 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ.. వంద రోజుల పాటు ప్రజల్లో ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తారు.
పేరుకుపోతున్న చెత్త నిల్వలు
► రాష్ట్రంలో 13,371 పంచాయతీల పరిధిలో 18 వేలకుపైగా గ్రామాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి రోజూ 13,500 టన్నుల తడి, పొడి చెత్త వస్తోంది. 17 నగర పాలక సంస్థలు (కార్పొరేషన్‌లు), 79 పురపాలక సంస్థలు (మున్సిపాల్టీలు), 30 నగర పంచాయతీల నుంచి రోజూ 6,500 టన్నుల తడి, పొడి చెత్త వస్తోంది.
► అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను సేకరించక పోవడం వల్ల గ్రామాల్లో భారీ ఎత్తున చెత్త పేరుకుపోయింది. దీంతో పారిశుద్ధ్య లోపం తలెత్తుతోంది. దోమలు బెడద పెరిగింది. దోమ కాటు వల్ల విష జ్వరాలు ప్రబలడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది.
► నగర, పట్టణ ప్రాంతాల్లో రోజు వారీ చెత్తను సేకరిస్తున్నా, దానిని నిర్మూలించక పోవడం వల్ల గుట్టలా చెత్త పేరుకుపోయింది.
► మాస్కులు, శానిటరీ ప్యాడ్‌లు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వంటి ప్రమాదకర వస్తువుల వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి.
పారిశుద్ధ్య సమస్యకు పూర్తి పరిష్కారమిలా..
► గ్రామీణ ప్రాంతాల్లో రోజూ వారి వచ్చే 13,500 టన్నుల చెత్తను 23 వేల మంది గ్రీన్ అంబాసిడర్‌ల ద్వారా సేకరించనున్నారు.
► చెత్త సేకరణకు గ్రామ పంచాయతీలకు 14,000 ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. చెత్తను నిర్మూలించడానికి 10,645 సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్లను నిర్మూలించారు. ఈ షెడ్లలో చెత్తను వేరు చేసి.. తడి చెత్త నుంచి బయోగ్యాస్, వర్మీ కంపోస్టు ఎరువులు తయారు చేస్తారు. పొడి చెత్తలో మళ్లీ ఉపయోగపడతాయన్న వస్తువులను పునర్ వినియోగంలోకి తెస్తారు. వ్యర్థాలను విద్యుదుత్పత్తి కేంద్రాలకు తరలిస్తారు. తద్వారా చెత్త నుంచి సంపదను సృష్టిస్తారు.
► మాస్కులు, శానిటరీ ప్యాడ్‌లు వంటి వ్యర్థాల ద్వారా వ్యాధులు ప్రబలకుండా వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద మండించి భస్మం చేసి, పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్ పరికరాలు పంపిణీ చేశారు.
► గ్రామీణ ప్రాంతాల్లో దోమల నివారణకు 10,628 థర్మల్ ఫాగింగ్ మిషన్లు పంపిణీ చేశారు.
► నగర, పట్టణాల్లో తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్థాల సేకరణ కోసం ప్రతి ఇంటికీ 3 చొప్పున 1.2 కోట్ల డస్ట్ బిన్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్థాలను 5,868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా 231 గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలిస్తారు. ఈ స్టేషన్‌ల నుంచి తడి, పొడి చెత్తను వేర్వురు వాహనాల ద్వారా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌ల వద్దకు చేరవేస్తారు.
► ఈ కార్యక్రమం శాశ్వతంగా, సుస్ధిరంగా, నిరంతరాయంగా కొనసాగించడానికి.. ప్రజల్లో జవాబుదారీతనం పెంచడానికి నిర్వహణ ఖర్చులకు మాత్రమే గ్రామాల్లో ఇంటికి రోజుకు కేవలం 50 పైసల నుండి రూ.1 వరకు.. పట్టణాల్లో ఇంటికి రోజుకు కేవలం రూ.1 నుండి రూ.4 వరకు యూజర్ చార్జీలు వసూలు చేస్తారు.
► ఈ కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా.. ఆహ్లాదకరంగా తయారవుతాయి. పర్యావరణం మెరుగు పడుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దేశంలో చెత్త నిర్మూలనకు.. పారిశుద్ధ్య సమస్యకు సంపూర్ణ పరిష్కారం చూపిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది.
Clean Andhra Pradesh: పరిశుభ్రం.. ఆరోగ్యం
Published Sun, Oct 3 2021 3:13 AM | Last Updated on Sun, Oct 3 2021 7:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment