సాక్షి, అమరావతి: గడిచిన తొమ్మిది మాసాలుగా కరోనా నిర్ధారణ, నియంత్రణ, చికిత్సల విషయంలో దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మరో మైలు రాయిని అధిగమించింది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 20 శాతం జనాభాకు పైగా కరోనా టెస్టులు పూర్తి చేసింది. 1.07 కోట్ల టెస్టులు పూర్తయిన నేపథ్యంలో 20 శాతం మందికి టెస్టులు చేసినట్లయింది.
దేశంలో ఏ రాష్ట్రమూ 20 శాతం జనాభాకు ఇప్పటి వరకు టెస్టులు చేయలేదు. ఇప్పటికే ప్రతి పది లక్షల జనాభాకు ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఏపీ.. తాజాగా ఎక్కువ మందికి పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఘనత సాధించింది. ఏపీతో పోలిస్తే ఒక్క కేరళ మినహా మిగతా ఏ రాష్ట్రమూ ఏపీకి దరిదాపుల్లో లేవు. ప్రతి పది లక్షల మందికి (మిలియన్ జనాభాకు) ఆంధ్రప్రదేశ్ 2,01,631 టెస్టులతో దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతూనే ఉంది.
రాష్ట్రంలో 510 మందికి పాజిటివ్
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,495 పరీక్షలు చేయగా 510 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,07,67,117 మందికి పరీక్షలు చేయగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,75,025కి చేరింది. ఒక్క రోజులో 665 మంది కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,62,895కి చేరింది. తాజాగా ముగ్గురి మృతితో మొత్తం మరణాలు 7,052కి చేరాయి. యాక్టివ్ కేసులు 5,078 ఉన్నాయి రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేటు 8.13 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment