సాక్షి, అమరావతి: రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం సోమవారం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనుంది. ఐదారు వేల రూపాయలకు మించి పెట్టుబడి అవసరం లేని వ్యాపారాలకు సైతం రోజుకు మూడు నుంచి పది రూపాయల వడ్డీకి అప్పు తెచ్చుకుంటూ పలువురు తమ ఆదాయాన్ని వడ్డీ వ్యాపారులకు ధారపోస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 2020 నవంబర్ 25న ప్రభుత్వం ప్రత్యేకంగా ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ పథకం ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా ఒక్కో లబ్ధిదారునికి రూ. పది వేల చొప్పున రుణాలు ఇప్పిస్తోంది. లబ్ధిదారుడు ఆ రుణాన్ని 12 నెలల సులభ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆ రుణంపై వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు చెల్లిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడత 5,35,112 మందికి, రెండో విడత 3,70,517 మందికి.. రెండు విడతల్లో మొత్తం 9,05,629 మందికి రుణాలను అందజేసింది. ఇప్పుడు మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ విడతలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే 3.56 లక్షల మందికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తోంది.
జమ కానున్న రూ.16.16 కోట్ల వడ్డీ డబ్బు
గత రెండు విడతల్లో జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి సంబంధించిన రూ.16.16 కోట్ల వడ్డీ డబ్బులను సోమవారం సీఎం వైఎస్ జగన్.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2020లో తొలి విడతలో ఈ పథకం ద్వారా రుణాలు పొందిన వారికి 2021 సెప్టెంబర్ 25న రూ.16.35 కోట్ల వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది. రెండు విడతల్లో రుణాలు పొందిన వారికి సంబంధించి 2021 డిసెంబర్ ఆఖరు వరకు అయిన వడ్డీని తాజాగా సోమవారం వారి ఖాతాల్లో జమ చేస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలు 68 శాతం
గత రెండు విడతలతో పాటు ప్రస్తుత మూడో విడతలో కలిపి మొత్తం 14.16 లక్షల మంది చిరు వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. వీరిలో అత్యధికంగా 6.30 లక్షల మంది బీసీలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరో 2.74 లక్షల మంది ఎస్సీలకు లబ్ధి చేకూరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు 68 శాతం మందికి, 12.46 శాతం మంది కాపులకు ప్రయోజనం కలిగింది. మరో 12 శాతం మంది కాపుయేతర ఓసీ లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారని అధికారులు తెలిపారు. ఈ పథకం లబ్ధిదారుల్లో 30 శాతం మంది బడ్డీ కొట్టు చిరు వ్యాపారులు కాగా, మిగతా వారంతా పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment