చింతపల్లి ప్రాంతంలో పెరుగుతున్న ఆల్ పైన్స్ చెట్లు
చింతపల్లి(పశ్చిమగోదావరి జిల్లా): డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా... అంటూ చాలామంది వ్యంగ్యంగా అంటుంటారు. కానీ, చాలా దేశాల్లో డబ్బులను చెట్ల నుంచే తయారు చేస్తారు. మన దేశంలో చెట్ల నుంచి కరెన్సీ నోట్లు తయారు చేయకపోయినా... ఇందుకోసం ఉపయోగించే అరుదైన ఆల్‌పైన్స్ వృక్షాలు మాత్రం మన దగ్గర దశాబ్దాలుగా పెరుగుతున్నాయి.
చదవండి: శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర చీమల దండయాత్ర.. హడలిపోతున్న జనం..
వాటిలో అల్లూరి జిల్లాలోని చింతపల్లి ప్రాంతం కూడా ఒకటి. కొన్ని దశాబ్దాల కిందట అటవీ శాఖ ఆధ్వర్యంలో పరిశోధనల కోసం చింతపల్లి మండలంలోని కృష్ణాపురం, చిన్నగెడ్డ అటవీ ప్రాంతాల్లో 20 హెక్టార్లలో ఆల్‌పైన్స్ మొక్కలను శాస్త్రవేత్తలు నాటారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటంతో చెట్లు బాగా పెరిగాయి. దీంతో మరో పది హెక్టార్లకు ఆల్‌పైన్స్ మొక్కల సాగును విస్తరించారు.
అమెరికా, కెనడా వంటి దేశాల్లో...
అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాల్లో ఆల్ పైన్స్ వృక్షాల కలప నుంచే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు. ఆయా దేశాల్లో మెత్తని స్వభావం కలిగిన ఆల్‌పైన్స్ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. అందువల్ల కరెన్సీ నోట్ల తయారీకి పూర్తిగా వీటిపైనే ఆధారపడతారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మన దేశంలో ఆల్‌పైన్స్ వృక్షాల పెంపకం తక్కువగా ఉండడం వల్ల నగదు తయారీకి ఉపయోగించడం లేదు. కరెన్సీ తయారీకి సంబంధించిన యంత్ర సామగ్రి కూడా అందుబాటులో లేదు. దీంతో ఈ కలపను ఫర్నిచర్, ఇళ్లలో కబోర్డులు, ఫ్లోరింగ్, అలంకరణ వస్తువుల తయారీ వంటి వాటికి వినియోగిస్తున్నారు.
పర్యాటకులకు కనువిందు...
మన దేశంలో హిమాలయాలు, పశ్చిమ కనుమలు, రాష్ట్రంలోని చింతపల్లిలో గల ఎత్తయిన చల్లని వాతావరణం కలిగిన ప్రాంతాల్లో మాత్రమే ఆల్‌పైన్స్ చెట్లు పెరుగుతాయి. చాలా ఎత్తుగా ఉండే ఈ చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. వేసవిలో సేదదీరేందుకు అనువుగా ఉంటాయి.
చింతపల్లి ప్రాంతం అనువైనది
ఎత్తయిన పర్వత శ్రేణి ప్రాంతంలో ఉన్న చింతపల్లి అటవీ ఏరియాలో ఆల్‌పైన్స్ చెట్లను పెంచేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మన దేశంలో తక్కువ ప్రాంతాల్లో ఈ చెట్లు పెంచడం వల్ల కరెన్సీ తయారీకి సరిపడా కలప ఉత్పత్తి కావడం లేదు. దీంతో కరెన్సీ తయారీకి ఉపయోగించడం లేదు. విదేశాల్లో ఎక్కువగా ఈ చెట్ల కలప ద్వారానే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు.
– శ్రీనివాసరావు, అటవీ శాఖ రేంజ్ అధికారి, చింతపల్లి
Comments
Please login to add a commentAdd a comment