ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి మరణించిన ఎస్టీ మహిళ
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి స్పష్టీకరణ
అయినా వైఎస్సార్‌సీపీ కాదని చంపేశారంటూ ఈనాడు దుష్ప్రచారం
ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారా రామోజీ...
రెంటచింతల మండలం మల్లవరం ఘటనలో వాస్తవాల వక్రీకరణ
సాక్షి, నరసరావుపేట: ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనకూ రాజకీయాలు అంటగడుతున్నారు. లేనిపోని ఆరోపణలతో నిస్సిగ్గుగా కట్టుకథలు అల్లేస్తున్నారు. తమ కళ్లముందే సంఘటన జరిగినట్టు తప్పుడు సమాచారంతో అడ్డగోలు వార్తలు వండివార్చేస్తున్నారు.
తాజాగా పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో జరిగిన ఓ ప్రమాద ఘటనను కావాలనే వైఎస్సార్‌సీపీ సర్పంచ్ దగ్గరుండి చేయించినట్టు ఓ అబద్ధాన్ని ఈనాడులో అచ్చేశారు. ప్రతి చిన్న సంఘటన ద్వారా పచ్చనేతలకు మేలు చేసేలా ‘తాగు నీరు అడిగితే... తొక్కించి చంపాడు ‘ అంటూ రామోజీ పైత్యపు రాతకు తెగబడ్డారు.
అసలేం జరిగిందంటే...
మల్లవరం గ్రామంలో నీటి ఎద్దడి ఉండటంతో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతో సర్పంచ్ షేక్ నన్నే సాహెబ్ నీళ్ల ట్యాంక్‌లను ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేయిస్తున్నారు. రోజూ వాటర్ ట్యాంకర్ నడిపే ట్రాక్టర్ డ్రైవర్ శుక్రవారం సెలవు పెట్టాడు. అయినా నీటికోసం ప్రజలు ఇబ్బంది పడతారేమోనన్న ఉద్దేశంతో సర్పంచ్ సాహెబ్ శుక్రవారం ట్యాంకర్ బాధ్యత మణికంఠ నాయక్ అనే వేరే డ్రైవర్‌కు అప్పగించారు.
ట్రాక్టర్ డ్రైవింగ్‌లో అంత నైపుణ్యంలేని మణికంఠ పొలం నుంచి గ్రామంలోకి వచ్చే క్రమంలో రివర్స్ చేస్తూ వెనుక ఉన్న సామునిబాయి అనే మహిళను చూసుకోకుండా ఢీకొట్టడంతో టైర్ కింద కాలు పడి విలవిలలాడింది. అది చూసి స్థానికులు కేకలు వేశారు. కంగారు పడిన డ్రైవర్ కాపాడుదామనే తొందరలో ట్రాక్టర్ మళ్లీ ముందుకు వెనక్కి నడిపారు దీంతో మరోసారి ఆమెపైకి ట్రాక్టర్ ఎక్కింది. తీవ్రమైన రక్తస్రావం కావడంతో మాచర్ల ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో ఆ మహిళ చనిపోయింది.
సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ కె.వెంకట నారాయణరెడ్డి మల్లవరం గ్రామంలో సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. ప్రత్యక్ష సాక్షి, మృతురాలి చెల్లి కొడుకు బాణావత్ కృష్ణనాయక్ మాట్లాడుతూ.. మృతురాలు తనకు స్వయానా పెద్దమ్మని ట్రాక్టర్ నడుపుతున్న యువకుడికి డ్రైవింగ్‌లో అనుభవం లేకపోవడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ వెంకటనారాయణరెడ్డికి వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
డ్రైవర్‌కు సరిగా ట్రాక్టర్‌ను నడపడం రాకపోవడమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలోనూ తేలింది.
పచ్చరాతలతో రాజకీయం...
ప్రతి సంఘటననూ పచ్చనేతలకు అనుకూలంగా మలచుకోవాలన్న రామోజీ దురాలోచనవల్ల వాస్తవాన్ని దాచేసి అబద్దాన్ని అచ్చేశారు. సామునిబాయి తాగునీరు అడిగితే ఇవి కేవలం వైఎస్సార్‌సీపీ వారికే ఇస్తామని డ్రైవర్ మణికంఠ చెప్పినట్లు, అక్కడ గొడవ జరిగి ట్రాక్టర్‌తో తొక్కించి చంపినట్టు వండి వార్చారు.
దీన్ని పట్టుకొని చంద్రబాబు, లోకేశ్‌లు సిగ్గులేకుండా విషప్రచారాలు మొదలుపెట్టేశారు. ఈనాడు రాతలు చూసి మల్లవరం గ్రామ ప్రజలు మాత్రం విస్తుపోతున్నారు. రాజకీయాల కోసం ప్రమాదంలో మహిళ మృతి చెందితే ఇలా విషపురాతలు రాస్తారా అంటూ ఛీత్కరించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment