CM YS Jagan Message to 16th Global Health Summit in Visakhapatnam - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం

Published Sat, Jan 7 2023 4:33 AM | Last Updated on Sat, Jan 7 2023 9:09 AM

CM YS Jagan Message To 16th-Global Health Summit Vishakapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సామాన్యుల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమి­స్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్ప­త్రుల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. శుక్రవారం విశాఖలోని ఓ హోటల్‌లో మూడు రోజుల పాటు జరిగే భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ వైద్యుల సంఘం (ఏఏపీఐ) నిర్వహించిన 16వ గ్లోబల్‌ హెల్త్‌ సమ్మిట్‌కు ఆయన తన సందేశం పంపించారు.

ఆ సందేశాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సదస్సులో చదివి వినిపించారు. వ్యాధుల నివారణ, ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించామని, గ్రామ స్థాయిలో ఆరోగ్య పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ‘2,000 – 2,500 జనాభా ఉన్న ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ ఆరోగ్య క్లినిక్‌కు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, ఏఎన్‌ఎం, నలుగురు ఆశా వర్కర్లను నియమించాం. ఈ హెల్త్‌ క్లినిక్‌లో 67 రకాల మందులు, 14 డయాగ్నస్టిక్‌ కిట్‌లు, వీడియో కాలింగ్‌ సదుపాయం ఉన్న టెలి కన్సల్టేషన్లు ఉన్నాయి.

రోజుకు సగటున 60 వేల టెలి కన్సల్టేషన్‌ కాల్స్‌తో పాటు జనాభాలో 72 శాతం మందికి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ నంబర్లను రూపొందించడంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. సరికొత్తగా అమలు చేసే ఫ్యామిలీ ఫిజీషియన్‌ ప్రోగ్రాంలో ఓపీ, ప్రసవానంతర తనిఖీలు, స్క్రీనింగ్, రోగ నిర్ధారణ, చికిత్సలకు పీహెచ్‌సీ నుంచి ఒక వైద్యుడు నెలకు రెండుసార్లు ఆరోగ్య క్లినిక్‌ను సందర్శిస్తారు. తదుపరి చికిత్స అవసరమైన వారి ఇళ్లకు డాక్టర్‌ వెళ్లి మంచంపై ఉన్న రోగులను పరీక్షిస్తారు’ అని వివరించారు.
 
ఆరోగ్య సంరక్షణకు అధిక నిధులు
‘ఆరోగ్య సంరక్షణకు కేంద్ర బడ్జెట్‌లో సగటున 4 శాతం కేటాయిస్తే, రాష్ట్ర బడ్జెట్‌లో 7.3 శాతం ఖర్చు చేయడం మాకు గర్వకారణంగా ఉంది. నాడు–నేడు కార్యక్రమంలో రూ.16,850 కోట్లతో డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సెకండరీ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ మౌలిక సదుపాయాలను కల్పించాం. ప్రభుత్వ రంగంలో 17 కొత్త వైద్య కళాశాలలను మంజూరు చేసి, కనీసం జిల్లాకో వైద్య కళాశాల ఉండేలా చూస్తున్నాం. స్పెష్టలిస్టులు, సూపర్‌ స్పెషలిస్టులతో అన్ని ఆరోగ్య సంస్థల్లో జీరో ఖాళీని ఒక విధానంగా తీసుకున్నాం. వీరితో సహా 47,191 మంది సిబ్బందిని నియమించాం.

ఆరోగ్యశ్రీ కింద జనాభాలో 85 శాతం మందికి ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. ఆరోగ్య శ్రీ కింద ప్రైవేటు రంగంలోని 2,225 ఎంప్యానల్‌ ఆస్పత్రుల్లో 3,255 విధానాలను (వైద్య ప్రక్రియలు) అందుబాటులో ఉంచాం. ఇందుకోసం ఏటా రూ.3,300 కోట్లు వెచ్చిస్తున్నాం. రోగులు కోలుకునే వరకు ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225 జీవనోపాధి భత్యాన్ని చెల్లిస్తున్నాం. ఇలా ఆరోగ్య అత్యవసర సమయంలో ప్రభుత్వం తమ వెనకే ఉందన్న భరోసా సామాన్యులకు కల్పిస్తున్నాం.  ప్రపంచ స్థాయి ఆరోగ్య సౌకర్యాలు అందించే మా ప్రయత్నంలో వైద్యులూ పాలుపంచుకోవాలని కోరుతున్నాను. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ సదస్సు పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందని ఆశిస్తున్నాను’ అని సీఎం పేర్కొన్నారు.
 
సమ్మిట్‌ను ప్రారంభించిన మంత్రి రజని
తొలుత గ్లోబల్‌ హెల్త్‌ సమ్మిట్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్య రంగంలో మెరుగైన నైపుణ్యాభివృద్ధికి ఈ సదస్సు ఎంతో దోహదం చేస్తుందన్నారు. శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా రోగులకు మెరుగైన సేవలందించేందుకు వీలవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య రంగంలో ఉత్తమ పాలసీలు అమలు చేస్తున్నారన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే అమలు చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో వైద్య సేవలకు ఎనిమిది జాతీయ, రెండు అంతర్జాతీయ అవార్డులు లభించాయని చెప్పారు. విశాఖ కలెక్టర్‌ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ ఈ సమ్మిట్‌ మెడికల్‌ రంగంలో నూతన విధానాలకు, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సాయపడుతుందన్నారు. ఏఏపీఐ అధ్యక్షుడు డాక్టర్‌ రవి కొల్లి మాట్లాడుతూ అమెరికా నుంచి 100 మంది, ప్రపంచం నలుమూలల నుంచి 350 మంది వైద్యులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని చెప్పారు. మానసిక ఆరోగ్యం అవగాహన, ఆత్మహత్యల నివారణ, మాతాశిశు మరణాలు, పోషకాహారం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

క్యాన్సర్‌ నివారణ, చికిత్స ప్రపంచ వ్యాప్తంగా సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ఆరోగ్యం, టీకా కార్యక్రమాలు, వైద్య విద్య సంస్కరణలæ గురించి కూడా ఈ సమ్మిట్‌లో చర్చిస్తామని వివరించారు. సదస్సులో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్, ఏపీ సాక్స్‌ పీడీ జీఎస్‌ నవీన్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జె.నివాస్, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నుంచి అభిజత్‌ శేథ్, సమ్మిట్‌ చైర్మన్‌ టి.వి.రవిరాజు, సమ్మిట్‌ భారత్‌ చైర్మన్‌ ప్రసాద్‌ చలసాని, భారతీయ సంతతి అమెరికా వైద్యులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement