కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Mohan Reddy Review Meeting On Corona Virus | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి: సీఎం జగన్‌

Published Thu, May 6 2021 5:14 PM | Last Updated on Fri, May 7 2021 9:37 AM

CM YS Jagan Mohan Reddy Review Meeting On Corona Virus - Sakshi

సాక్షి, అమరావతి : కోవిడ్‌ రోగుల చికిత్స కోసం అవసరం మేరకు పడకల సంఖ్య మరింత పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఉండాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో విధిగా కోవిడ్‌ పేషెంట్లకు 50 శాతం బెడ్లు ఇవ్వాల్సిందేనన్నారు. అంతకంటే ఎక్కువగా రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవడంతో పాటు బెడ్లు కేటాయించాలని ఆదేశించారు. తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలని, కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులూ బెడ్లు ఇవ్వాల్సిందేనని, అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేయాలని సూచించారు.

కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోవిడ్‌ ఆస్పత్రుల వద్దే కోవిడ్‌ కేర్‌ సెంటర్లు (సీసీసీ) ఏర్పాటు చేయాలని, తాత్కాలిక హ్యాంగర్లలో అన్ని వసతులతో సీసీసీ ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఆస్పత్రుల వైద్యులు సీసీసీలో సేవలందిస్తారని చెప్పారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో నాణ్యమైన ఆహారం, శానిటేషన్, ఆక్సిజన్, మెడికల్‌ కేర్, వైద్యుల అందుబాటు.. ఈ ఐదూ తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశించారు. తగినంత ఆక్సిజన్‌ సరఫరా, నిల్వ కోసం చర్యలు చేపట్టాలని,  కేంద్రం కేటాయింపుతో పాటు ప్రత్యామ్నాయంపైనా దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. టీచింగ్‌ ఆస్పత్రుల వద్ద 10 కేఎల్, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కేఎల్‌ ఆక్సిజన్‌ నిల్వలు ఉండాలని, వీలైనంత త్వరగా ఆ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ, చికిత్స, వ్యాక్సినేషన్‌పై  ముఖ్యమంత్రి జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ..

అన్ని ఆస్పత్రుల్లో ఒకేలా చికిత్స
మనం రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తున్నాం. కోవిడ్‌ చికిత్స కోసం అవసరం మేరకు బెడ్ల సంఖ్య మరింత పెంచండి. ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ మంది రోగులు వచ్చినా విధిగా చేర్చుకోవాలి. తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు కేటాయించాలి. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ 50 శాతం బెడ్లు ఇవ్వాలి. అందుకోసం ఆయా ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేసి వాటిలో సగం బెడ్లు మీరే కేటాయించండి. కోవిడ్‌ చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలి. ఇందులో ఎక్కడా తేడా రాకూడదు. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌లో ఉన్న వాటితో సహా అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స ఒకేలా ఉండాలి.

బెడ్లపై స్పష్టత...
ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో ఉన్న బెడ్లు ఎన్ని? వాటిలో ఎన్ని కోవిడ్‌ రోగులకు ఇస్తున్నారు? అన్నది పూర్తి క్లారిటీ ఉండాలి. దానివల్ల ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఇస్తున్నామన్నది స్పష్టత వస్తుంది. అలా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులలో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఉన్నాయన్న దానిపై మనకు పూర్తి స్పష్టత ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు అన్నింటిలో కలిపి కోవిడ్‌ రోగులకు మొత్తం ఎన్ని బెడ్లు ఉన్నాయన్నది తెలుస్తుంది.  

ఉచితంగా వైద్యం..
104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ వస్తే ఆ రోగి ఉన్న ప్రాంతాన్ని బట్టి ఆ జిల్లాకు మెసేజ్‌ వెళ్తుంది. వెంటనే కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించి ఆయా ఆస్పత్రులలో రోగులను చేర్పించాలి. ఇదీ అనుసరించాల్సిన ప్రక్రియ. ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా చూడాలి. కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలి. 

టీచింగ్‌ ఆస్పత్రుల వద్ద సీసీసీ హ్యాంగర్లు...
బోధనాస్పత్రుల వద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్ల హ్యాంగర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. సమీపంలో ఉంటాయి కాబట్టి ఆస్పత్రి వైద్యులు సులభంగా చేరుకుని అక్కడ కూడా సేవలందించగలుగుతారు. అక్కడ అన్ని వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలి.

ఆస్పత్రులు – బెడ్లు... 
రాష్ట్రంలో ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రులు, 349 కార్పొరేట్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు, 47 కార్పొరేట్‌ టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు, 94 ప్రైవేట్‌ కేటగిరీ ఆస్పత్రులు కలిపి మొత్తం 598 ఆస్పత్రుల్లో 48,439 బెడ్లు ఉండగా 41,517 మంది చికిత్స పొందుతున్నారు. మరో 6,922 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రులలో ఉన్న వారిలో 24,500 మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు.

5 అంశాలు తప్పనిసరి..
అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్‌ బాగుండాలి. ఎక్కడా ఏ లోపం లేకుండా ఉండాలి. శానిటేషన్, క్వాలిటీ ఫుడ్, డాక్టర్ల అందుబాటు, ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, ఆక్సీజన్‌.. ఈ ఐదూ చాలా ముఖ్యం. వైద్యులు లేకపోతే వెంటనే తాత్కాలికంగా అయినా నియామకాలు జరగాలి.

అవసరమైతే ఆక్సిజన్‌ దిగుమతి..
ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదు. తగిన మరమ్మతులు చేయండి. కేంద్రం ఇంకా ఎక్కువ ఆక్సిజన్‌ సరఫరా కోసం కృషి చేయడంతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అవసరమైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి. 

ఆస్పత్రుల వద్ద తయారీ ప్లాంట్లు
ప్రతి టీచింగ్‌ ఆస్పత్రి వద్ద 10 కేఎల్‌ సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కేఎల్‌ సామర్థ్యంతో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు ఉండాలి. ప్లాంట్ల ఏర్పాటుకు కొంత సమయం పట్టినా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వీలైనంత త్వరగా అవి ఏర్పాటు కావాలి. 

104 కాల్‌ సెంటర్‌..
104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసిన వారికి పూర్తి సహాయ, సహకారాలు అందించాలి. గతంలో నిర్దేశించుకున్న మాదిరిగా 3 గంటల్లో బెడ్లు కేటాయించాలి. ఎక్కడైనా అంత కంటే ఆలస్యం అవుతుంటే కారణాలు విశ్లేషించి, తగిన చర్యలు తీసుకోవాలి.

16,981 మంది సిబ్బంది నియామకం

  • రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితి, వాక్సినేషన్‌ ప్రక్రియపై సమావేశంలో అధికారులు వివరించారు. ప్రస్తుతం 88 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 44,236 బెడ్లు ఉండగా ఆ సెంటర్లలో 13,356 మంది ఉంటున్నారని అధికారులు వెల్లడించారు, ఈ ఏడాది ఇప్పటివరకు 16,981 మంది సిబ్బందిని నియమించామన్నారు. వీరిలో వైద్య నిపుణులు, స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు, స్వీపర్లు ఉన్నారని తెలిపారు. 
  • కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతం రోజుకు 420 నుంచి 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వినియోగిస్తుండగా అది ఈనెల 15 నాటికి 1,000 మెట్రిక్‌ టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నామని మరోవైపు మన దగ్గర 515 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. ఆక్సిజన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని శ్రీపెరంబదూరు నుంచి రోజుకు 200 టన్నులు, బళ్లారి నుంచి మరో 200 మెట్రిక్‌ టన్నుల సరఫరాతో పాటు ఒడిశా నుంచి తరలించడానికి ట్యాంకర్లు సమకూర్చాలని కేంద్రాన్ని కోరుతున్నామని అధికారులు వివరించారు.
  • కోవిడ్‌ వాక్సినేషన్‌కు సంబంధించి ఇప్పటివరకు 12 లక్షల మందికి రెండు డోసులు, 42 లక్షల మందికి సింగిల్‌ డోస్‌ ఇచ్చామని, మొత్తం 66 లక్షల డోసుల వాక్సిన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
  • సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శా>ఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌) ఎం.రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జ్‌ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఎ.మల్లికార్జున్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

      

చదవండి : YS Jagan: అత్యధిక పరీక్షలు, ఉచిత వైద్యం.. ప్రజలకు అండగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement