సాక్షి, అమరావతి: ట్రాన్స్‌జెండర్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మూడు నెలల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్లను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతిగా గుర్తించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎంత మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత మేర ఉంది? వివక్ష చూపకుండా వారికి ఏ రకమైన ప్రయోజనాలను కల్పిస్తున్నారు? వారికి ఎంత మేర రిజర్వేషన్ కల్పించాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మూడు నెలల్లో సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఆడ, మగతో సమానంగా ట్రాన్స్‌జండర్లను కూడా చూడాల్సిన అవసరం ఉందంది.
ఉద్యోగ నోటిఫికేషన్లలో ట్రాన్స్‌జెండర్ల కాలమ్ పెట్టకపోవడం అనాలోచిత చర్య అని హైకోర్టు ఆక్షేపించింది. అయితే ట్రాన్స్‌జెండర్లకు ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్లు లేవని, అలాంటి పరిస్థితుల్లో ట్రాన్స్‌జెండర్ అయిన పిటిషనర్‌కు ఎస్‌ఐ పోస్టు ఇవ్వాలని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించలేదన్న కారణంతో ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం పోలీసు నియామక బోర్డు 2018లో జారీ చేసిన నోటిఫికేషన్ చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించడం సాధ్యంకాదని హైకోర్టు తెలిపింది. నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ ట్రాన్స్‌జెండర్ గంగాభవాని 2019లో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.సొలొమన్‌రాజు వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టు తీర్పు అమలుకు సిద్ధం..
ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ, ట్రాన్స్‌జెండర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు..
‘సమాజంలో అణగారిన వర్గంగా ఉన్న ట్రాన్స్‌జెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయాత్మక చర్యలు తీసుకోవాలి. ట్రాన్స్‌జెండర్లు శాపానికి గురైన వారిగా బతుకు వెళ్లదీస్తున్నారు. చాలా దీన, దయనీయ పరిస్థితుల మధ్య బతుకుతున్నారు. కొందరు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మానసికంగా, భౌతికంగా, లైంగికంగా వారు పలువురి చేతిలో వేధింపులకు గురవుతున్నారు. రాష్ట్రంలో వారి సంఖ్య చాలా తక్కువ. అయినా కూడా వారికి ఉద్యోగ అవకాశాల్లో వారి దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించడం లేదు.
రాష్ట్రం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఉద్యోగ దరఖాస్తులో తమ లింగం గురించి రాసే అవకాశం కూడా వారికి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా స్త్రీ, పురుషులతో సమానంగా ఉద్యోగ అవకాశాలను నిరాకరించడం కిందకే వస్తాయి. 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల పాలసీ తీసుకొచ్చింది. 2019లో ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది. అయినా కూడా ఇవేవీ కూడా సమర్థవంతంగా అమలు కావడం లేదు. ట్రాన్స్‌జెండర్లను మన రాజ్యాంగం గుర్తించలేదు. అయితే మన పురాణాలు గుర్తించాయి.
కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుల మరణంలో శిఖండి కీలకపాత్ర పోషించిన సంగతి పురాణాల్లో ఉంది. ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందే తప్ప, ఫలానా శాతం మేర రిజర్వేషన్లు కల్పించాలని చెప్పలేదు. పిటిషనర్ ఏ నోటిఫికేషన్‌ను సవాలు చేశారో ఆ నోటిఫికేషన్ అప్పటికి అమల్లో ఉన్న సర్వీసు నిబంధనలకు అనుగుణంగానే ఇచ్చారు. అందువల్ల ఆ నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించడం సాధ్యం కాదు.’ అని జస్టిస్ సత్యనారాయణమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment