సాక్షి, అమరావతి: సమర్థంగా, సమగ్రంగా, త్వరగా కేసుల దర్యాప్తు దిశగా దేశం కీలక ముందడుగు వేయబోతోంది. అందుకోసం నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించే వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. కంటిపాప (రెటీనా) నుంచి కాలివేళ్ల దాకా మొత్తం బయోమెట్రిక్ డేటాను సేకరించనుంది. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ ఐడింటిఫికేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించమని జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)ని ఆదేశించింది.
ఇప్పటివరకు ఖైదీల చేతి వేలిముద్రల సేకరణకే అధికారం
నేరస్తులు, అనుమానితుల సమగ్ర డేటాను భద్రపరచడం నేర పరిశోధనకు అత్యంత అవసరం. ఆ కీలక డేటా అందుబాటులో ఉంటే కేసుల దర్యాప్తు, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, సాక్ష్యాధారాల సేకరణ, నేరాన్ని నిరూపించడం సులభసాధ్యమవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరస్తులు కొత్తకొత్త రీతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఉగ్రవాదం, తీవ్రవాద బెడద పొంచి ఉండనే ఉంది.
ఈ నేపథ్యంలో 1920లో రూపొందించిన ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ చట్టాన్ని ఇంకా అనుసరిస్తుండటం సరికాదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఖైదీల చేతి వేలిముద్రలను మాత్రమే సేకరించే అధికారం పోలీసులకు ఉంది.
కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కాలానుగుణంగా మారుతున్న నేరాల నిరూపణకు వేలిముద్రలు సరిపోవడంలేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలతో చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించింది.
ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్–1920 స్థానంలో క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) చట్టం–2022ను పార్లమెంటు ఈ ఏడాది ఆగస్టులో ఆమోదించింది. ఈ చట్టం నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు అధికారాలను కట్టబెట్టింది.
ప్రాథమిక విధానం ఖరారు
నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించేందుకు ఎన్‌సీఆర్‌బీ విధివిధానాలను రూపొందిస్తోంది. అందుకోసం ఇటీవల అన్ని రాష్ట్రాల నేరగణాంక సంస్థ (ఎస్‌సీఆర్‌బీ)లతో సమావేశం నిర్వహించింది. బయోమెట్రిక్ ఆధారాల కింద వేటిని సేకరించాలి, ఎలా భద్రపరచాలి, అమలులో ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించి ప్రాథమికంగా ఓ విధానాన్ని ఖరారు చేశారు. న్యాయస్థానాల నుంచి మినహాయింపు ఉన్న కేసుల్లో మినహా అన్ని కేసులకు సంబంధించిన నేరస్తులు, ఖైదీల పూర్తి బయోమెట్రిక్ డేటాను సేకరించాలని నిర్ణయించారు.
సీఆర్‌పీసీ సెక్షన్లలోని చాప్టర్ 9ఏ, చాప్టర్ 10 కింద అరెస్టయి రిమాండులో ఉన్న ఖైదీల బయోమెట్రిక్ డేటాను కనీసం ఎస్పీ ర్యాంకుకు తక్కువకాని పోలీసు అధికారి లిఖితపూర్వక అనుమతితో సేకరిస్తారు. నేరస్తులు, ఖైదీల కంటిపాప, రెండుచేతుల వేలిముద్రలు, రెండు అరచేతులు, రెండు అరిపాదాలు, రెండుకాళ్ల వేలిముద్రలు, ఫొటోలు, సంతకం, చేతిరాత.. ఇలా అన్నీ సేకరిస్తారు. వాటి స్కాన్ కాపీలు, ఫొటోలు, వీడియోలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు.
కేవలం నిషేధ ఆజ్ఞల ఉల్లంఘన, ముందస్తు అరెస్టుల కింద అదుపులోకి తీసుకున్నవారి బయోమెట్రిక్ ఆధారాలు సేకరించరు. వాటితోపాటు ఇతర నేరాలు ఏమైనా ఉంటే మాత్రం బయోమెట్రిక్ ఆధారాలు సేకరిస్తారు. ఎవరైనా నేరస్తులు, ఖైదీలు తమ బయోమెట్రిక్ ఆధారాలు ఇచ్చేందుకు సమ్మతించకపోతే అది మరో నేరంగా పరిగణిస్తారు. నేర ఆధారాలను ధ్వంసానికి పాల్పడిన నేరంగా కేసు నమోదు చేసేందుకు పోలీసులకు అధికారం ఉంది. ఆమేరకు న్యాయస్థానం అనుమతితో బలవంతంగా అయినా సరే బయోమెట్రిక్ ఆధారాలు సేకరించే అధికారం పోలీసులకు ఉంది.
డిజిటల్ రూపంలో భద్రం
నేరస్తులు, ఖైదీల బయోమెట్రిక్ ఆధారాలను భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఓ కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. కేంద్ర భద్రతా బలగాలతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు సేకరించిన డేటాను డిజిటల్ రూపంలో అందులో భద్రపరుస్తారు. వాటిని అన్ని రాష్ట్రాల ఫోరెన్సిక్ విభాగాలకు అనుసంధానిస్తారు. దీంతో కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు చేపట్టే కేసుల దర్యాప్తు కోసం ఆ డేటా అందుబాటులో ఉంటుంది.
ఒక్కో నేరస్తుడు, ఖైదీ నుంచి సేకరించే డేటాను కనీసం 75 ఏళ్లు భద్రపరచాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం ఇక అవసరంలేదని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయిస్తే న్యాయస్థానం అనుమతితో ఆ డేటాను ధ్వంసం చేస్తారు. అందుకోసం కూడా ఓ విధానాన్ని రూపొందించనున్నారు. త్వరలోనే సమగ్ర బయోమెట్రిక్ డేటా సేకరణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment