విశాఖ ఉక్కును కాపాడేందుకు కృషి: సీఎం జగన్‌ | CM YS Jagan Meets Vizag Steel Plant JAC Leaders In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కును కాపాడేందుకు కృషి: సీఎం జగన్‌

Published Thu, Feb 18 2021 3:32 AM | Last Updated on Thu, Feb 18 2021 9:17 AM

CM YS Jagan Meets Vizag Steel Plant JAC Leaders In Visakhapatnam - Sakshi

విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం ఇస్తున్న స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు సమగ్ర సూచనలతో నేను ప్రధానికి లేఖ రాశాను. దానిని మీడియాకు కూడా విడుదల చేశాం. అయితే లేఖ రాయలేదని కొంత మంది సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. వారి ఐక్యూ లెవల్‌ ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోండి. నేను రాసిన లేఖ అందినట్లుగా ప్రధాన మంత్రి కార్యాలయం రసీదు కూడా పంపింది. దానిని టీడీపీ అధినేత చంద్రబాబుకు మీరే (కార్మిక సంఘాల నేతలు) పంపించండి. ప్రధాన మంత్రికి లేఖ రాయాలన్న ఆలోచన ఇంత గొప్ప ఆరోపణలు చేస్తున్న ఆయనకు ఎందుకు రావడం లేదు?  – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి , విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి అన్ని విధాలా ప్రయత్నాలు సాగిస్తామని తెలిపారు. పరిశ్రమను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా, చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రాజ శ్యామల యాగంలో పాల్గొనేందుకు బుధవారం ఆయన విశాఖకు వచ్చారు. ఉదయం 11.48 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో నాయకులు చెప్పిన విషయాలను సీఎం సానుకూలంగా విన్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం శాంతియుతంగా చేస్తున్న పోరాటాలకు ప్రభుత్వం తరఫున మద్దతు ఇవ్వాలని కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు సీఎంకు ఓ వినతి పత్రం ఇచ్చారు. ఎంపీలను ముందు పెట్టి కేంద్రం వైఖరికి నిరసనగా ఉద్యమాన్ని నడిపించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమకు సొంత గనులు లేని కారణంగా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి గనులు కేటాయించేలా ప్రయత్నం చేయాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. వీటన్నింటిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. 

సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా..
– నాపై నమ్మకం ఉంచినందుకు, ఆప్యాయత చూపిస్తున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు ప్రత్యామ్నాయాలను సూచిస్తూ నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాను. 32 మంది ప్రాణ త్యాగంతో వచ్చిన స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యాన్ని తెలియజేస్తూ.. స్టీల్‌ ప్లాంట్‌ను బాగు చేసేందుకు ఒక కార్యాచరణను సూచించాను.
– సొంత గనులు కేటాయించడంతో పాటు రుణాలను ఈక్విటీ రూపంలోకి మార్చాలని ప్రతిపాదించాను. దాదాపు రూ.22 వేల కోట్లు దీర్ఘకాలిక రుణాలు, మరో రూ.10 వేల నుంచి రూ.11 వేల కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ రూపంలో తీసుకోవడం వల్ల లాంగ్‌ టర్మ్‌ అప్పులుగా మారాయి. కొన్ని బ్యాంకులు 14 శాతం వడ్డీతో రుణాలు ఇచ్చాయి.
– బ్యాంకులు ఎక్కువ వడ్డీకి ఇచ్చిన రుణాలు ఈక్విటీల రూపంలోకి మారిస్తే.. వడ్డీల భారం తగ్గుతుందని, ఆ మేరకు రూ.2500 కోట్లు నుంచి రూ.3 వేల కోట్లు కట్టాల్సిన అవసరం ఉండదని, ఫలితంగా కంపెనీ లాభాల్లోకి వస్తుందని లేఖలో వివరించాను.
– పరిశ్రమకు సొంత గనులు లేకపోవడంతో ప్రతి టన్నుకు రూ.4 వేలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించాను. 
– స్టీల్‌ ప్లాంట్‌కు దాదాపు 20 వేల ఎకరాల భూములు ఉండగా, అందులో ఉపయోగించని భూమి 7 వేల ఎకరాల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ల్యాండ్‌ యూజ్‌ కన్వర్షన్‌కు అనుమతి ఇస్తాం. ఆ భూములను ప్లాట్లుగా వేసి కంపెనీయే విక్రయించి వచ్చిన డబ్బును సంస్థలోనే పెడితే ఒకేసారి నగదు నిల్వలు పెరుగుతాయి. దీని వల్ల పరిశ్రమ కష్టాల నుంచి బయట పడుతుందని తెలిపాం. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నా.
 
సొంత గనులు ఉండాల్సిందే
– స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనుల కేటాయింపుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒడిశాలో పుష్కలంగా ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఈ ప్లాంటుకు గని కేటాయించాలని కేంద్రాన్ని కోరాం. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఈఐఎల్‌ పేరుతో ఇప్పటికే ఒడిశాలో ఐదు మైన్స్‌ ఉన్నాయి. అయితే వాటి లీజు ఒప్పందాల కాలం తీరిపోయింది. వాటిని పునరుద్ధరించాల్సి ఉంది. 
– ఈ గనుల్లో దాదాపు 51 శాతం వాటా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఉంది. మిగిలినది ఎల్‌ఐసీ, కేంద్ర ప్రభుత్వానికి, ఒక శాతం ఒడిశా మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు వాటాలున్నాయి. ఈ మైన్స్‌ ఏ పరిస్థితుల్లో ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం విచారించింది. 
– ఈ గనుల నుంచి ఖనిజాన్ని పొందేలా లీజులను పునరుద్ధరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గనులలో 200 మిలియన్‌ టన్నుల నిల్వలు ఉన్నాయని పీఎంకు రాసిన లేఖలో వివరించాను. ఏపీలో ఆ స్థాయిలో ఖనిజ నిల్వలు లేవు. అందువల్ల ఒడిశాలో ఉన్న గనుల లీజులు పునరుద్దరించాలని చెప్పాను. ఒక గనికి అటవీ అనుమతి కూడా లభించిందని చెబుతున్నారని, మరో నాలుగు నెలల్లో సొంతంగా ఒడిశాలో గని కూడా వస్తుందని భావిస్తున్నాం. 

పోస్కో విశాఖకు రాదు.. 
– పోస్కో ప్రతినిధులు గతంలో నన్ను కలిసిన మాట వాస్తవమే. భావనపాడు, కృష్ణపట్నం, కడపలో పరిశ్రమల కోసం పెట్టుబడులు పెట్టాలని వారికి సూచించాం. అంతేగానీ పోస్కో సంస్థ విశాఖకు రాడానికి ప్రయత్నిస్తోందనడం సరికాదు. ఈ విషయంలో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ ప్లాంట్‌ వచ్చిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తోంది. 

కార్మికులకు అండగా ప్రభుత్వం
– స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని మళ్లీ చెబుతున్నా. పరిశ్రమను కాపాడుకోడానికి కార్మికులు, ఉద్యోగులు, అఖిల పక్షం నాయకులు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. 
– ఒక్క రోజు కూడా ప్లాంట్‌ మూత పడకుండా, ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేకుండా.. ఉన్న సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేస్తూ.. ఏ ఒక్కరూ వేలెత్తి చూపకుండా పోరాటం సాగించాలి. ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మీరు కోరిన మేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తాం. 
– ఈ భేటీలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బి.సత్యవతి, పలువురు ఎమ్మెల్యేలు, సీఎం పోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. 

ముఖ్యమంత్రి భరోసా ధైర్యాన్నిచ్చింది 
స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించిన తీరు పట్ల ఉక్కు పరిరక్షణ పోరాట కమిటి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును సీఎం వైఎస్‌ జగన్‌ కాపాడతారన్న నమ్మకం ఉందని వారు స్పష్టం చేశారు. సీఎంతో భేటీ అనంతరం కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. సీఎం చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు. సీఎంతో భేటీ తర్వాత ఉద్యమానికి ఊపిరి వచ్చిందని ఐఎన్‌టీయుసి నేత మంత్రి రాజశేఖర్‌ వ్యాఖ్యానించారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి చూపిస్తున్న చొరవ అభినందనీయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నరసింగరావు అన్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేయడం సంతోషంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకొని, అందరూ కలసికట్టుగా ఉద్యమంలో భాగస్వాములై కేంద్రంపై పోరాడాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. సీఎంతో భేటీ అయిన వారిలో ఎఐటియుసి నేతలు డి.ఆదినారాయణ, కె.ఎస్‌.ఎన్‌.రావు, వైఎస్సార్‌టీయుసి నేత వై.మస్తానప్ప, సీఐటియూ నేత జె.అయోధ్యరామ, ఐఎన్‌టియుసి నేతలు గంధం వెంకటరావు, బి.మురళిరాజు, టీఎన్‌టీయూసీ నేత బొడ్డు పైడిరాజు, జేఎంఎస్‌ నేత వి.శ్రీనివాసరావు, బీఎంఎస్‌ నేత కె.శ్రీనివాస్, సీఎఫ్‌టీయూ నేత దాసరి సురేష్‌బాబు, హెచ్‌ఎంఎస్‌ నేత డి.అప్పారావు ఉన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement