పేదల ఆశలు, భావోద్వేగాలపై దెబ్బ కొట్టారు | Decision of single judge to stop construction of houses is unthinkable Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పేదల ఆశలు, భావోద్వేగాలపై దెబ్బ కొట్టారు

Published Sun, Oct 10 2021 2:35 AM | Last Updated on Sun, Oct 10 2021 8:06 AM

Decision of single judge to stop construction of houses is unthinkable Andhra Pradesh - Sakshi

జీవో 367లోని 3వ మార్గదర్శకాన్ని కొట్టేసిన సింగిల్‌ జడ్జి, అదే మార్గదర్శకం ప్రకారం లబ్ధిదారులకు కన్వేయన్స్‌ డీడ్స్‌ స్థానంలో డీ–ఫాం పట్టా ఇవ్వాలని ఆదేశించడం అనాలోచితం. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు భూమి సరిపోదని చెప్పారు. అది సరిపోదని ఏ చట్టంలో లేదు. లబ్ధిదారులకు ఎంత భూమి ఇవ్వాలన్నది పూర్తిగా ప్రభుత్వాల పరిధిలోని అంశం. లబ్ధిదారుల సంఖ్య, అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా కేటాయింపు జరుగుతుంది. కేటాయింపు ప్రభుత్వ విధాన నిర్ణయం అయినప్పుడు ఎంత ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వమే సరైన న్యాయ నిర్ణేత అవుతుంది. 
– రాష్ట్ర ప్రభుత్వం

నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ నిర్ధేశించిన విధానంలోనే ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించిన గదుల విస్తీర్ణం ఉంది. సింగిల్‌ జడ్జి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జీవోల్లోని పలు క్లాజులను కొట్టేశారు. చక్కటి ప్రణాళికతో రోడ్లు, లైట్లు, మంచి నీరు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, విద్యుత్, పార్కులు, పాఠశాలలతో పాటు ఇతర కనీస వసతులు కల్పిస్తున్న విషయాన్ని విస్మరించారు.   

రాజ్యాంగ విధి విధానాలను, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం మహిళల పేరుతో మాత్రమే పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒక వేళ పురుషులకు, ట్రాన్స్‌జెండర్లకు సైతం పట్టాలు ఇవ్వాలన్నదే సింగిల్‌ జడ్జి ఉద్దేశం అయితే ఆ మేర ఆదేశం ఇవ్వాలే తప్ప, మహిళలకు ఇవ్వాలన్న మార్గదర్శకాన్ని మొత్తంగా కొట్టేసి ఉండకూడదు.    
 – రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇల్లు లేని పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. ఆ తీర్పును రద్దు చేయాలని ధర్మాసనాన్ని కోరింది. పేదల కోసం సదుద్దేశంతో తీసుకొచ్చిన పథకాన్ని ఆపాలని ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా రాజ్యాంగం నిర్ధేశించిన హద్దులను, లక్ష్మణ రేఖను సింగిల్‌ జడ్జి దాటారని పేర్కొంది. సింగిల్‌ జడ్జి తీర్పు వల్ల 25 లక్షల మంది లబ్ధిదారులు ఎలా ముందుకెళ్లాలో తెలియక క్రాస్‌రోడ్‌లో నిల్చునే పరిస్థితి వచ్చిందని, వారి భావోద్వేగ బంధంపై దెబ్బ పడిందని తెలిపింది.

మహిళలకే ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ కోర్టుకెక్కిన పిటిషనర్లలో పలువురి భార్యలు ఇళ్ల పట్టాలు పొందారని వివరించింది. హౌస్‌ మోషన్‌ రూపంలో అత్యవసరంగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఈ అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని రిజిస్ట్రీ ద్వారా ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను, వివరాలను ప్రధాన న్యాయమూర్తి పరిశీలిస్తుండగానే, కేంద్ర ప్రభుత్వం ఆయన బదిలీకి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను నోటిఫై చేసింది. దీంతో ఈ అప్పీల్‌పై విచారించడం నైతికంగా సబబు కాదని భావించి, దీనిని పక్కనపెట్టారు. ప్రభుత్వ అప్పీల్‌లోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.  

లబ్ధిదారుల మనసులో భయాందోళన  
► ప్రజా సంక్షేమాన్ని ఆశించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు.. ప్రాథమిక హక్కులకు, మానవ హక్కులకు రాజ్యాంగ విరుద్ధమన్న రీతిలో సింగిల్‌ జడ్జి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన గురించి పిటిషనర్లు తమ పిటిషన్‌లో ఎలాంటి అభ్యర్థన చేయలేదు. కానీ సింగిల్‌ జడ్జి మాత్రం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందన్న అభిప్రాయానికి వచ్చారు.  
► 25 లక్షల మందికి పట్టాలు ఇచ్చాం. అందులో 15.6 లక్షల మందికి ఇళ్లు మంజూరు అయ్యాయి. 9 లక్షల మంది ఇంటి నిర్మాణ పనులు చేపట్టి వాటిని పూర్తి చేసే దశలో ఉన్నారు. మిగిలిన వారు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. తమ తమ ఇళ్లపై లబ్ధిదారులు తమ కష్టార్జితాన్ని వెచ్చించారు. ఈ దశలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు వారి మనసులో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది.   

మౌలిక వసతుల కోసం ఇప్పటికే భారీగా ఖర్చు  
► భూముల సేకరణ, లేఔట్ల రూప కల్పన, మౌలిక వసతుల కల్పన తదితరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రజా సంక్షేమం కోసం ఇంత భారీ మొత్తాలను ఖర్చు చేసినప్పుడు ఈ పథకం చట్ట ప్రకారం తప్పు అన్న నిర్ణయానికి సింగిల్‌ జడ్జి వచ్చే ముందు పూర్తి స్థాయిలో మా వాదన వినిపించేందుకు అవకాశం ఇచ్చి ఉండాల్సింది. 
► సింగిల్‌ జడ్జి తీర్పు వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం వచ్చింది. ఈ తీర్పు వల్ల నిర్మాణాలు నిలిచి పోవడంతో అది తమపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందన్న ఆందోళనలో లబ్ధిదారులు ఉన్నారు. సింగిల్‌ జడ్జి తీర్పు అటు ప్రభుత్వానికి, ఇటు లబ్ధిదారులకు పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ తీర్పు అమలును నిలుపుదల చేయాలి. 
► సామాజిక అసమానతలను తొలగించి, లబ్ధిదారుల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు రాజ్యాంగం నిర్ధేశించిన విధానాలకు లోబడి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో జోక్యం చేసుకునేటప్పుడు న్యాయమూర్తి స్వీయ నియంత్రణ పాటించాల్సింది. 
► సింగిల్‌ జడ్జి తన తీర్పులో ప్రస్తుత కేసుకు వర్తించని అనేక అంశాలను ప్రస్తావించారు. వాదనల సందర్భంగా ప్రభుత్వం 8 తీర్పులను ప్రస్తావించింది. పిటిషనర్లు ఎలాంటి తీర్పులను ప్రస్తావించలేదు. అయితే సింగిల్‌ జడ్జి మాత్రం తన తీర్పులో ఏకంగా 77 తీర్పులను ప్రస్తావించారు.  

ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో పరిధి దాటి వెళ్లకూడదు  
► రాజ్యాంగంలోని అధికరణ 15(3)ను పరిగణనలోకి తీసుకుని పేదలందరికీ ఇళ్ల పథకం కింద మార్గదర్శకాలను రూపొందించింది. అధికరణ 15(3)కు విరుద్ధంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే, వాటిని కొట్టేయవచ్చు. అయితే మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదు.  
► ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన నిర్ణయాల్లో న్యాయస్థానం తన న్యాయ సమీక్ష పరిధి దాటి వెళ్లకూడదు. పిటిషనర్లు లేవనెత్తని అనేక అంశాలను సింగిల్‌ జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు. ఇదే సమయంలో అనేక అంశాల్లో ప్రభుత్వానికి వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదు. 
► సింగిల్‌ జడ్జి తన తీర్పులో పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్, నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్, ఏపీ బిల్డింగ్‌ రూల్స్‌ గురించి చర్చించారు. అయితే వీటి గురించి పిటిషనర్లు కనీస స్థాయిలో కూడా తమ పిటిషన్‌లో ఎలాంటి అభ్యర్థన చేయలేదు. దీంతో సింగిల్‌ జడ్జి లేవనెత్తిన చాలా అంశాలకు సమాధానం ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది.   
► 25 లక్షల మంది లబ్దిదారుల వాదన కూడా వినకుండా సింగిల్‌ జడ్జి వారి ప్రయోజనాలకు విఘాతం కలిగేలా తీర్పు ఇచ్చారు. సాధారణంగా తీర్పు వల్ల ప్రభావితం అయ్యే వారికి నోటీసులు ఇచ్చి, వాదనలు వినడం పరిపాటి. కాని ఈ కేసులో సింగిల్‌ జడ్జి లబ్ధిదారులెవ్వరికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వాదనలు వినకుండా తీర్పు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం.  

పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు  
► ప్రధాన మంత్రి అవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం మార్గదర్శకాల ప్రకారం ఇంటి విస్తీర్ణం విషయంలో నిర్ణయం తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంతేకాక మహిళ పేరు మీదనే ఇంటి పట్టా ఇవ్వడం పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉంది.  
► సింగిల్‌ జడ్జి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వివరాలు కోరి ఉంటే వాటిని ఆయన ముందు ఉంచే వాళ్లం. లబ్ధిదారులకు కన్వేయన్స్‌ డీడ్‌ ఇవ్వాలా? లేక డీ–ఫాం పట్టా ఇవ్వాలా? అన్న అంశం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉంది.  

మళ్లీ కమిటీ అవసరం లేదు.. 
► లబ్ధిదారులకు జరిపిన కేటాయింపులన్నింటికీ కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కేంద్రం ఒక్కో యూనిట్‌కు రూ.1.5 లక్షల సబ్సిడీ కూడా ఇస్తోంది. పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వంగా కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా మరో రూ.30 వేలు సబ్సిడీ కింద మేం ఇస్తున్నాం. అంతేకాక లబ్ధిదారులకు గృహ నిర్మాణం నిమిత్తం ఇసుక ఉచితంగా ఇస్తున్నాం. ఇతర సామగ్రిని రాయితీ ధరకు అందజేస్తున్నాం. ఈ విషయాలను సింగిల్‌ జడ్జి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.  
► అందరికీ ఇళ్లు అన్నది ప్రధాన మంత్రి కల. దీని ప్రకారం 2022 నాటికి అందరికీ ఇళ్లు ఉండాలి. దీంతో నిర్ధిష్ట సమయం ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎంఏవై కింద దేశంలోనే అత్యధిక ఇళ్లు రాష్ట్రానికే మంజూరు అయ్యాయి. ఇందులో భాగంగా తక్కువ సమయంలోనే భూమిని లబ్ధిదారులకు అందుబాటులోకి తెచ్చాం.  
► కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సామాజిక న్యాయం, సాధికార శాఖ, ఆర్థిక శాఖల కార్యదర్శులతో కూడిన పర్యవేక్షణ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. రాష్ట్రానికి ఇళ్లను మంజూరు చేసింది. అందువల్ల సింగిల్‌ జడ్జి ఆదేశించిన విధంగా ఇప్పుడు తిరిగి మరో కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేనే లేదు. 
► పేదలందరికీ ఇళ్ల పథకం పురోగతిని అడ్డుకునేలా ఆదేశాలు ఇస్తే అది పేదలపై, ప్రభుత్వ దార్శనికతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లబ్ధిదారులు సొంత ఇంటి నిర్మాణం కోసం తమ కష్టార్జితాన్ని వెచ్చించారు. వారి ఇంటిపై వారికి భావోద్వేగ బంధం ఏర్పడింది. ఇప్పుడు సింగిల్‌ జడ్జి తీర్పు వారిపై భావోద్వేగ ప్రభావాన్ని చూపుతుంది.  
► గతంలో ఉన్న గృహ నిర్మాణ పథకాలకన్నా ఈ పథకం ఉత్తమమైంది. ఈ విషయాన్ని గుర్తించడంలో సింగిల్‌ జడ్జి విఫలమయ్యారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేయాలి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement