అవినీతి చేయాలంటే భయపడాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Anti Corruption | Sakshi
Sakshi News home page

అవినీతిని కూకటివేళ్లతో పెకలించాల్సిందే: సీఎం జగన్‌

Published Mon, Aug 24 2020 3:31 PM | Last Updated on Mon, Aug 24 2020 4:16 PM

CM YS Jagan Review Meeting On Anti Corruption - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి చేయాలంటే భయపడే స్థాయికి రావాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని విధానాలతో ముందుకు వెళ్లాలని చెప్పారు. అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. 14400 కాల్‌ సెంటర్, కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్‌ నివేదిక, రివర్స్‌ టెండరింగ్, జ్యుడిషియల్‌ ప్రివ్యూ తదితర అంశాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1902 నెంబర్‌ను కూడా ఏసీబీతో అనుసంధానం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలి. వచ్చిన ఫిర్యాదులను మానిటరింగ్‌ చేసే వ్యవస్థ బలంగా ఉండాలి. 1902కు వచ్చే కాల్స్‌పై బలోపేతమైన అమలు విభాగం ఉండాలి. దీనికి కలెక్టర్‌ కార్యాలయాలను కూడా అనుసంధానం చేయాలి. టౌన్‌ ప్లానింగ్, సబ్‌ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీఓ‌  కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకూడదు. ( సెప్టెంబర్‌ 3 న ఏపీ కేబినెట్‌ భేటీ )

దీనిపై ఫోకస్‌గా ముందుకు వెళ్లండి. 14400 నెంబర్‌పై మరింత ప్రచారం నిర్వహించండి, పర్మినెంట్‌ హోర్డింగ్స్‌ పెట్టండి. రెడ్‌ హ్యండెడ్‌గా దొరికిన కేసుల్లో చర్యలు తీసుకోవడానికి సంవత్సరాల కాలం పట్టకూడదు. అవినీతికి పాల్పడుతూ, లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కేసుల్లో కూడా దిశ చట్టం మాదిరిగానే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా ఉండాలి. కొన్ని అవినీతి కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోంది అంటే.. అవినీతి నిరోధకత విషయంలో సీరియస్‌గా లేమనే సంకేతాలు వెళ్తున్నాయి. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత వెంటనే చర్యలు తీసుకునేలా విధానాలు ఉండాలి. దీనికోసం అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించాలి.

28 ఏళ్ల కాలంలో ప్రభుత్వానికి రూ.322 కోట్లు
కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్‌ ప్రాజెక్టు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 2018, జులైలో ఒప్పందం కుదిరింది. 4,766.28 ఎకరాల భూమిని సదరు కంపెనీకి ఇచ్చారు. అప్పటి ప్రభుత్వంలో ఎకరాకు కంపెనీ చెల్లించే మొత్తం రూ.2.5 లక్షలు మాత్రమే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కంపెనీతో తిరిగి సంప్రదింపులు జరిపింది. అవే స్పెసిఫికేషన్లతో విద్యుత్‌ ప్రాజెక్టు ఆ కంపెనీ నిర్మాణానికి ఓకే అంది. ప్రభుత్వానికి ఎకరాకు రూ.2.5 లక్షలకు బదులు రూ.5 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకుంది. ఎకరాకు అదనంగా రూ. 2.5 లక్షలు ఈ ప్రభుత్వం తీసుకురాగలిగింది. దీని వల్ల అదనంగా రూ.119 కోట్ల ఆదాయం వస్తోంది. అలాగే సోలార్‌/విండ్‌ కింద ఉత్పత్తి చేసే 1550 మెగావాట్ల ఉత్పత్తికి గాను మెగావాట్‌కు రూ.1 లక్ష చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. దీని వల్ల ఏడాదికి రూ.15.5 కోట్ల చొప్పున 28 ఏళ్ల కాలంలో రూ.322 కోట్లు ప్రభుత్వానికి వస్తాయి.

అంతే కాక రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఉత్పత్తి చేయనున్న 1680 మెగావాట్ల కరెంటుకు గాను, మెగావాట్‌కు మొదటి పాతికేళ్లలో రూ.1 లక్ష, తద్వారా ఏడాదికి రూ.16.8 కోట్లు, 25 ఏళ్ల తర్వాత రూ.2 లక్షలు చొప్పున ఏడాదికి రూ.33.6 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 2,940 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక అదే కంపెనీతో సంప్రదింపులు కారణంగా రూ.3,381 కోట్లు ప్రభుత్వానికి అదాయం వస్తోంది. ఇదే గత ప్రభుత్వంలో కేవలం రూ.119 కోట్లు మాత్రమే ఆదాయాన్ని చూపించారు. ప్రభుత్వానికి ఈ రకమైన మేలు చేయడానికి ప్రయత్నించిన అధికారులను అభినందిస్తున్నా.

ప్రభుత్వం మారింది.. 500 ఎకరాలు మిగిలింది
భోగాపురం ప్రాజెక్టు విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటో చాలా స్పష్టంగా కనిపించింది. గత ప్రభుత్వం 2703 ఎకరాలను విమానాశ్రయానికి కేటాయిస్తే.. అదే కంపెనీతో ఈ ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. అదే కంపెనీ 2203 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందుకు వచ్చింది. గత ప్రభుత్వంతో ఒప్పందం సమయంలో కడతానన్న ప్రతి సదుపాయం కూడా 2203 ఎకరాల్లో ఆ కంపెనీ కట్టేందుకు ముందుకు వచ్చింది. కంపెనీ మారలేదు, ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు లేవు, భూమీ మారలేదు. వచ్చిందల్లా ప్రభుత్వంలో మార్పే. పునర్‌ సంప్రదింపులు కారణంగా 500 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగిలింది. ఎకరాకు రూ. 3 కోట్లు వేసుకున్నా ప్రభుత్వానికి రూ.1500 కోట్లు ఆదాయం మిగిలినట్టే.

రివర్స్‌ టెండరింగ్‌ :
సుపరిపాలనలో భాగంగా, విప్లవాత్మక మార్పుగా చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ పైనా అధికారులు సీఎంకు వివరాలు అందించారు.  మొత్తంగా 788 టెండర్లకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించామని తెలిపారు. సాధారాణ టెండర్ల ప్రక్రియ ద్వారా 7.7 శాతం మిగులు ఉండగా, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 15.01 శాతం మిగులు ఉంటుందని వెల్లడించారు.

జ్యుడిషియల్ ‌ప్రివ్యూ:
రూ.100 కోట్లు దాటిన ఏ ప్రాజెక్టుకైనా జ్యుడిషయల్‌ ప్రివ్యూకు వెళ్తున్నామని అధికారులు వివరించారు. 2019 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు వరకు 45 ప్రాజెక్టులు ఆ ప్రివ్యూకు వెళ్లాయని చెప్పారు. రూ.14,285 కోట్లు విలువైన పనులు జ్యుడిషయల్‌ ప్రివ్యూకు వెళ్లాయని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement