జిల్లా రాజకీయాల్లో మకుటం లేని మహారాజు దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి. రాష్ట్ర స్థాయిలో రాజకీయాలను శాసించిన ధీరశాలి ఆయన. తన రాజకీయ వ్యూహంతో కేంద్రంలో కాంగ్రెస్ హైకమాండ్‌కే ముచ్చెమటలు పట్టించిన ఘనాపాటి. జిల్లా రైతాంగం కోసం ఆయన చేసిన కృషికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీర్తి కిరీటం ధరింప చేశారు. నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరును చరితార్థం చేశారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబాల్లో నల్లపరెడ్డి కుటుంబం ఒకటి. ఇప్పటికీ ఆ కుటుంబానికి విధేయులుగా నడుచుకునే అభిమానులు, రాజకీయ నాయకులు ఉన్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు వింటేనే రాష్ట్రంలో ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది నెల్లూరు. రైతుల కష్టాలు ఎరిగిన శ్రీనివాసులురెడ్డి వారికి అండగా నిలిచారు. తెలుగు గంగ ప్రాజెక్ట్‌ను జిల్లాకు తీసుకురావడంతో పాటు, దానిని ఎనీ్టఆర్, ఎంజీఆర్‌లతో కలిసి రైతాంగానికి అంకితమిచ్చారు. సోమశిల నీటి సామర్థ్యాన్ని పెంపొందించే విషయంలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి సేవలు చిరస్మరణీయం. జిల్లాలో ఎక్కువగా డెల్టా ప్రాంతంలోని రైతులకు సాగునీటి కష్టాలు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని రెండు పంటల సాగుకు నీరందించే విధంగా చర్యలు తీసుకున్నారు.
తెలుగు గంగ కాలువ ప్రారంభంలో ఎనీ్టఆర్, ఎమ్‌జీఆర్‌తో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి (ఫైల్)
రైతుల గుండెల్లో అజరామరం
నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డిని జిల్లాలోని ప్రతి రైతు తమ గుండ్లెలో నింపుకున్నారు. రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను గుర్తించిన నల్లపరెడ్డి ప్రాజెక్ట్‌ల సాధన కోసం నిత్యం పోరాటాలు చేసి రైతుల పాలిట పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్నారు. జిల్లాలో తనకంటూ ప్రత్యేక రాజకీయ ముద్రను వేసుకున్న నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రైతు బాంధువుడిగా నిలిచిచారు. ప్రస్తుత పెన్నాడెల్టా ఆధునికీకరణకు 1987లో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఆయన భౌతికంగా లేకపోయినా.. రైతులు గుండెల్లో అజరామరుడిగా నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి నిలిచిపోయారు.
నల్లపరెడ్డి పేరు శాశ్వతం
గతేడాది అక్టోబరు 27వ తేదీ నెల్లూరు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు నామకరణం చేయబోతున్నామని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కేబినెట్ నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరును పెడుతూ తీర్మానాన్ని ఆమోదించింది. జిల్లా రైతుల కోసం కష్టపడిన దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి బ్యారేజీ ఉన్నంత వరకు.. చరిత్ర చెరిగిపోని వరకు బతికే ఉంటారు. నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెట్టడంపై పలువురు రాజకీయ విశ్లేషకులు, నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీనివాసులురెడ్డి రాజకీయ ప్రయాణం
ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలంలోని కొత్తపట్నం గ్రామానికి చెందిన నల్లపరెడ్డి వీరరాఘవరెడ్డి కుమారుడు నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి. 1933 ఏప్రిల్ 30న జని్మంచారు. విశాఖపట్నంలో బీఎల్ పూర్తిచేసే సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. 1961వ సంవత్సరంలో కోట సమితి అధ్యక్షుడిగా తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1972లో జనరల్ స్థానంగా ఉన్న గూడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1978లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి కోవూరు నియోజకవర్గాన్ని తన స్థానంగా శాశ్వతం చేసుకున్నారు. కోవూరు నియోజకవర్గం నుంచి 1983, 1985లో టీడీపీ తరఫున, 1989లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ విధంగా జిల్లా అంతటా నల్లపరెడ్డి వర్గాన్ని సృష్టించుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముఖ్యమంత్రులు టి.అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, ఎన్‌టీ రామారావు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రజలు మన్ననలు అందుకున్నారు. రాజీ పడని రాజకీయ నేతగా.. ఎమ్మెల్యేగా ఒక్క రోజు కూడా గైర్హాజరు కాకుండా అసెంబ్లీ టైగర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిది
నెల్లూరు బ్యారేజీకి తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెడుతూ కేబినెట్‌తో ఆమోదింప చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జీవిత కాలం రుణపడి ఉంటాం. మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి జిల్లా ప్రజలకు, రైతులకు చేసిన సేవలకు ఇన్నాళ్లకు గుర్తింపు లభించింది. మా తండ్రి భౌతికంగా లేకపోయినా.. బ్యారేజీ పేరుతో రైతుల గుండెల్లో గుర్తిండిపోతారు. ఇది జీవితంలో మరచిపోలేని రోజు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
– నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment