ఎటుచూసినా ఆనందమే | Distribution of housing grant documents to beneficiaries in AP | Sakshi
Sakshi News home page

ఎటుచూసినా ఆనందమే

Published Tue, Jan 5 2021 4:12 AM | Last Updated on Tue, Jan 5 2021 7:02 AM

Distribution of housing grant documents to beneficiaries in AP - Sakshi

తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లే అవుట్‌లోని మోడల్‌ ఇంటి వద్ద సెల్ఫీలు దిగుతున్న లబ్ధిదారులు

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో పండుగలా జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం 11వ రోజు సోమవారం ఉత్సాహంగా సాగింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇంటి స్థలాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తమ వద్దకే వచ్చి ఇళ్ల పట్టాలు ఇస్తుండటంతో లబ్ధిదారుల ఆనందం వర్ణనాతీతంగా ఉంది. సొంతిల్లు లేక ఏళ్ల తరబడి పడిన కష్టాలు తీరుతున్నాయన్న సంతోషం వారి మాటల్లో వ్యక్తమవుతోంది. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు కుటుంబసభ్యులతో కలిసి తమ స్థలం వద్ద ఫొటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. కొందరైతే పట్టా తీసుకున్న వెంటనే ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కనిపించింది. తూర్పుగోదావరి జిల్లాలో 44,458 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 33,639 ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల అగ్రిమెంట్‌ పత్రాలు అందజేశారు.

శాసనమండలి చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మోపిదేవి వెంకటరమణారావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు నంబూరు శంకరరావు, ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 14,631 మందికి ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇంటి పత్రాలు పంపిణీ చేశారు. శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో 12,300 ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. మంత్రులు వెలంపల్లి  శ్రీనివాసరావు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), శాసనమండలిలో చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో 10,484 మందికి ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పందపత్రాలు, ఆస్తిహక్కుపత్రాలు పంపిణీ చేశారు.  

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, గుడివాడ అమర్‌నాథ్, భాగ్యలక్ష్మి, యూవీ రమణమూర్తిరాజు, ఉమాశంకర్‌గణేశ్‌ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 9,527 స్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలో 8,335 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆర్‌కే రోజా,  ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, ఎం.ఎస్‌.బాబు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో 7,957 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. వైఎస్సార్‌ జిల్లాలో 7,416 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో 6,316 మందికి పట్టాలను పంపిణీ చేశారు. మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పాల్గొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 5,463 మందికి ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 5,379 ఇళ్ల పట్టాలు, శ్రీకాకుళం జిల్లాలో 3,138 మందికి పట్టాలు పంపిణీ చేశారు. 

కష్టాలు కడతేరాయి 
పదిహేనేళ్లుగా అద్దె ఇంట్లోనే గడుపుతున్నాం. టీడీపీ పాలనలో ఇంటిస్థలం కోసం దరఖాస్తు చేసుకుని నేతలు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రిగా జగనన్న అధికారం చేపట్టిన తరువాత దరఖాస్తు చేసిన వెంటనే ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మాణానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడంతో మా కుటుంబ కష్టాలు కడతేరాయి. ఇందుకు జగనన్నకు మా కుటుంబం రుణపడి ఉంటుంది. 
– వీరాబత్తిన సంధ్య, పేరూరు, కృష్ణా జిల్లా 

సొంతింటి కల నెరవేరింది 
మాది చాలా పేద కుటుంబం. ఇద్దరు పిల్లలతో అద్దె ఇంటిలో ఉంటున్నాం. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం కాళ్లరిగేలా తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. పిల్లలతో మా భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడేదాన్ని. జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటిస్థలం కోసం దరఖాస్తు చేసుకోగా స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేస్తూ పత్రాలు అందించడంతో మా సొంతింటి కల నెరవేరింది. ఇందుకు జగనన్నకు కృతజ్ఞతలు. 
    – వీర్ల సత్యవతి, పేరూరు, ముదినేపల్లి మండలం, కృష్ణాజిల్లా 

మా కుటుంబానికి వెలుగు వచ్చింది 
ఇంటి పట్టా మా కుటుంబానికి వెలుగు తెచ్చింది. కూలి పనులు చేసుకుంటూ కుమార్తె, కొడుకును చదివించుకుంటున్నాను. ఇప్పుడు ఇంటి స్థలంతో పాటు ఇళ్లు కూడా మంజూరైంది. సోమవారం పట్టా తీసుకుని ఇంటి నిర్మాణానికి భూమిపూజ కూడా చేశాం. సీఎం జగన్‌ వల్ల మాకు సొంత స్థలం వచి్చంది. దేవుడు లాంటి వైఎస్‌ జగన్‌కి జీవితకాలం రుణపడి ఉంటాం. 
– కొత్తపల్లె సువార్తమ్మ, మొర్రాయిపల్లె, వైఎస్సార్‌జిల్లా 

ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా 
శాసన మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌  
నరసాపురం రూరల్‌: ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సోమవారం జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదవాళ్లకు స్థలం ఇవ్వడమే కాకుండా, ఇల్లు కట్టకోవడానికి సహకరించే ఓ చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం దేవుడిచ్చిన వరంగా, అల్లా ఇచ్చిన బ్రహా్మండమైన అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ స్థలాలను అమ్ముకునే ప్రయత్నం చేయవద్దని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం  పట్టాలు పంపిణీ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement