సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్ల సొంత ఆదాయం, సామర్థ్యం క్షీణిస్తోందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయ, వ్యయాలు దశాబ్ద కాలంలో దేశ జీడీపీలో ఒక్క శాతం వద్ద స్తబ్దుగా ఉన్నట్లు తెలిపింది. మెజారిటీ మునిసిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ కాగితాలకే పరిమితమని, వాస్తవికతను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే గ్రాంట్లపైనే మునిసిపల్ కార్పొరేషన్లు ఆధారపడుతున్నాయని, సొంత ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించింది. దేశవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక స్థితిగతులపై ఆర్బీఐ తొలిసారిగా అధ్యయన నివేదికను విడుదల చేసింది.
దక్షిణాఫ్రికా తరహాలో..
పెరుగుతున్న పట్టణ జనాభాకు తగినట్లుగా సేవల్లో నాణ్యత పెరిగేందుకు తక్షణం సొంత ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం దక్షిణాఫ్రికా తరహాలో సంస్కరణలు తేవాలని సూచించింది. బ్రెజిల్, రష్యన్ ఫెడరేషన్, చైనా, దక్షిణాఫ్రికాతో పోల్చి చూస్తే దేశంలో పట్టణ ప్రజలకు కనీస నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు అందించడం చాలా తక్కువ శాతం ఉందని తెలిపింది.
పెరుగుతున్న పట్టణ జనాభాకు మెరుగైన మౌలిక సదుపాయాలు, కనీస ప్రాథమిక సేవలందించేందుకు ఆస్తి పన్ను సంస్కరణలతో పాటు పాలనా సంస్కరణలు తేవాలని సూచించింది. ఆస్తి పన్ను మరింత సమర్థంగా వసూలు చేసే చర్యలు చేపట్టడంతోపాటు యూజర్ చార్జీలు, ప్రకటన పన్ను, పార్కింగ్ ఫీజు, ట్రేడ్ లైసెన్సుల జారీలో పటిష్ట విధానాలను అమలు చేయాలని పేర్కొంది. రహదారులు, సీవరేజ్, మంచినీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పనకు మునిసిపల్ బాండ్లను జారీ చేయాలని సూచించింది.
సీఆర్‌డీఏ బాండ్లతో అత్యధిక రుణం
దేశంలో తొలిసారిగా 1997లో బెంగళూరు మునిసిల్ కార్పొరేషన్, 1998లో అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా రుణాలను సేరించాయని, 2000 సంవత్సరం వరకు తొమ్మిది మునిసిపల్ కార్పొరేషన్లు బాండ్ల జారీ ద్వారా రూ.1200 కోట్ల వరకు సమీకరించినట్లు నివేదికలో ప్రస్తావించింది. జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ ప్రారంభమయ్యాక 2005 నుంచి మున్సిపల్ బాండ్ల జారీ ఆకస్మాత్తుగా నిలిచిపోయిందని పేర్కొంది. తిరిగి 2017–2021 మధ్యలో తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా రూ.3840 కోట్లను సమీకరించినట్లు పేర్కొంది. ఇందులో అత్యధికంగా ఏపీ సీఆర్‌డీఏ బాండ్ల ద్వారా రూ.2000 కోట్లు రుణం తీసుకున్నాయి.
సొంత వనరులు పెంచుకునేలా..
ప్రైవేట్ భూ యజమానులపై భూమి విలువ పన్నులు, బెటర్‌మెంట్ లెవీ, డెవలప్‌మెంట్ చార్జీలు, ఖాళీ భూమి పన్ను మొదలైన మార్గాల ద్వారా సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలని నివేదిక సూచించింది. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను మూలధన వ్యయం కోసం ప్రత్యేకంగా వినియోగించాలని పేర్కొంది. బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల ద్వారా మున్సిపాలిటీలకు రుణాల సేకరణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.
తలసరి అప్పుల్లో తెలంగాణ టాప్
దేశంలో మునిసిపల్ కార్పొరేషన్ల తలసరి రుణాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. తలసరి అప్పు రూ.1750 ఉండగా బిహార్, మహారాష్ట్రలో రూ.600 ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో మునిసిపల్ కార్పొరేషన్లలో తలసరి అప్పు రూ.400 చొప్పున ఉంది.
షరతుల బాండ్లతో అవరోధాలు
దేశంలో మునిసిపల్ బాండ్లకు అనేక షరతులతో అనుమతించడం అవరోధంగా ఉందని నివేదిక తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో బాండ్ల జారీకి అనుమతించినా ద్వితీయ మార్కెట్ లేకపోవడంతో కీలకమైన అడ్డంకిగా ఉందని పేర్కొంది. ఈ సెక్యూరిటీల కోసం మరింత విస్తృతమైన పెట్టుబడిదారుల వ్యవస్థ అవసరమని సూచించింది. పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మునిసిపల్ బాండ్ల ద్వారా స్థిరమైన వనరుల సమీకరణకు ప్రోత్సహించాలని తెలిపింది. ఆర్థిక పెట్టుబడికి అవసరమైన వాతావరణం, సమర్థ నియంత్రణ, పారదర్శకత, మెరుగైన పాలనకు చర్యలు తీసుకోవాలని, స్టాక్ ఎక్సే్చంజీలలో మునిసిపల్ బాండ్లు నమోదయ్యేలా ద్వితీయ మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని పేర్కొంది.
బాండ్ల జారీతో రూ.37,600 కోట్లు
మునిసిపల్ పాలన మెరుగుపరచేందుకు దక్షిణాఫ్రికా రెండు దశాబ్దాలుగా పలు చర్యలు తీసుకుంది. మూడంచెల విధానంలో జనాభా ఆధారంగా షరతులు లేకుండా సమానంగా వనరుల పంపిణీ చేపడుతోంది. అక్కడ 97 మునిసిపాలిటీలు 4.7 బిలియన్ డాలర్లు (రూ.37,600 కోట్లు) బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించాయి.
క్షీణిస్తున్న మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయం
Published Thu, Nov 17 2022 3:49 AM | Last Updated on Thu, Nov 17 2022 3:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment