పల్నాడు జిల్లా కొప్పుకొండ గ్రామంలో నిర్మాణంలో ఉన్న సచివాలయం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్ భవనాలు
సాక్షి, అమరావతి: అప్పట్లో ‘ఆయన’ వస్తే బాగుండు అని ఊదరగొట్టారు. సీన్ కట్‌చేస్తే.. ఆయన వచ్చాడు. వచ్చాక ఏమైందంటే.. ఊళ్లలో అడుగడుగునా జన్మభూమి కమిటీ సభ్యుల ఆగడాలు. ఏమైనా సమర్పించుకుంటేనే పనులయ్యేవి. అదికూడా పచ్చపార్టీ వారికే. పెన్షన్లు ఎప్పుడిస్తారో దైవా‘దీనం’.. ఎండలో, వానలో గంటలతరబడి ఎదురుచూడాల్సిందే. ఇలా సవాలక్ష ఇక్కట్లు ఆ ఐదేళ్లలో. కానీ, ఇప్పుడో.. జన్మభూమి కమిటీ సభ్యుల ఆగడాల్లేవు. సంక్షేమ పథకాలు ఠంఛనుగా చెప్పిన టైముకి వచ్చేస్తున్నాయి. ఇందుకు ఒక్కపైసా ఎవ్వరికీ ఇవ్వక్కర్లేదు.
ఈ మూడేళ్లలో రూ.1.41 లక్షల కోట్లు పేదలకు నేరుగా అందించినా అందులో దుర్వినియోగమైంది నిల్. వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించి, అర్హత ఉంటే వారే పైసా ఖర్చుకాకుండా దరఖాస్తు పూర్తిచేస్తున్నారు. కులం, మతం, పార్టీ అన్నది చూడకుండా అర్హత ఉన్న ప్రతీఒక్కరినీ ఎంపిక చేస్తున్నారు. అర్హత లేకపోయినా వారికి మరోసారి తన అర్హత నిరూపించుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఇస్తోంది. ఇక ఆర్బీకేలు రైతులకు ఆత్మీయ నేస్తాలు. అన్ని సదుపాయాలు ఆ గొడుగు కిందే ఉన్న ఊర్లోనే అందుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఊరు మారింది. పల్నాడు జిల్లా కొప్పుకొండ, చింతలచెరువు గ్రామాలను ‘సాక్షి’ పరిశీలించగా ఇది స్పష్టంగా కనిపించింది.
కొప్పుకొండలో..
‘ఇంతమాత్రం మా ఊరు బాగుచేయించిన వారు ఎవరులేరులే. ఈ రెండేళ్లలోనే మా ఊరు బాగా మారింది’.. గతంలో ఐదేళ్లపాటు టీడీపీ తరఫున పల్నాడు జిల్లా కొప్పుకొండ గ్రామ పంచాయతీ సర్పంచిగా పనిచేసిన పసుపులేటి చిన అంజయ్య వాళ్ల ఊరు గురించి ఇప్పుడు గొప్పగా చెప్పిన మాటలివి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం టీడీపీకే మెజార్టీ వచ్చిన ఆ ఊరిలో ఇప్పుడు పార్టీలకతీతంగా ఎవరిని కదిలించినా గత రెండు మూడేళ్లలో ఆ ఊరిలో జరిగిన అభివృద్ధి గురించి గొప్పగా చెబుతున్నారు.
► ఇక ఇదే ఊరిలో 270 ఎకరాల విశాలమైన చెరువు ఉంది. మూడేళ్ల క్రితం వరకు ఈ చెరువులో చేపల పెంపకం ద్వారా గ్రామ పంచాయతీకి ఏటా లక్షన్నరకు మించి ఆదాయం వచ్చేదికాదు. కానీ, ఇప్పుడు అదే చెరువు మీద ఏటా రూ.20 లక్షలు వస్తున్నాయి. ఇన్నాళ్లు టీడీపీ నియోజకవర్గ నాయకుల ఆధీనంలో ఉండే ఆ చెరువును ప్రభుత్వం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొత్తగా వేలం పాట నిర్వహించగా, ఆదాయం పెరిగిపోయింది. దీంతో రూ.10లక్షలు పెట్టి శ్మశానానికి రెండెకరాల పొలం కొన్నారు. రూ.3లక్షలతో దానిచుట్టూ కంచె ఏర్పాటుచేస్తున్నారు.
► గతేడాది ఆ చెరువు డబ్బులు పెట్టి గ్రామంలో 13 కిలోమీటర్ల పొడవున పొలాలకు వెళ్లడానికి విశాలమైన రోడ్లు వేసుకున్నారు. ‘ఇంతకుముందు పొలాలకు దారేలేదు. మందుకట్టలు తీసుకుపోవాలన్నా మోసుకుపోవాలి. కొత్తగా మూడురోడ్లు వేసుకున్నాం’ అని ప్రస్తుత గ్రామ సర్పంచి కోలా వీరాంజనేయులు చెప్పారు. ఇలా రోడ్లు వేయడంతో ఆ ఊరి పొలాల రేట్లు రెట్టింపయ్యాయి. రెండేళ్ల క్రితం నాలుగైదు లక్షలు ఉండే ఎకరా ధర ఇప్పుడు ఏడెనిమిది లక్షలకు పెరిగిపోయింది. చెరువు ఆదాయం పెరగడంతో కొత్తగా ఊళ్లో పది మందికి ఉపాధి కూడా దొరికింది.
చింతలచెరువులో..
నూజెండ్ల మండలంలో చింతలచెరువు చాలా చిన్న గ్రామ పంచాయతీ. ఆ ఊరి జనాభా 1,500లోపే. ఆ ఊళ్లో ప్రజలకు ప్రభుత్వంతో ఏ పని ఉన్నా ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం లేదిప్పుడు. ఆ ఊరి గ్రామ సచివాలయంలోనే వారి పనులు పూర్తవుతున్నాయి.
► రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా 44 ఇళ్లను ఈ ఊరికి మంజూరు చేసింది. గతంలో ఇల్లు మంజూరు కావాలంటే లబ్ధిదారుడు పనులన్నీ మానుకుని నెలల తరబడి పట్టణాల్లోని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లే వెళ్లి పనులు కానిచ్చేస్తున్నారు.
► ఇటీవల కొత్తగా పొలం కొనుక్కొని పట్టాదారు పాసు పుస్తకం కోసం వచ్చిన నూర్‌బాషా.. ఇన్సూరెన్స్ పథకం నిమిత్తం బయోమెట్రిక్ కోసం వచ్చిన కాశమ్మ.. ఇంటి కోసం దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చిన నాగూర్‌వలి వంటి వారితో మంగళవారం మధ్యాహ్నం కూడా గ్రామ సచివాలయం కళకళలాడుతూ కనిపించింది.
చింతలచెరువు లోని ఆర్బీకే వద్ద పశు వైద్య సేవలు
బడి మానేసిన రవిశంకర్ మళ్లీ స్కూల్‌కి..
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం గ్రామాల్లో చాలా పేదింటి కుటుంబాల పిల్లల చదువుకు వరంగా మారింది. చింతలచెరువు గ్రామంలోనే పదిహేను ఏళ్ల వయస్సుండే మేకల చిన్నకృష్ణమూర్తి, అనంతలక్ష్మీల రెండో కుమారుడు రవిశంకర్ రెండేళ్ల క్రితం తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి పనిలో చేరాడు. 2019–20లో అమ్మఒడి ద్వారా సర్కారు రూ.15 వేలు ఇవ్వడం చూసి ఆ కుటుంబం రవిశంకర్‌ను తిరిగి బడిలో చేర్పించింది. ఈ ఏడాది అతను టెన్త్ పరీక్షలు బాగా రాశానని.. ఇంటర్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ‘సాక్షి’కి చెప్పాడు. రవిశంకర్ అమ్మ అనంత లక్ష్మీ కూడా ఏడాదిన్నర క్రితం తాను కొత్తగా పొదుపు సంఘంలో చేరినట్లు తెలిపారు.
నాడు–నేడుతో బడికి మహర్దశ
చింతలచెరువు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.27 లక్షలతో అభివృద్ధి చేసింది. కొత్తగా మరో రెండు అదనపు తరగతుల భవనాలను కూడా నిర్మించింది. ఆ చిన్న పల్లెలోని ప్రాథమిక పాఠశాలలో ఫ్యానులు, బల్లలు వంటివి ఏర్పాటుచేయడంతో.. 2019–20లో 101 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య రెండేళ్లలోనే 133కు పెరిగింది.
పశువైద్యం కూడా అందుబాటులోనే..
సచివాలయ వ్యవస్థ ఏర్పాటు తర్వాత ప్రతి గ్రామ సచివాలయానికి ఒకరు చొప్పున పశు సంవర్థక అసిస్టెంట్‌ను ప్రభుత్వం నియమించడంతో ఈ చిన్న గ్రామంలోనూ పశువైద్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో పశువులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పొరుగు గ్రామం వైపు చూసే పరిస్థితి. కానీ, ఇప్పుడు అర్ధరాత్రి పశువులకు ఏ ఆపదొచ్చినా చికిత్సకు ఆ ఊరిలోనే పశు వైద్య నిపుణుడు అందుబాటులో ఉన్నారు.
అన్నదాతలకు తోడుగా..
చింతలచెరువు గ్రామ సచివాలయంలో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్.. ఆర్బీకేకి అనుసంధానంగా పంటల వారీగా రైతులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి వారికి ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల ద్వారా సాగుకు సలహాలు అందజేస్తున్నారు. ఇక ఈ గ్రామంలోనూ సీఎం జగన్ ప్రభుత్వం రెండు విడతలుగా చేపట్టిన సచివాలయ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌తో కొత్తగా ఇద్దరు ఉద్యోగాలు పొందారు. ఆ గ్రామం పుట్టాక ఊరిలో ప్రభుత్వోద్యోగం వచ్చిన వారు మొత్తం ఐదుగురేనని.. అందులో ఇద్దరు ఈ మూడేళ్లలో వచ్చిన వారని గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment