సాక్షి, అమరావతి: అక్రమాలకు పాల్పడుతున్న 613 ప్రైవేటు డీఎడ్ కాలేజీల గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ డీఎడ్ (డైట్స్) కాలేజీలు 14 ఉండగా ప్రైవేటువి 780 వరకు ఉన్నాయి. గత ఏడాది ఇదే కారణంతో 167 కాలేజీల గుర్తింపును పాఠశాల విద్యా శాఖ రద్దు చేసింది. అవి న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. వీటిలో కొన్ని మళ్లీ ఈ ఏడాది గుర్తింపునకు దరఖాస్తు చేశాయి. అయితే అవి సమర్పించిన పత్రాలు తప్పుడువని తేలడంతో వాటికి గుర్తింపు ఇవ్వలేదు. డీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి డీఈఈసెట్–2022 ప్రవేశ పరీక్షలు ఇటీవల జరిగాయి. వీటికి 5,800 మంది హాజరు కాగా 4,800 మంది అర్హత సాధించారు. ప్రైవేటు కాలేజీల గుర్తింపు రద్దవడంతో ఈసారి డీఎడ్ కౌన్సెలింగ్‌ను ప్రభుత్వ కాలేజీలకే పరిమితం చేయనున్నారు. ఈ కాలేజీల్లో వివిధ మాధ్యమాలు, సబ్జెక్టుల కోర్సులలో సీట్లు 2 వేల వరకు ఉన్నాయి.
గతంలో అర్హులు లేకున్నా అనేక అక్రమాలు
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డీఎడ్ ప్రవేశాలు అక్రమాలమయంగా మారాయి. ఏటా కోట్లాది రూపాయలు ముడుపులు వెళ్లేవి. గతంలో ఏటా డీఈఈసెట్‌కు 60 వేల మంది వరకు దరఖాస్తు చేసేవారు. వీరిలో అర్హత మార్కులు సాధించే వారి సంఖ్య 5 వేల లోపే ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడంతో కాలేజీలు లెక్కకు మించి ఉండేవి. 2014–15 నాటికి రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్ కాలేజీలు 505 ఉండగా వాటిలో 26,350 సీట్లు ఉండేవి. 2018లో వీటి సంఖ్య 869కి చేరింది. 2019కు వచ్చేసరికి 1,043కి పెరిగిపోయింది. సీట్లు 65 వేలకు చేరాయి. డీసెట్ రాసే వారి సంఖ్యే 50వేల లోపు.
వారిలో అర్హత సాధించే వారి సంఖ్య 5 వేలకు మించదు. సీట్లు భర్తీ కాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించేవి. దీంతో అర్హత మార్కులు తగ్గిస్తూ ఉత్తర్వులు వెలువడేవి. డీసెట్‌లో ఓసీ, బీసీలకు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి. అప్పుడే డీఎడ్‌లో సీటు వస్తుంది. అయితే, ఈమేరకు మార్కులు సాధించే వారు కరువవడంతో కాలేజీలు అప్పటి అధికార పార్టీ నేతలు కొందరికి భారీగా ముడుపులిచ్చేవి. దీంతో అర్హత మార్కులను ఓసీ, బీసీలకు 35 శాతానికి తగ్గించేవారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పూర్తిగా ఎత్తివేసేవారు.
అయినా సగానికిపైగా సీట్లు మిగిలేవి. వీటి భర్తీకి యాజమాన్యాలు అడ్డదారులు తొక్కేవి. డీసెట్‌లో అర్హత సాధించని వారితో పాటు అసలు డీసెట్‌కు దరఖాస్తు చేయని వారిని కూడా చేర్చుకొనేవి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇలాం టి అక్రమాలపై ఉక్కుపాదం మోపింది. 2020–20 21లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ఈ బ్యాచ్‌లో అక్రమ పద్ధతిలో చేరిన దాదాపు 25వేల మంది విద్యార్థులను ప్రభుత్వం పరీక్షలకు అనుమతించలేదు. విద్యార్థ్ధులు నష్టపోరాదన్న మానవతా దృక్పథంతో వారికి ఇటీవల పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు ఆ కాలేజీల అనుమతులను రద్దు చేసింది.
613 డీఎడ్ కాలేజీల గుర్తింపు రద్దు
Published Fri, Jul 22 2022 4:11 AM | Last Updated on Fri, Jul 22 2022 8:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment