తనిఖీల పేరుతో పరిశ్రమల యజమానులను వేధించొద్దు
సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. వారి సంక్షేమమే ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. పరిశ్రమల్లో తనిఖీల పేరుతో యాజమానులను వేధించొద్దని సూచించారు. భద్రతా చర్యల పర్యవేక్షణకు ముగ్గురు కెమికల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌ను నియమించాలని అధికారులు కోరగా.. నియమిస్తామని సీఎం చెప్పారు.
ఈఎస్‌ఐ ఆస్పత్రులకు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.54 కోట్ల విడుదలకు ఆదేశాలిచ్చారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లోని సేవరి్మలను అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వడం ద్వారా.. అక్కడి పరిస్థితులను మెరుగుపరచాలన్నారు. త్వరలో చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు ఇచ్చే హామీని నెరవేరుస్తామన్నారు. కార్మికులతో పాటు ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాల వారికీ బీమా అందిస్తామని చెప్పారు.
ఏఐ సిటీగా అమరావతి..
రాజధాని అమరావతిని ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సిటీగా తీర్చిదిద్దనున్నట్లు సీఆర్‌డీఏపై సమీక్షలో సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి పేరు మీదుగా ఏఐ సిటీ లోగో రూపొందించాలని సూచించారు. సీఆర్‌డీఏ కార్యాలయ భవన నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతిలో నివాసించాలనుకునే వారి కోసం గతంలో తాము తెచ్చిన ‘హ్యాపీనెస్ట్’ ప్రాజెక్టును పునరుద్ధరించాలని సీఎం సూచించారు.
రాజధానికి 3,558 ఎకరాలు సేకరించాల్సి ఉందని, రెండు గ్రామాల రైతులు భూములిచ్చేందుకు ముందుకొస్తున్నారని సీఎంకు అధికారులు తెలిపారు. కాగా, విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డిని సీఎం ఆదేశించారు.
విశాఖలో ఫేజ్–1లో రూ.11,400 కోట్ల వ్యయంతో 46 కిలోమీటర్ల మేర, ఫేజ్–2లో రూ.5,734 కోట్ల వ్యయంతో 30 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మిస్తామన్నారు. ఫేజ్–1 పనులను నాలుగేళ్లలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. విజయవాడలో మెట్రో రైలు పనులనూ వేగవంతం చేయాలన్నారు.
‘మంకీ పాక్స్’ టెస్ట్ కిట్ ఆవిష్కరణ
మంకీ పాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం దేశంలోనే మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను విశాఖ మెడ్‌టెక్ జోన్ అందుబాటులోకి తెచ్చింది. దీనిని సీఎం ఆవిష్కరించారు. ఈ కిట్‌ను తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. మెడ్‌టెక్ భాగస్వామి అయిన ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్‌డెక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ పేరుతో దీనిని తయారు చేసినట్లు మెడ్‌టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ తెలిపారు. మేక్ ఇన్ ఏపీ బ్రాండ్‌కు ఈ కిట్ దోహదపడుతుందని చంద్రబాబు అన్నారు.
జనవరి నుంచి పూర్తి స్థాయిలో రాజధాని పనులు
మంత్రి నారాయణ వెల్లడి
సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణానికి సంబంధించి అధ్యయనం జరుగుతోందని, అన్ని పనులకు టెండర్లు పిలిచి జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
‘ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములిస్తున్న రైతులకు.. వారి గ్రామాల్లోనే తిరిగి ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడలో రెండు దశల్లో మెట్రో ప్రాజెక్ట్ చేపట్టేలా డీపీఆర్ సిద్ధం చేశాం. విశాఖపట్నంలో రెండు దశల్లో నాలుగు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి అంచనాలను కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశించారు’ అని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment