యుద్ధ విన్యాసాల్లో నౌకలు (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం: నీలి కెరటాలలో నౌకా దళ యుద్ధ విన్యాసాలకు విశాఖ తీరం సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే ప్రధాన ఘట్టాలకు విశాఖలోని తూర్పు నౌకాదళం ఆతిథ్యమిస్తోంది. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్‌ఆర్), వివిధ దేశాల నౌకా దళాల యుద్ధ విన్యాసాలతో మిలాన్ – 2022కి ఏర్పాట్లు చేసింది. ఈ రెండు ప్రతిష్టాత్మక విన్యాసాల కోసం నౌకాదళం చేస్తున్న రిహార్సల్స్‌తో విశాఖ సాగర తీరం సందడిగా కనిపిస్తోంది. మిలాన్–2022, ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూల వివరాల్ని నౌకాదళం గురువారం విడుదల చేసింది. ఈ నెల 21న పీఎఫ్‌ఆర్ జరగనుంది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి, త్రివిధ దళాధిపతికి వందనం సమర్పించడంతో పాటు భారత నౌకాదళ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పనుంది. అనంతరం.. 25 నుంచి మార్చి 4 వ తేదీ వరకు మిలాన్–2022 పేరుతో అంతర్జాతీయ విన్యాసాలు నిర్వహిస్తోంది.
60 యుద్ధ నౌకలు.. 55 యుద్ధ విమానాలు
ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్‌కి చెందిన 60 యుద్ధ నౌకల్లో 10 వేల మంది సిబ్బందిని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమీక్షిస్తారు. రాష్ట్రపతి కోసం ఐఎన్‌ఎస్ సుమిత్ర ప్రెసిడెంట్ యాచ్‌గా రూపుదిద్దుకుంది. ఆ నౌక నుంచి రాష్ట్రపతి విశాఖ తీరంలో లంగరు వేసిన 44 యుద్ధ నౌకల్ని పరిశీలిస్తారు. అనంతరం నౌకాదళానికి చెందిన 55 యుద్ధ విమానాలు గగనతల విన్యాసాలు చేస్తాయి. సబ్‌మెరైన్ – షిప్ ఫార్మేషన్ స్టీమ్ పాస్ట్, ఎలైట్ మెరైన్ కమాండోస్ ద్వారా వాటర్ పారా జంప్‌లు, సముద్రంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రదర్శన, హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఏరోబాటిక్స్‌తో పాటు ప్రఖ్యాత ఐఎన్‌ఎస్‌వీ మహాదేయ్ సహా బోట్ల కవాతు అలరించనున్నాయి. సమీక్ష అనంతరం ఫ్లీట్ రివ్యూకి సంబంధించిన పోస్టల్ కవర్, స్మారక తపాలా బిళ్లని రాష్ట్రపతి విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దేవుసింహ్ జె చౌహాన్ కూడా పాల్గొంటారు.
45 దేశాలతో మిలాన్–2022 రికార్డు
ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న మిలాన్–2022లో 45కి పైగా దేశాలు పాల్గొంటాయని నౌకాదళం వెల్లడించింది. ఇప్పటివరకూ 17 దేశాలు పాల్గొన్న అతి పెద్ద మిలాన్ రికార్డుని తిరగ రాస్తున్నట్లు తెలిపింది. మిలాన్–22లో 15 కంటే ఎక్కువ విదేశీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి. 11 మంది విదేశీ నౌకాదళాలు, కోస్ట్ గార్డ్‌ల చీఫ్‌లు, 120 కంటే ఎక్కువ మంది విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – హిందూ ఓషన్ రీజియన్ (ఐఎఫ్‌సీఐఓఆర్) నివేదిక ప్రకారం వివిధ దేశాల నుంచి 30 కంటే ఎక్కువ మంది డిఫెన్స్, నేవల్ అధికారులు, 2000కు పైగా విదేశీ నౌకాదళ సిబ్బంది విదేశీ యుద్ధ నౌకలు, విమానాలలో బయలుదేరినట్లు సమాచారం. 27న జరిగే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో 35 బృందాలతో విన్యాసాలు, అంతర్జాతీయ సిబ్బంది ఫ్లైపాస్ట్ జరుగుతాయి. సిటీ పరేడ్‌ను నాలుగు లక్షలకు పైగా ప్రజలు తిలకిస్తారని అంచనా వేస్తున్నట్లు నౌకాదళం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment