
సాక్షి, అమరావతి: కోవిడ్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక, రవాణా కాలుష్యం తగ్గడంతో గాలిలో నాణ్యత పెరిగింది. మే నెలలో అయితే చాలాచోట్ల గతం కంటే సగానికి పైగా గాలి నాణ్యత పెరగడం విశేషం. కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 20 చోట్ల గాలి నాణ్యతను గుర్తించే వ్యవస్థలు ఉన్నాయి. వీటినుంచి సేకరించిన తాజా గణాంకాలు గాలిలో నాణ్యత పెరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఒక ప్రాంతంలో పీఎం 10 (పర్టిక్యులర్ మ్యాటర్), పీఎం 2.5, ఎస్‌వో2 (సల్ఫర్ డయాక్సైడ్), ఎన్‌వో2 (నైట్రోజన్ డయాక్సైడ్), 03 (ఓజోన్) వంటి పలు కాలుష్య కారకాలు గాలిలో ఎంతమేరకు ఉన్నాయనే దానిని బట్టి గాలి నాణ్యతను నిర్ధారిస్తారు. గాలి నాణ్యత సూచిక (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్–ఏక్యూఐ) 50 పాయింట్ల లోపు ఉంటే ఆ ప్రాంతంలో గాలి నాణ్యత బాగున్నట్టుగా గుర్తిస్తారు. 51 నుంచి 100 ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్టు పరిగణిస్తారు.
101 నుంచి 200 వరకూ ఉంటే ఒక మోస్తరుగా నాణ్యత ఉన్నట్టు.. 201–300 మధ్య ఉంటే నాణ్యత తక్కువ ఉన్నట్టు, 301–400 మధ్య ఉంటే బాగా తక్కువ నాణ్యత ఉన్నట్టు, 401–500 మధ్య ఉంటే గాలి నాణ్యత అసాధారణ స్థాయికి తగ్గినట్టు పరిగణిస్తారు. సాధారణంగా 200 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే ఆ ప్రాంతంలోని ప్రజలకు శ్వాసకోస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
75 నుంచి 50 పాయింట్లకు తగ్గిన ‘ఇండెక్స్’
రాష్ట్రంలో జనవరిలో సగటు గాలి నాణ్యత 75 పాయింట్లు ఉండగా.. ఫిబ్రవరిలో 72, మార్చిలో 70, ఏప్రిల్‌లో 68 పాయింట్లుగా నమోదైంది. మే నెలలో ఏకంగా 50 పాయింట్లకు తగ్గింది. విశాఖ, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, అమరావతి ప్రాంతాల్లో సాధారణంగా గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. అమరావతిలో వాహన కాలుష్యం, మిగిలిన ప్రాంతాల్లో పారిశ్రామిక కాలుష్యం వల్ల గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. లాక్‌డౌన్ వల్ల పరిశ్రమలు మూతపడటం, వాణిజ్య కార్యకలాపాలు చాలావరకూ స్తంభించిపోవడం, రవాణా వాహనాలు రాకపోకలు తగ్గడంతో వాతావరణ కాలుష్యం తగ్గి గాలిలో నాణ్యత పెరిగింది.
ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగం కూడా దాదాపు తగ్గడంతో గాలి నాణ్యత పెరిగిందని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నంలో జనవరిలో 113 పాయింట్లు ఉన్న ఏక్యూఐ.. మే నెలలో 68కి చేరుకుంది. రాజమండ్రిలో జనవరిలో 120 ఉన్న ఏక్యూఐ మే నెలలో రెండు రెట్లు తగ్గి 36కి చేరింది. కాకినాడలో జనవరిలో 103 ఉన్న ఏక్యూఐ మే నెలలో 36కి.. అమరావతిలో జనవరిలో 98 ఉన్న ఏక్యూఐ మే నెలలో 36కి చేరింది. తిరుపతిలో మాత్రం స్వల్పంగా గాలి నాణ్యత తగ్గడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment