తక్కెళ్లపాడులో సీఎం ప్రారంభించనున్న హద్దురాయిని పరిశీలిస్తున్న మంత్రి ధర్మాన
తక్కెళ్లపాడు (జగ్గయ్యపేట): రాష్ట్రంలో భూ వివాదాలను పూర్తిగా తొలగించేందుకే సమగ్ర భూముల రీ సర్వే నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని 2023 నాటికి పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామం నుంచి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 21న ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి శనివారం ఏర్పాట్లను పరిశీలించారు.
కృష్ణదాస్ మాట్లాడుతూ వందేళ్ల అనంతరం సీఎం జగన్ చొరవతో రాష్ట్రంలో భూముల రీ సర్వే జరుగుతోందన్నారు. ఏళ్ల తరబడి గ్రామాల్లో భూ సమస్యలు, భూ సంబంధ కోర్టు కేసులు వంటివి భూముల రీ సర్వే ద్వారా పరిష్కారమవుతాయని తెలిపారు. 13 జిల్లాల సర్వే బృందాలకు ముఖ్యమంత్రి జెండా ఊపి సర్వేను ప్రారంభిస్తారన్నారు. ప్రభుత్వ విప్ ఉదయభాను మాట్లాడుతూ తక్కెళ్లపాడులో రీ సర్వే ప్రారంభించిన అనంతరం జగ్గయ్యపేటలోని ఎస్‌జీఎస్ కళాశాలకు రోడ్డు మార్గం ద్వారా వస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment