పోలవరంలో ముగిసిన సీఎం జగన్‌ పర్యటన | CM YS Jagan Polavaram Project Tour Highlights: Review On Development Works | Sakshi
Sakshi News home page

పోలవరంలో ముగిసిన సీఎం జగన్‌ పర్యటన

Published Mon, Jul 19 2021 10:39 AM | Last Updated on Mon, Jul 19 2021 7:16 PM

CM YS Jagan Polavaram Project Tour Highlights: Review On Development Works - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్‌ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం  స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

అనంతరం సీఎం జగన్‌  పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను సీఎం వైఎస్ జగన్‌ పరిశీలించి, అనంతరం పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు. సీఎం జగన్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, అధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా మధ్యాహ్నం అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం సీఎం జగన్‌ పోలవరం పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయలుదేరారు.

2022 జూన్‌ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలి..
పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సీఎం జగన్ జరిపిన సమీక్షలో స్పిల్‌వే 42 గేట్లు అమర్చినట్టు తెలిపిన అధికారులు.. ఎగువ కాఫర్‌ డ్యాం పనులను పూర్తి చేశామని తెలిపారు. అదే సమయంలో దిగువ కాఫర్ డ్యాం పనుల పరిస్థితిని అధికారులు వివరించగా, 2022 జూన్‌ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలని, టన్నెల్, లైనింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్‌ సూచించారు. 2023 ఖరీఫ్‌ సీజన్‌కల్లా ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పూర్తి చేయాలని అధికారులతో సమీక్షలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు.


 
చదవండి: Polavaram: సిద్ధిస్తున్న సంకల్పం

ఇక ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా 2019 జూన్‌ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు,  సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు.


ఆలోగా కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటరీల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ సర్కారు నామినేషన్‌ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన పనులను రద్దు చేసి  రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28, డిసెంబర్‌ 14న క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement