
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చి 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని, ప్రపంచ రాజ్యాంగాల్లో మనది అతిపెద్దది, అత్యుత్తమమైనది అన్నారు. రాజ్యాంగ పీఠికలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని పేర్కొన్నారు. ‘మనది సార్వభౌమ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య దేశం.
రిపబ్లిక్, సామాజిక న్యాయంతో పాటు, రాజ్యాంగం ప్రతి పౌరుడికీ భావ ప్రకటనా స్వేచ్ఛనూ, విశ్వాసాన్నీ కల్పిస్తోంది. మన రాజ్యాంగం అందరికీ సమాన హోదాతో పాటు సమాన అవకాశాలు అనే ఆదేశాన్ని కూడా ఇచ్చింది. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న మార్గదర్శక సూత్రాలను గౌరవిస్తూ 31 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిజమైన స్ఫూర్తితో ముందుకు తీసుకువెళుతోంది’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.