సాక్షి, కృష్ణా: నాగరికతకు పట్టుకోమ్మలు బీసీలు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ జయహో బీసీ మహాసభలో ఆయన ప్రసంగించారు.
బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వార్డు మెంబర్ల దగ్గరి నుంచి తన కేబినెట్‌లోని మంత్రులకు, ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు ఈ మూడున్నరేళ్ల కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పడుతున్నాయి.
బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని తెలిపారు. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టింది. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసిందని సీఎం జగన్ పేర్కొన్నారు. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నెముక కులాలు చేస్తానని చెప్పాను. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వాముల్ని చేశానని సీఎం జగన్ గుర్తు చేశారు.
బీసీ కులాలన్నింటికీ మేలు చేస్తామని పాదయాత్రలో చెప్పాను. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వామ్యం చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని మేం అమలు చేశాం. దేశంలోనే తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ తెచ్చాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం. మరోవైపు అమ్మ ఒడి, వైఎస్‌ఆర్ చేయూత పథకాల ద్వారా ఆదుకుంటున్నాం. చిరువ్యాపారులకు తోడుగా ఉండేందుకు జగనన్న చేదోడు పథకం తెచ్చాం. చేయూత పథకం కింద రూ.14,110 కోట్లు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. తిరుమలలో సన్నిధి గోల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయం కల్పించాం. బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదు.. వెన్నెముక కులాలు అని మరోసారి సీఎం జగన్ ఉద్ఘాటించారు.
ఈ గణాంకాలే నిదర్శనం
చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదు. కానీ, మన ప్రభుత్వం ప్రతీ అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాం. ఈ మూడున్నరేళ్లలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే.. సగం బీసీలకే ఇచ్చాం. రాష్ట్రం విషయానికొస్తే.. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. 32 మంది ఎమ్మెల్సీలలో 18 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైన్టార్టీలే. శాసన సభ స్పీకర్‌గా బీసీ నేత తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్‌గా ఎస్సీ నేత మోషేన్‌రాజును నియమించాం.
శాసన మండలిలో వైఎస్‌ఆర్‌సీపీ 32 మంది సభ్యుల్లో బీసీలే అత్యధికం. మండల పరిషత్ పదవుల్లో 67 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. రెండో విడత కేబినెట్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. కేబినెట్‌లో పదకొండు మంది బీసీ మంత్రులు ఉన్నారు. కేబినెట్‌లో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్థానం కల్పించాం. రాష్ట్రంలోని 117 మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌లలో 84లో 44 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. 137 కార్పొరేషన్ చైర్‌పర్సన్‌లలో 79 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 బీసీలకే.
ప్రభుత్వ కార్పొరేషన్‌లలో 137 చైర్మన్ పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. 86 శాతం మేయర్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు. 484 డైరెక్టర్ పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగుల్లో.. 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలలో 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. మొత్తంగా రాజకీయ, సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చాం అని సీఎం జగన్ ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment