సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రజారోగ్యం దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. నేటి నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు కానుంది.. మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఉంటుంది. కర్ఫ్యూ ఈనెల 18 వరకు కొనసాగనుంది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ప్రకటించింది. కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
బ్యాంక్ సేవలు యథాతథం
అయితే కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపులు ప్రకటించింది. రాష్ట్రంలో బ్యాంక్ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. బ్యాంక్ సేవలకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. అలాగే జాతీయ రహదారుల పనులు కొనసాగించేందుకు అనుమతి ఉంది.పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నిషేధం
కాగా రోనా కట్టడి చర్యల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూను అతిక్రమించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. గుమిగూడడం, సమావేశాలు నిర్వహించడం వంటి వి పూర్తిగా నిషేధం. ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఆ తరువాత కర్ఫ్యూ అమలవుతుంది. ఆ సమయంలో ఆటోలు, ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కూడా నిషేధం ఉంది. 12 గంటల తరువాత ఆటోలు రోడ్ల పైకి వస్తే సీజ్ చేస్తా మని ప్రభుత్వం ప్రకటించింది.
అత్యవసర సేవల వాహనాలను మాత్రం అనుమతించనున్నారు. అలాగే మీడియా వంటి అత్యవసర ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఉదయం పూట షాపులు తెరిచే సమయంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఉంది. ఆ సమయంలో గుంపులు గుంపులుగా షాపింగ్‌లు చేయకూడదు. ఈ ఆంక్షలు రెండు వారాలు కొనసాగుతాయి. ఇప్పటికే ప్రభుత్వం రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తోంది.
స్వీయ ఆంక్షలు
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా ఇప్పటికే జనం స్వచ్ఛందంగా స్వీయ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు, పాలు, ఇతర నిత్యావసర సరకుల దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను మంగళవారం వరకూ సాయంత్రం 6 గంటలకే మూసివేస్తున్నారు. కొన్నిచోట్ల పగలు 12 గంటల తరువాత కొంతవరకూ స్వచ్ఛంద ఆంక్షలు విధించుకోవడంతో సాయంత్రం తర్వాత పట్టణాల్లో జనసంచారం తగ్గుతోంది. మధ్యాహ్నం నుంచి మర్నాడు ఉదయం వరకూ కర్ఫ్యూ విధిస్తే కరోనా వ్యాప్తి తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment