
నరసన్నపేట: అమరావతి పేరుతో ఒక సామాజిక వర్గ ఆర్థిక ప్రయోజనాలు కాపాడటానికి టీడీపీ నేత చంద్రబాబు కుత్సిత రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు తగిన బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. ఆయన సోమవారం నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి–అరసవల్లి పేరుతో చేపడుతున్న పాదయాత్ర బూటకమన్నారు.
ఈ పేరుతో ఉత్తరాంధ్రలోకి వచ్చి, ఇక్కడివారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే తగిన బుద్ధిచెప్పడం ఖాయమని హెచ్చరించారు. పాదయాత్రను ఉత్తరాంధ్ర వాసులు అడ్డుకుని తీరుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లు వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అయితే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధికి నోచుకుంటుందని, అలాగే కర్నూలు, విజయవాడ కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి విడిపోయి రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. మళ్లీ విభజన నినాదాలు వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, రాష్ట్రం ఆర్థికంగా వెనకబడుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment